- Home
- Feature
- Millionaire Village: మన దేశంలోనే అత్యంత ధనిక గ్రామం... పేదరికం నుంచి మలీనియర్ గ్రామంగా ఎలా మారింది?
Millionaire Village: మన దేశంలోనే అత్యంత ధనిక గ్రామం... పేదరికం నుంచి మలీనియర్ గ్రామంగా ఎలా మారింది?
Millionaire Village:ఒకప్పుడు పేదరికంలో అల్లాడిపోయిన ఓ గ్రామం, కనీస పంటలు కూడా పండక ఇబ్బంది పడిన రైతులు.. కానీ, సడెన్ గా.. ఇప్పుడు గ్రామం రూపురేఖలే మారిపోయాయి. దేశంలోనే ధనిక గ్రామంగా మారిపోయింది.

Millionaire Village
మన దేశంలో చాలా గ్రామాలు ఉన్నాయి. అసలు.. గ్రామాలే మన దేశానికి పట్టుగొమ్మలు. ప్రతి గ్రామంలోనూ ఏదో ఒక ప్రత్యేకత ఉండే ఉంటుంది. కొన్ని గ్రామాలు చేతి వృత్తులకు, మరి కొన్ని ఆతిథ్యానికి పేరుగాంచితే... మన దేశంలోని ఓ గ్రామం మాత్రం.. మన దేశంలోనే అత్యధిక ధనిక గ్రామం గా మారింది. ఒకప్పుడు పేదరికంతో అల్లాడిన గ్రామం... ఎలా ధనిక గ్రామంగా మారింది. అసలు దేశంలో మిలియనీర్ విలేజ్ ఆఫ్ ఇండియా ఏది? ఈ గ్రామం ప్రపంచానికి ఎందుకు ఆదర్శం..?
ఎండమావి నుంచి మిలియనర్ గ్రామంగా...
మహారాష్ట్రంలోని అహ్మద్ నగర్ జిల్లాలో ఉన్న హివారే బజార్ అనే గ్రామం.. మన దేశంలోనే ధనిక గ్రామంగా మారింది. ఒకప్పుడు తీవ్ర కరువు, నీటి ఎద్దడి, పేదరికంతో అల్లాడిన ఈ గ్రామంలో 1990 తర్వాత చాలా మార్పులు వచ్చాయి. ఆ గ్రామ అధ్యక్షుడు పోపట్ రావ్ పవార్ నాయకత్వంలో.. గ్రామ ప్రజలందరూ ఏకమై తమ ఊరిని మార్చుకునేందుకు నడుం బిగించారు. వారే కష్టపడి శ్రమించి... తమ గ్రామాన్ని అభివృద్ధి పరుచుకున్నారు. కరువుతో అల్లాడిన గ్రామాన్ని అందంగా మార్చారు.
ముఖ్యంగా, వర్షపు నీటిని సంరక్షించారు. చెక్ డ్యామ్ లు, కాంటూర్ కందకాలు తవ్వి వర్షపు నీటిని భూమిలోకి ఇంకేలా చేశారు. తమ వద్ద ఉన్న నీటి నిల్వలకు తగినట్లుగా ఏ పంటలు వేయాలో రైతులు ముందుగానే ప్రణాళికలు వేసుకోవడం మొదలుపెట్టారు. గ్రామంలో ఏ నిర్ణయం అయినా.. అందరూ కలిసి తీసుకునేవారు. ఫలితంగా భూగర్భ జలాలు ఊహించని రీతిలో పెరిగాయి. వ్యవసాయం, పాడిపరిశ్రమ అభివృద్ధి చెందింది. దీంతో.. గ్రామంలోని ప్రజలంతా సంపన్నులుగా మారారు. అందుకే, ఈ గ్రామాన్ని మిలియనీర్ విలేజ్ అని పేరు వచ్చింది.
ఈ గ్రామంలో ఏం చూడొచ్చు..?
ఇది సాధారణ పర్యాటక ప్రదేశం కాకపోయినప్పటికీ, గ్రామీణాభివృద్ధి, సేంద్రియ, సుస్థిర వ్యవసాయంపై ఆసక్తి ఉన్నవారికి ఇది ఒక మంచి స్టడీ టూర్ లా పనికొస్తుంది. ఈ గ్రామాన్ని సందర్శిస్తే.. వ్యవసాయం ఎలా చేయాలి అనే విషయంలో ఓ క్లారిటీ వస్తుంది. ఊరి చుట్టూ నిర్మించిన చెక్ డ్యామ్ లు, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ నిర్మాణాలు, కందకాలు కూడా కనిపిస్తాయి. నీటి లభ్యతను బట్టి తక్కువ నీటితో ఎక్కువ ఆదాయాన్ని ఇచ్చే పంటలను ఎలా సాగు చేస్తున్నారో తెలుసుకోవచ్చు. అంతేకాదు, గ్రామం మధ్యలో అతి పెద్ద పురాతన హనుమాన్ ఆలయం కూడా ఉంది. గ్రామీణాభివృద్ధి ప్రాజెక్టులను అర్థం చేసుకోవడానికి స్థానిక గైడ్ను ఏర్పాటు చేసుకుని ఊరంతా తిరగడం మంచిది.
ఈ గ్రామానికి ఎలా చేరుకోవాలి?
ఈ గ్రామానికి మీరు రోడ్డు మార్గంలో వెళ్లాలి అనుకుంటే.. పూణే నుంచి వెళ్లొచ్చు. పూణే నుంచి సుమారు 110 కిలో మీటర్ల దూరంలో ఇది ఉంది. కార్ లేదా ట్యాక్సీ ద్వారా 2 నుంచి 3 గంటల్లో చేరుకోవచ్చు. రైలు మార్గంలో వెళ్లాలి అనుకుంటే, అహ్మద్ నగర్ వరకు రైలు లేదా బస్సులో వెళ్లి అక్కడి నుంచి లోకల్ రవాణా ద్వారా గ్రామానికి చేరుకోవచ్చు.





