ముక్కు నుంచి రక్తం ఎందుకు కారుతుందో తెలుసా?
ఎండాకాలం కొంతమందికి మరింత కష్టంగా మారుతుంది. ముఖ్యంగా ఎండాకాలంలో ముక్కు నుంచి రక్తం వచ్చే వారికి. అసలు ఎండాకాలంలో ఈ సమస్య ఎందుకు వస్తుంది? ఇది రాకుండా ఉండటానికి ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
ఎండకాలం మనల్ని ఎన్నో సమస్యల బారిన పడేస్తుంది. పెరిగిపోతున్న ఎండల వల్ల డీహైడ్రేషన్, వడదెబ్బ వంటి ఎన్నో రకాల సమస్యలు వస్తుంటాయి. ఈ సమస్యల్లో ముక్కు నుంచి రక్తస్రావం ఒకటి. దీనిని
ఎపిస్టాక్సిస్ అంటారు. ఎండాకాలంలో ఈ సమస్య చాలా మందికి వస్తుంటుంది. ముఖ్యంగా ఈ సమస్య చిన్నపిల్లలకే ఎక్కువగా వస్తుంటుంది. కొంతమంది పెద్దవారికి కూడా ఈ సమస్య వస్తుంది. అసలు ఈ సమస్య ఎందుకు వస్తుంది? ఇది రాకుండా ఉండటానికి ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..
ముక్కు నుంచి రక్తం ఎందుకు వస్తుంది?
ముక్కు నుంచి రక్తం కారడానికి ఎన్నో కారణాలు ఉంటాయి. కానీ ఎండాకాలంలో ఈ సమస్య రావడానికి ప్రధాన కారణం.. గాలిలో తేమ లేకపోవడం. ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల గాలిలో తేమ బాగా తగ్గుతుంది. దీని వల్ల ముక్కులో ఉన్న చిన్న రక్త కేశనాళికలు పగులుతాయి. దీంతో ముక్కు నుంచి రక్తం కారడం ప్రారంభమవుతుంది. ఇదే కాకుండా ముక్కులో వేలు పదేపదే పెట్టడం వల్ల కూడా ముక్కు నుంచి రక్తం కారుతుంది. అలాగే ముక్కుకు గాయం కావడం, రక్తపోటు పెరగడం లేదా ముక్కును చాలా గట్టిగా రుద్దడం లేదా ముక్కు ఎండిపోవడం వల్ల కూడా ముక్కు నుంచి రక్తం కారుతుందని నిపుణులు చెబుతున్నారు.
ఇది ప్రమాదకరమా?
ముక్కు నుంచి రక్తం కారడం పెద్దగా ఆందోళన కలిగించే విషయం కాదు. కానీ కొన్ని సందర్భాల్లో జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఖచ్చితంగా హాస్పటల్ కు వెళ్లాలి. మీ ముక్కు నుంచి తరచుగా రక్తస్రావం అవుతున్నట్టైతే రక్తస్రావం త్వరగా ఆగకపోతే లేదా అనారోగ్య సమస్యలు ఉంటే వెంటనే హాస్పటల్ కు వెళ్లాలి.
దీన్ని ఎలా నివారించాలి?
ముక్కు తేమ- చాలా సార్లు ముక్కు పొడిబారడం వల్లే ముక్కు నుంచి రక్తం కారుతుంది. అందుకే ముక్కు తేమను కాపాడుకోవడానికి ఆవిరి పట్టండి. అలాగే నాసికా స్ప్రే వాడటం లేదా కాసేపు చల్లటి నీటితో ముఖం కడుక్కోవడం వంటివి చేయండి. దీనివల్ల మీ ముక్కు ఎండిపోకుండా ఉంటుంది.
ముక్కును కప్పి ఉంచండి - మీరు బయటకు వెళ్లాల్సి వస్తే ముక్కుకు ఏదైనా అడ్డం పెట్టుకోండి. దీంతో వేడి గాలి ముక్కు లోపలికి వెళ్లదు. దీంతో ముక్కు ఎండిపోదు.
ముక్కులో వేలు పెట్టొద్దు - ముక్కులో వేలు పెట్టే అలవాటును మానుకోవాలి. ఎందుకంటే ముక్కులో వేలు పెట్టడం వల్ల శ్లేష్మ పొర ఎండిపోతుంది. అలాతగే ఇది రక్తస్రావం కలిగిస్తుంది. కాబట్టి ముక్కులో వేలు పెట్టకండి.
విటమిన్లు ఎక్కువగా ఉండే ఆహారం - విటమిన్ సి, విటమిన్ కె ఎక్కువగా ఉన్న ఆహారాలను తినండి. ఎందుకంటే ఈ ఫుడ్స్ రక్తం గడ్డకట్టడానికి సహాయపడతాయి. రక్తం కారకుండా చేస్తాయి.
ముక్కు నుంచి రక్తం కారుతుంటే ఏం చేయాలి?
ముక్కు నుంచి రక్తం కారుతున్నట్టైతే మొదటగా మీ తలను కొద్దిగా పైకి ఉంచి నిటారుగా కూర్చోండి. దీంతో ముక్కు నుంచి ఎక్కువ రక్తం కారదు. అలాగే ముక్కు ద్వారా కాకుండా నోటి ద్వారా శ్వాస తీసుకోండి. అలాగే మీ వేళ్లతో ముక్కును నొక్కండి. దీంతో ఒత్తిడి కారణంగా రక్తస్రావం తగ్గుతుంది. అలాగే ఐస్ ముక్కను ముక్కుపై రుద్దండి. దీనివల్ల రక్తనాళాలు కుంచించుకుపోయి రక్తస్రావం ఆగుతుంది.