Independence Day: దేశానికి స్వాతంత్య్రం వచ్చిన రోజున మహాత్మా గాంధీ ఏం చేశారో తెలుసా?
Independence Day: 1947 ఆగస్టు 15న దేశమంతా స్వాతంత్య్ర వేడుకల్లో మునిగిపోతే మహాత్మా గాంధీ ఎందుకు ఏడ్చారో తెలుసా? స్వాతంత్ర వేడుకల ఉపన్యాసం కూడా ఇవ్వకుండా గాంధీ ఆ రోజు ఏం చేశారు? ఎక్కడున్నారు?

ఆగస్టు 15, 1947: బాపూజీ రోజంతా ఏం చేశారు? తెలిస్తే షాక్ అవుతారు
1947, ఆగస్టు 15న భారత్‌కు ఆంగ్లేయుల పాలన నుంచి స్వేచ్ఛ లభించింది. శతాబ్దాల నిరీక్షణ ఫలించడంతో దేశవ్యాప్తంగా ప్రజలు ఆనందోత్సాహాల్లో తేలిపోయారు. పల్లెల నుంచి పట్టణాల వరకు ఎక్కడ చూసినా పండుగ వాతావరణం కనిపించింది. అయితే, భారతదేశానికి స్వాతంత్య్రం తెచ్చిన జాతిపిత మహాత్మా గాంధీ ఆ చరిత్రాత్మక రోజున ఏం చేస్తున్నారు? వేడుకల్లో పాల్గొన్నారా? లేదా? అనే ప్రశ్న ప్రతి ఒక్కరి మనసులోనూ మెదులుతుంది. నిజానికి, ఆ రోజున గాంధీజీ చేసిన పనుల గురించి చాలామందికి తెలిసింది చాలా తక్కువ. గాంధీ హెరిటేజ్ పోర్టల్ లోని వివరాల ప్రకారం ఆ రోజు ఆయన ఏం చేశారో పూర్తి వివరాలు తెలుసుకుందాం.
ఢిల్లీలో వేడుకలు.. గాంధీజీ మాత్రం కోల్‌కతాలోనే
భారతదేశమంతా స్వాతంత్య్ర సంబరాలు జరుపుకుంటున్న సమయంలో మహాత్మా గాంధీ రాజధాని ఢిల్లీలో లేరు. ఆయన ఆ సమయంలో కలకత్తా లో ఉన్నారు. అందరినీ ఆశ్చర్యపరిచే విషయమేమిటంటే, దేశానికి స్వేచ్ఛ వచ్చిన ఆ శుభదినాన గాంధీజీ ఎలాంటి పెద్ద వేడుకలు జరుపుకోలేదు. కనీసం స్వాతంత్య్ర ఉత్సవాల గురించి ఉపన్యాసం కూడా ఇవ్వలేదు. ఆయన ఆ రోజంతా ఉపవాసం, ప్రార్థనలు, ప్రజలను కలవడానికే కేటాయించారు. గాంధీ హెరిటేజ్ పోర్టల్ సమాచారం ప్రకారం.. ఆగస్టు 15, 1947న ఆయన పూర్తిగా ప్రార్థనలు, ఉపవాసంలో గడిపారు.
హింస, అల్లర్ల మధ్య శాంతి కోసం ప్రయత్నం
ఒకవైపు స్వాతంత్య్రం వస్తుందన్న ఆనందం ఉన్నప్పటికీ, మరోవైపు దేశం రెండు ముక్కలుగా విడిపోతోంది. నాటి విభజన కారణంగా అనేక ప్రాంతాల్లో హిందూ-ముస్లింల మధ్య ఘోరమైన అల్లర్లు జరుగుతున్నాయి. ఇలాంటి ఉద్రిక్త పరిస్థితుల్లో గాంధీజీ ఢిల్లీలో సంబరాలు చేసుకోకుండా, కలకత్తాలోనే ఉండి శాంతి భద్రతలను కాపాడేందుకు ప్రయత్నించారు. ఆగస్టు 13 నుంచే ఆయన కలకత్తాలోని బెలియాఘాటా ప్రాంతంలో ఉన్న 'హైదరీ మ్యాన్షన్'లో బస చేశారు. మతపరమైన అల్లర్ల మధ్య హిందూ-ముస్లింల మధ్య ఐక్యత, శాంతిని నెలకొల్పడానికే ఆయన అక్కడ ఉన్నారు.
24 గంటల పాటు కఠిన ఉపవాసం
ఆగస్టు 14 సాయంత్రం జరిగిన ప్రార్థనా సమావేశంలోనే గాంధీజీ ఒక కీలక విషయాన్ని వెల్లడించారు. ఆగస్టు 15న తాను 24 గంటల పాటు ఉపవాసం ఉంటానని స్పష్టం చేశారు. ఆ రోజున కేవలం ప్రార్థనలు చేయడం, రాట్నంపై నూలు వడకడం మాత్రమే ఆయన కార్యక్రమాలుగా పెట్టుకున్నారు. గాంధీజీకి ఆగస్టు 15 కేవలం సంతోషించే రోజు మాత్రమే కాదు. ఎందుకంటే ఒకవైపు దేశానికి స్వేచ్ఛ వచ్చినా, మరోవైపు విభజన వల్ల లక్షలాది మంది ప్రజలు హింస, బాధలను అనుభవిస్తున్నారు. అందుకే ఆయన ఆ రోజును ఆత్మపరిశీలనకు కేటాయించారు.
గాంధీజీ దర్శనం కోసం తరలివచ్చిన జనం
ఆగస్టు 15 ఉదయం నుంచే గాంధీజీ బస చేసిన ప్రదేశానికి ప్రజలు భారీగా రావడం ప్రారంభించారు. గాంధీ హెరిటేజ్ పోర్టల్ ప్రకారం, రోజంతా ఆయనను కలవడానికి జనాలు వస్తూనే ఉన్నారు. గాంధీజీ మనవరాలు మను గాంధీ ఆ రోజు సంఘటనల గురించి రాస్తూ.. బాపూజీ ఆ రోజు తన వ్యక్తిగత పనులేవీ చేసుకోలేకపోయారని చెప్పారు. ప్రతి అర గంటకు ఒకసారి ఆయన ప్రజలను కలవడానికి బయటకు రావలసి వచ్చింది. వేలాది మంది ప్రజలు ఆయన దర్శనం కోసం నిరంతరం వేచి చూశారు.
నాయకులు, విద్యార్థులతో భేటీ
కలకత్తాలో హిందూ, ముస్లిం వర్గాల మధ్య తీవ్ర ఉద్రిక్తత నెలకొని ఉంది. అందువల్ల గాంధీజీ ప్రజలతో పాటు స్థానిక నాయకులను నిరంతరం కలుస్తూనే ఉన్నారు. దేశ ప్రజలంతా ఆప్యాయత, శాంతితో కలసి జీవించినప్పుడే ఈ స్వాతంత్య్రానికి నిజమైన అర్థం ఉంటుందని ఆయన గట్టిగా నమ్మారు. ఆ రోజున గాంధీజీ పలు పార్టీల సభ్యులతో కూడా ప్రత్యేకంగా సమావేశమై మాట్లాడారు. అలాగే విద్యార్థులతోనూ ముచ్చటించారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన ఆ రోజున కూడా గాంధీజీ సమయమంతా దేశ సమస్యలు, ప్రజలతో చర్చలకే సరిపోయింది.
సాయంత్రం ప్రార్థనా సమావేశం.. శాంతి సందేశం
రోజంతా ఉపవాసం, సమావేశాల తర్వాత గాంధీజీ సాయంత్రం ప్రార్థనా సమావేశంలో పాల్గొన్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత మన ముందున్న అతిపెద్ద సవాలు శాంతిభద్రతలను కాపాడుకోవడమేనని ఆయన సందేశం ఇచ్చారు. కలకత్తాలో హిందూ, ముస్లింలు కలసికట్టుగా జీవించి దేశంలోని మిగిలిన ప్రాంతాలకు ఆదర్శంగా నిలవాలని కోరారు. నిజానికి ఆగస్టు 14నే గాంధీజీ మాట్లాడుతూ.. స్వాతంత్య్ర దినోత్సవం తనకు ఒకవైపు సంతోషాన్ని, మరోవైపు దేశ విభజన వల్ల తీవ్ర దుఃఖాన్ని కలిగిస్తోందని వ్యాఖ్యానించారు.

