- Home
- Life
- Food
- Egg Curry: ఎగ్ కర్రీ ఇలా చేశారంటే.. చికెన్, మటన్ కూడా బలాదూర్. నోరూరించే తవా మసాలా
Egg Curry: ఎగ్ కర్రీ ఇలా చేశారంటే.. చికెన్, మటన్ కూడా బలాదూర్. నోరూరించే తవా మసాలా
Egg Curry: ఎగ్ కర్రీ ప్రతీ ఒక్కరి ఇంట్లో దాదాపు కామన్‌గా ఉండే వంటకం. అయితే రెగ్యులర్‌గా కాకుండా కాస్త వెరైటీగా అండా తవా మసాలా చేస్తే ఫిదా అవ్వాల్సిందే. ఇంట్లోనే సులభంగా తయారు చేసుకునే ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలు ఏంటి.? తయారీ విధానం ఏంటంటే.?

కావాల్సిన పదార్థాలు
ఈ వంటకం కోసం 8 ఉడికించిన గుడ్లు తీసుకుని వాటిని మధ్యలో సగానికి కోయాలి. ఒక కప్పు కొత్తిమీర, 4 పచ్చిమిర్చులు, 15 వెల్లుల్లి రెబ్బలు, చిన్న అల్లం ముక్క, 4 పెద్ద ఉల్లిపాయలు సన్నగా తరిగినవి అవసరం. అలాగే చిన్న నిమ్మకాయంత చింతపండు నానబెట్టినది, 2 టేబుల్ స్పూన్లు ధనియాల పొడి, 2 టీ స్పూన్లు కారం పొడి, అర టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ గరం మసాలా, తగినంత ఉప్పు, కొద్దిగా జీలకర్ర, చివరగా కొత్తిమీర తరుగు సిద్ధంగా ఉంచుకోవాలి.
ముందుగా గుడ్లను వేయించుకోవాలి
పాన్‌లో కొద్దిగా నూనె వేసి ఒక టీ స్పూన్ జీలకర్ర వేయాలి. తర్వాత ఒక పచ్చిమిర్చి ముక్కలు, కొద్దిగా కొత్తిమీర వేసి కలపాలి. ఇప్పుడు గుడ్లను కోసిన భాగం కిందకు వచ్చేలా పాన్‌లో ఉంచాలి. వాటిపై కొద్దిగా ఉప్పు, కారం పొడి చల్లి రెండు నిమిషాలు వేయించాలి. తర్వాత గుడ్లను తిప్పి మరో వైపున కూడా ఉప్పు, కారం చల్లి రెండు నిమిషాలు వేయించి స్టౌ ఆఫ్ చేయాలి. అనంతరం గుడ్లను పక్కన పెట్టుకోవాలి.
మసాలా పేస్ట్ తయారీ
కొత్తిమీర, వెల్లుల్లి రెబ్బలు, అల్లం, 2 లేదా 3 పచ్చిమిర్చులను మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఈ పేస్ట్‌నే కూరకు ప్రధాన రుచి తీసుకొస్తుంది. అందుకే కొత్తిమీర తాజాగా ఉండేలా చూసుకోవాలి.
తవా మసాలా ఎలా తయారు చేయాలి?
గుడ్లు తీసిన అదే పాన్‌లో మరోసారి కొద్దిగా నూనె, జీలకర్ర వేయాలి. తర్వాత తరిగిన ఉల్లిపాయలు వేసి గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించాలి. ఇప్పుడు సిద్ధం చేసుకున్న కొత్తిమీర పేస్ట్ వేసి బాగా కలుపుతూ వేయించాలి. పేస్ట్ ముదురు రంగులోకి మారిన తర్వాత చింతపండు రసం కలపాలి. ఆపై ధనియాల పొడి, కారం, పసుపు, గరం మసాలా, ఉప్పు వేసి రెండు నుంచి మూడు నిమిషాలు బాగా ఉడికించాలి. అవసరమైనంత నీరు పోసి మీకు నచ్చిన చిక్కదనం వచ్చే వరకు ఉడికించాలి. మసాలా నుంచి నూనె వేరయ్యే వరకు మరిగించాలి.
గుడ్లను మసాలాలో కలిపి సర్వ్ చేయడం
మసాలా సిద్ధమైన తర్వాత వేయించిన గుడ్లను కోసిన భాగం కిందకు వచ్చేలా కూరలో పెట్టాలి. ఒకటి లేదా రెండు నిమిషాలు అలాగే ఉంచి మసాలా గుడ్లలోకి బాగా పట్టేలా చేయాలి. ఆ తర్వాత గుడ్లను మరో వైపుకు తిప్పి మరో నిమిషం ఉడికించాలి. చివరగా కొత్తిమీర తరుగు, వేయించిన వెల్లుల్లి ముక్కలు చల్లి స్టౌ ఆఫ్ చేయాలి. వేడి వేడిగా చపాతీ, రోటీ, నాన్ లేదా అన్నంతో వడ్డిస్తే అండా తవా మసాలా రుచి మరింత అద్భుతంగా ఉంటుంది.

