Interesting Facts : మనం ఏడ్చినప్పుడు ముక్కు ఎందుకు కారుతుంది..?
Interesting Facts : మనం బాగా నవ్వినా, బాగా ఏడ్చినా కళ్లనుండి నీరు వస్తాయి.. ఇదే సమయంలో ముక్కు కూడా కారుతుంది. బాగా చలిగా ఉన్నా, కొన్నిసార్లు తినే సమయంలోనూ ముక్కు కారుతుంది. ఇలా జరగడానికి కారణాలేంటో తెలుసా?

ముక్కు ఎందుకు కారుతుంది..?
Interesting Facts : మనిషికి పుట్టెడు దుఃఖం వచ్చినా, పట్టరాని సంతోషం వచ్చినా కళ్ళు చెమ్మగిల్లుతాయి. రెండు సందర్భాలకు అస్సలు సంబంధం ఉండదు... కానీ కంటనీరు కామన్. అయితే ఇలా విషాద బాష్పాలైన, ఆనంద బాష్పాలైనా కంటికి ముక్కు కూడా తోడవుతుంది... కన్నీటితో పాటు ముక్కు కూడా కారుతుంది. అందుకే ఏడ్చేవారు కంటినే కాదు ముక్కును తుడుచుకుంటూ ఉంటారు. కళ్లనుండి నీరు ఓకే... మరి ముక్కునుండి నీరు ఎందుకు వస్తుంది. ఇందుకు కారణమేంటో ఇక్కడ తెలుసుకుందాం.
ఏడ్చేటప్పుడు ముక్కు ఎందుకు కారుతుందో తెలుసా?
పట్టరాని సంతోషం లేదంటే భరించలేని బాధలో ఆటోమెటిగ్గా కళ్లవెంట నీరు వస్తాయి... ఇదే సమయంలో ముక్కు కూడా తడిబారుతుంది. ఇలా ముక్కులోంచి నీరు రావడానికి కూడా కన్నీరే కారణమట. కన్నీరు అధికంగా ఉత్పత్తి అయినప్పుడు చిన్నచిన్న నాళాల ద్వారా అవి ముక్కులోకి చేరతాయి. దీంతో ముక్కులోని కుహరం ఈ నీటివల్ల శ్లేష్మాన్ని ఉత్పత్తి చేస్తుంది... లేదంటే పొడి శ్లేష్మాన్ని కరిగింది ద్రవంగా మారుస్తుంది. ఈ ద్రవాలే ముక్కులోంచి బయటకు వచ్చేది. అందుకే కన్నీటితో పాటు ముక్కును కూడా తరచూ తుడుచుకోవాల్సి ఉంటుంది.
చలిగాలుల్లో ముక్కు ఎందుకు కారుతుంది..?
ఇక ఉష్ణోగ్రతలు బాగా తగ్గి చలి పెరిగినా జలుబు చేసి ముక్కు కారుతుంది... దీనికి ముక్కులో ఉండే ప్రత్యేక ఏర్పాటు కారణం. చల్లని గాలిని పీల్చినప్పుడు అది నేరుగా ఊపిరితిత్తుల్లోకి వెళ్లకుండా ముక్కులోని సున్నితమైన పొర అడ్డుకుంటుంది. ఇది గాలిని వేడిచేశాకే ఊపిరితిత్తులకు చేరుస్తుంది. ఈ క్రమంలోనే శ్లేష్మం ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది... కాబట్టి ముక్కులోంచి నీరు కారుతుంది. వేడి వాతావరణంలో గాలిలో తేమ ఎక్కువగా ఉంటుంది కాబట్టి శ్లేష్మం ఉత్పత్తి తక్కువగా ఉంటుంది... అందుకే ముక్కుకారడం ఉండదు.
తినేటప్పుడు ముక్కు ఎందుకు కారుతుంది..?
కొందరికి అహారం తీసుకునే సమయంలో ముక్కు కారుతుంది. అయితే ఎక్కువ మసాలాలు, ఘాటు పదార్థాలు తినడంవల్ల అప్పుడప్పుడు ఇలా జరగడం సాధారణమే. బాగా వేడిగా లేదా ఘాటుగా ఉండే అహారం తీసుకున్నపుడు నాడీ వ్యవస్థ ప్రేరేపితం అవుతుంది... దీనివల్ల ముక్కు కారడం ప్రారంభం అవుతుంది.
అయితే కొందరికి అహారంతో సంబంధంలేకుండా తినే ప్రతిసారి ముక్కు కారుతుంది. దీనికి సైనైల్ రైనోరియా కారణమని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ సమస్య వయసు మీదపడ్డవారిలో ఎక్కువగా ఉంటుందని... ఇది పెద్ద సమస్య కాదని చెబుతున్నారు. అయితే ఈ సమస్య ఎక్కువగా ఉంటే వైద్యులను సంప్రదించడం మంచిదని… మెడిసిన్స్ ద్వారా తగ్గించవచ్చని అంటున్నారు.

