Telangana Travel: తెలంగాణలోని ఈ అందమైన ప్రాంతం.. విదేశాల్లో ఉన్న ఫీలింగ్ ఇస్తుంది
Telangana Travel: తెలంగాణాలోని ఒక అందమైన ప్రాంతం గురించి ఇక్కడ చెప్పాము. మీరు ఈ ప్రాంతానికి వెళితే ఏదో విదేశాలకు వెళ్లామా అనే అనుభూతి కలుగుతుంది. పచ్చని చెట్లు, మధ్యలో నీలి సరస్సు, నీటిపై వేటా బ్రిడ్జి కన్నుల పండువగా అనిపిస్తుంది.

తెలంగాణాలోని విదేశం
పచ్చని కొండల నడుమ, నీలిరంగు నీటిపై తేలియాడే చిన్న చిన్న దీవులు చూస్తుంటే ఏదో విదేశీ లొకేషన్లో విహరిస్తున్న అనుభూతి కలుగుతుంది. తెలంగాణ నేలపై అలాంటి ప్రకృతి అద్భుతం లక్నవరం సరస్సు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా అటవీ ప్రాంతంలో దాగిన ఈ జలాశయం కాకతీయుల ఇంజనీరింగ్ ప్రతిభకు నిదర్శనం. సుమారు పదివేల ఎకరాల్లో విస్తరించిన ఈ సరస్సు చుట్టూ దట్టమైన వృక్ష సంపద పరుచుకుని పర్యాటకులకు ప్రశాంతతను అందిస్తుంది. నగరంలోని హారన్ల మోతతో విసిగిపోయిన వారికి ఇక్కడి వాతావరణం మనసుకు హాయినిస్తుంది.
పదమూడు దీవులు
ఇక్కడి ప్రధానంగా సరస్సు మధ్యలో ఉన్న సహజసిద్ధమైన పదమూడు దీవులు ఎంతో అందంగా ఉంటాయి. ఈ దీవులను కలుపుతూ నీటిపై వేలాడే రోప్ బ్రిడ్జిపై నడవడం ఒక థ్రిల్ అనే చెప్పాలి. గాలి తాకిడికి బ్రిడ్జి నెమ్మదిగా ఊగుతుంటే కింద స్వచ్ఛమైన నీటి అలలు, ఎదురుగా పచ్చదనం మనసుకు ఎంతో హాయిగా అనిపిస్తాయి. స్పీడ్ బోట్లు, సాధారణ మోటార్ బోట్లలో నీటిపై రయ్మని దూసుకుపోతూ దీవుల అందాలు చూస్తే విదేశాల్లో తిరుగుతున్న అనుభవం కలుగుతుంది. సాయంత్రం వేళల్లో ఆకాశం బంగారు వర్ణంలోకి మారుతుంటే నీటిపై ప్రతిబింబించే దృశ్యాలు ఫోటోగ్రఫీ ప్రేమికులను కట్టిపడేస్తాయి.
సరస్సు మధ్యలో కాటేజీ
సరస్సు మధ్యలోని దీవిపై ఏర్పాటు చేసిన కాటేజీల్లో బస చేసే అవకాశం ఉంది. రాత్రి వేళల్లో నీటి చప్పుడు వింటూ, ఆకాశంలోని నక్షత్రాలను చూస్తూ జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోయే అనుభూతిని మూటగట్టుకోవచ్చు. వర్షాకాలం ముగిసిన తర్వాత, శీతాకాలంలో లక్నవరం పర్యటన అత్యంత ఆహ్లాదకరంగా ఉంటుంది. సమీపంలోని యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయాన్ని కూడా ఒకే రోజులో సందర్శించవచ్చు. తక్కువ ఖర్చుతో విదేశీ ద్వీప పర్యటనను తలపించే అనుభవాన్ని సొంతం చేసుకోవడానికి లక్నవరం మంచి డెస్టినేషన్.








