Quietest Room: ప్రపంచంలో అత్యంత నిశ్శబ్దమైన రూమ్ ఇది.. ఆ ప్రశాంతతను తట్టుకోగలరా?
Quietest Room: చుట్టూ ఎలాంటి గొడవలు, శబ్దాలు లేకుండా.. ప్రశాంతంగా ఉండాలని చాలా మంది కోరుకుంటారు. మరి, ప్రపంచంలోనే అత్యంత నిశ్శబ్దంగా ఉంటే గది గురించి తెలుసా? ఆ గదిలో ఎవరూ ఎందుకు ఉండలేరు..?

ఒక్క రోజు కూడా ఉండలేని గది..
గొడవలు, వాహనాల రద్దీ లేకుండా... ప్రశాంతంగా ఉండే ఇల్లు కావాలని చాలా మంది కోరుకుంటారు. ప్రశాంతంగా, నిశ్శబ్దంగా ఉండటం చాలా మందికి నచ్చుతుంది. కానీ, మీ గుండె చప్పుడు మీకే క్లియర్ గా వినిపించే అంత ప్రశాంతమైన, ఎటువంటి శబ్దం లేని ప్రదేశంలో మిమ్మల్ని బంధిస్తే ఎలా ఉంటుంది? ఒక 10, 15 నిమిషాలు బాగానే ఉంటుంది. కానీ, గంటలు గడిచే కొద్దీ ఆ నిశ్శబ్దమే మిమ్మల్ని భయపెట్టడం ప్రారంభిస్తుంది. ప్రపంచంలోనే అత్యంత నిశ్శబ్దమైన గది గురించి మీకు తెలుసా?
ఈ గది ఎక్కడ ఉంది..?
ప్రపంచంలోనే అత్యంత నిశ్శబ్దమైన గదుల్లో రెండు ముఖ్యమైనవి ఉన్నాయి. ఒకటి ఆర్ఫీల్డ్ లాబొరేటరీస్. ఇది అమెరికాలోని మిన్నెసోటా రాష్ట్రంలో ఉన్న మిన్నియాపాలిస్ లో ఉంది. మరోకటి మైక్రోసాఫ్ట్ హెడ్ క్వార్టర్స్. ఇది అమెరికాలోని వాషింగ్టస్ లో ఉన్న మైక్రోసాఫ్ట్ బిల్డింగ్ 87లో ఉంది. గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్ ప్రకారం ఈ గదులు -20 నుండి -24.9 డెసిబెల్స్ ధ్వని స్థాయిని కలిగి ఉంటాయి. మానవులు వినగలిగే అతి తక్కువ శబ్దం 0 డెసిబెల్స్ అయితే, ఇది దానికంటే తక్కువ.
ఈ గది స్పెషాలిటీ ఏంటి?
మనం సాధారణంగా మాట్లాడేటప్పుడు లేదా ఏదైనా శబ్దం చేసినప్పుడు ఆ ధ్వని తరంగాలు గోడలకు తగిలి వెనక్కి (Echo) వస్తాయి. కానీ ఈ గదిలోకి వెళ్తే 99.99% శబ్దం పీల్చుకుంటుంది. అంటే అక్కడ ఎలాంటి 'ఎకో' లేదా ప్రతిధ్వని ఉండదు. మీరు అక్కడ ఎంత గట్టిగా అరిచినా ఆ శబ్దం గాలిలోనే మాయమైపోతుంది. మరి, ఈ గదిని ఎందుకు నిర్మించారు అనే అనుమానం మీకు రావచ్చు. విమానాలు, మొబైల్ మైక్రోఫోన్లు, స్పీకర్లు మెడికల్ పరికరాల శబ్ద నాణ్యతను అత్యంత ఖచ్చితత్వంతో టెస్టింగ్ చేయడం కోసం సైంటిస్టులు ఈ గదిని ఉపయోగిస్తారు.
ఈ గదిని ఎలా నిర్మించారు?
బయట ఉన్న ఎలాంటి ధ్వని, వైబ్రేషన్స్ లోపలికి రాకుండా దీనిని ఒక "రూమ్ ఇన్ ఎ రూమ్" (Room within a room) మోడల్లో నిర్మించారు. కాంక్రీట్, మందపాటి స్టీల్ గోడలతో బయటి గదిని కట్టారు. లోపలి గదిని బయటి గోడలకు తాకకుండా, భారీ ప్రకంపనలను పీల్చుకునే పెద్ద స్ప్రంగ్లపై గాలిలో తేలియాడేలా నిలబెట్టారు. గోడలు, సీలింగ్ ,నేలపై దాదాపు 3 అడుగుల పొడవున్న ఫైబర్గ్లాస్ ఆకారపు శోషకాలను (Wedges) అమర్చారు. నేల మీద నడిచే శబ్దం కూడా వినపడకుండా నేలపై నెట్ మాత్రమే ఉంటుంది.
మన గుండె చప్పుడు మాత్రమే వినపడుతుందా?
ఈ గదిలో బాహ్య శబ్దాలు ఏవీ లేకపోవడంతో, మన చెవులు లోపలి శబ్దాలపై దృష్టి పెడతాయి. మీ గుండె నార్మల్ గా కొట్టుకున్నా కూడా పెద్ద డ్రమ్స్ వాయించినట్లుగా మీ చెవులకు వినపడుతుంది. అంతేకాదు, నరాల్లో రక్తం ప్రవహించే శబ్దం,ఊపిరితిత్తులు గాలి పీల్చే శబ్దం కూడా స్పష్టంగా వినిపిస్తాయి. అంతెందుకు మీ కనురెప్పలు వేస్తే వచ్చే చిన్నపాటి శబ్దం కూడా మీ చెవులకు స్పష్టంగా తెలుస్తుంది.
ఈ గదిలో ఎవరూ ఎక్కువసేపు ఎందుకు ఉండలేరు?
సాధారణంగా ఎవరైనా ఈ గదిలో లైట్లు ఆపి కూర్చుంటే 45 నిమిషాలకు మించి ఉండలేరు. దీని వెనక కూడా కారణాలు ఉన్నాయి. మనం నిలబడటానికి లేదా నడవడానికి మన చెవులు, కళ్ళు పంపే శబ్ద ప్రతిధ్వనుల సమాచారం పైనే బ్రెయిన్ ఆధారపడుతుంది. ఈ గదిలో శబ్ద సంకేతాలు శూన్యమవ్వడంతో మనుషులకు మైకం వచ్చి నిలబడలేక కూలిపోతారు. శరీర అంతర్గత శబ్దాలు తీవ్రంగా వినబడటం వల్ల మెదడు కంగారుపడుతుంది. నిశ్శబ్దం ఎక్కువయ్యే కొద్దీ పిచ్చి పట్టినట్లు అనిపిస్తుంది, భయానక దృశ్యాలు లేదా శబ్దాలు ఉన్నట్లు భ్రమలు కలుగుతాయి. అందుకే, ఈ గదిలో ఎవరూ ఎక్కువసేపు ఉండలేరు.





