- Home
- Feature
- Cashew Capital: మన దేశపు జీడిపప్పు రాజధాని ఏదో తెలుసా? ఇక్కడి నుంచే ప్రపంచ దేశాలకు ఎగుమతి!
Cashew Capital: మన దేశపు జీడిపప్పు రాజధాని ఏదో తెలుసా? ఇక్కడి నుంచే ప్రపంచ దేశాలకు ఎగుమతి!
Cashew Capital: చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు జీడిపప్పును ఇష్టంగా తింటారు. స్వీట్లు, బిర్యానీ, పాయసం ఇలా ఎన్నో వంటకాల్లో జీడిపప్పుది ప్రత్యేక స్థానం. మనం ఎంతో ఇష్టంగా తినే ఈ జీడిపప్పు రాజధాని మన దేశంలోనే ఉంది. అది ఎక్కడో తెలుసుకుందాం.

భారతదేశపు జీడిపప్పు రాజధాని
జీడిపప్పును మనం చాలా రకాల వంటల్లో వాడుతుంటాం. ఇది వంటలకు ప్రత్యేకమైన రుచిని ఇస్తుంది. అయితే ఈ జీడిపప్పునకు దేశీయంగానే కాకుండా అంతర్జాతీయ మార్కెట్‌లోనూ మంచి డిమాండ్ ఉంది. మనం ఎంతో ఇష్టంగా తినే ఈ జీడిపప్పు వెనుక ఒక పెద్ద పరిశ్రమ ఉందని, మన దేశంలోనే దీనికి ప్రత్యేకమైన రాజధాని ఉందని మీకు తెలుసా…? అదే కేరళ రాష్ట్రంలోని కొల్లాం నగరం. దీన్ని భారతదేశపు జీడిపప్పు కేంద్రంగా, ప్రపంచ జీడిపప్పు రాజధానిగా కూడా పిలుస్తారు. ఇక్కడ దశాబ్దాలుగా జీడిపప్పు ప్రాసెసింగ్, నాణ్యత పరిశీలన, ప్యాకింగ్, వ్యాపారం, ఎగుమతులు పెద్ద ఎత్తున కొనసాగుతున్నాయి.
కొల్లాంకి ప్రత్యక గుర్తింపు
కేరళలోని కొల్లాం నగరానికి జీడిపప్పు పరిశ్రమతో విడదీయలేని అనుబంధం ఉంది. ఇక్కడ జీడిపప్పు పరిశ్రమ 1920 ప్రాంతంలో వేగంగా అభివృద్ధి చెందింది. ఒకప్పుడు ఇక్కడ వందల సంఖ్యలో ప్రాసెసింగ్ యూనిట్లు పనిచేశాయి. విదేశీ మార్కెట్లకు నాణ్యమైన జీడిపప్పును సరఫరా చేయడంలో కొల్లాం ప్రత్యేక గుర్తింపు సంపాదించింది. అందుకే ఈ నగరానికి ప్రపంచ జీడిపప్పు రాజధాని అనే పేరు వచ్చింది.
జీడిపప్పు ప్రాసెసింగ్ అంటే?
తోటల నుంచి సేకరించిన జీడి పిక్కల నుంచి గింజలను వేరు చేస్తారు. వాటిని శుభ్రం చేసి, ఆరబెట్టి, అవసరమైన పద్ధతుల్లో వేడి లేదా ఆవిరితో శుద్ధి చేస్తారు. అనంతరం గట్టి పెంకును తొలగించి లోపల ఉన్న జీడిపప్పును బయటకు తీస్తారు. దానిపై ఉండే పలుచటి పొరను తొలగించి, పరిమాణం, రంగు, నాణ్యత ఆధారంగా గ్రేడ్లుగా విభజిస్తారు. చివరగా ప్యాకింగ్ చేసి మార్కెట్లకు పంపిస్తారు.
కొల్లాం ప్రాంతంలోని అనేక కుటుంబాలకు ఈ పరిశ్రమ జీవనాధారంగా మారింది. జీడిపప్పు పరిశ్రమ కేవలం వ్యాపారానికే పరిమితం కాకుండా స్థానిక ప్రజల ఆర్థిక పరిస్థితి, మహిళల ఉపాధి, కుటుంబాల జీవన ప్రమాణాలపై కూడా ప్రభావం చూపింది.
ఈ దేశాల్లో గిరాకీ ఎక్కువ
మన దేశం నుంచి జీడిపప్పు అనేక దేశాలకు ఎగుమతి అవుతోంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, నెదర్లాండ్స్, జపాన్, స్పెయిన్, సౌదీ అరేబియా వంటి దేశాల్లో భారత జీడిపప్పునకు మంచి మార్కెట్ ఉంది. ఈ వ్యాపారం ద్వారా దేశానికి విదేశీ మారకద్రవ్యం లభించడంతో పాటు రైతులు, వ్యాపారులు, ప్రాసెసింగ్ పరిశ్రమలకు ఆదాయం సమకూరుతోంది. అందుకే మన దేశపు జీడిపప్పు పరిశ్రమ చరిత్రలో కొల్లాం నగరానికి ఎప్పటికీ ప్రత్యేక స్థానం ఉంటుంది.





