అమీర్ పేట అమ్మాయి ఓయోకు వెళితేనే జీవితం మారుతుందా... అసలు ఈ సమాజం ఎటుపోతోంది..?
Post Corona World : ప్రస్తుతం ప్రపంచం ఎటుపోతుందో అర్థం కావడంలేదు. కరోనా తర్వాత సామాజిక విలువలు మరింత దెబ్బతిన్నాయి… నేరాలు ఘోరాలు మరింతగా పెరిగిపోయాయి.

కరోనా తరువాతి యుగం మహా దారుణం...
రెండో ప్రపంచ యుద్ధం ముగిసాక (1945) ప్రపంచం నెమ్మదిగా కుదుట పడింది . 1950 నుంచి అనేక దేశాల్లో సుస్థిరాభివృద్ది సాధ్యమైంది. అనేక దేశాలు వలస పాలన నుంచి విముక్తి పొందాయి.. సంక్షేమ రాజ్యాలుగా ఏర్పాటయ్యాయి. హరిత విప్లవం, పాల వెల్లువ లాంటివి సామాన్య ప్రజలకు ఆర్థిక పరిపుష్టి కలిగించాయి. కొత్తగా అనేక ప్రభుత్వరంగ సంస్థలు వెలిశాయి. యువతకు పెద్ద పెట్టున ఉపాధి లభించింది. ఈ పరిస్థితి 1991 దాక సాగింది.
సోవియెట్ యూనియన్ పతనంతో విశ్వజనీకరణ యుగం మొదలయ్యింది. సాఫ్ట్వేర్ తో సహా అనేక బహుళజాతి సంస్థల్లో ఉద్యోగాల వెల్లువ.. గతానికంటే ఎంతో మెరుగైన జీతాలు... ఉపాధి కోసం యువత ఆవలి తీరాలకు పోవడం, అక్కడ మెరుగైన జీవన ప్రమాణాలను సాధించడం, సంపదను పోగెయ్యడం జరిగింది . అదే సమయంలో తీవ్రమయిన ఆర్థిక అసమానతలు వెలిశాయి.
1. 1950-1991 - ఇదొక యుగం - ప్రభుత్వ రంగం , ఆర్థిక అసమానతల తగ్గింపుపై దృష్టి .. సంక్షేమ పాలన.
2. 1991-2020 - ఇదొక యుగం - గ్లోబల్ ప్రపంచం, సంపద వెల్లువ, అదే సమయం లో ఆర్థిక సమానతలు.. సంక్షేమ పాలన సాగింది... కానీ ఇది కేవలం ఓట్ బ్యాంకు ఆధారితంగా .. ఐసీయూ లో ఉన్నవారికి స్టెరాయిడ్ ఇచ్చినట్టు తయారయ్యింది.
3 . కరోనా తరువాతి యుగం - నేరపూరిత సమాజం వైపు పయనం.
ఈ పోస్ట్ ... కరోనా తరువాత నేటి ప్రపంచం నెమ్మదిగా .. వడివడిగా నేరపూరిత సమాజంగా ఎలా మారుతోంది, దీని పరిణామాలు ఎలా ఉంటాయి? మనం ఏమి చేయాలి? అనే దానిపై.
సమగ్ర అవగాహన కావాలంటే పోస్ట్ లెంగ్త్ పెద్దది కాకతప్పదు.
ఓపిక ఉన్నవారి కోసమే ... మిగతా వారు బై ..
ప్రపంచం ఎటుపోతోంది..?
1. దక్షిణ అమెరికా లోని కొలంబియాలో మొత్తం 2,30,000 హెక్టార్లలో కోకా (కొకెయిన్) పంట సాగవుతోంది . ఇది ఏటా 25 % పెరుగుతోంది.
2. మెక్సికో లో ఇప్పుడు మాదకద్రవ్యాల మాఫియా రాజ్యం. సినాలోఆ కార్టెల్ చేతిలో సగం మెక్సికో. అక్కడ ఆ మాదక ద్యవ్రాల మాఫియా రాజ్యాంగం నడుస్తుంది. ప్రభుత్వాలు వాటి ముందు మోకరిల్లాల్సిందే.
3. వెనుజువెలా అధక్షుడే పెద్ద మాదక ద్రవ్యాల వ్యాపారి. అతన్ని అతని భార్యను అమెరికా సైనిక చర్య ద్వారా పట్టుకొంది. అమెరికా ప్రభుత్వం దాని గూఢచారి సంస్థ CIA పెద్ద డాన్ లు అనేది అందరికీ తెలిసిందే .
3 . సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ను ఉద్యోగం పేరుతొ తీసుకొని వెళ్లి బంధించి బెదిరించి ఆన్లైన్ సైబర్ నేరాలు చేయిస్తున్నారు. కంబోడియా, మయన్మార్, థాయిలాండ్ సరిహద్దులో ఈ ముఠాలు అడ్డుఅదుపు లేకుండా పని చేస్తున్నాయి . కేవలం ఇండియా నుంచే కాకుండా చైనా, హాంకాంగ్ లాంటి దేశాలనుంచి కూడా కిడ్నాప్ లు జరుగుతున్నాయి.
4 . మయన్మార్ సైన్యంలో బాల సైనికులు. పదేళ్ల లోపు పిల్లలను కూడా బలవంతంగా తీసుకొని వెళ్లి సైన్యంలో వెట్టి చేయిస్తున్నారు .
5 . మహిళలను, పిల్లలను కిడ్నాప్ చేసి లైంగిక బానిసలుగా మార్చడం అనేక చోట్ల జరుగుతోంది.
6. పంజాబ్ లో నేరాలు ఇప్పుడు నిత్యకృత్యాలు . కిడ్నాప్, వరుస హత్యలు, గ్యాంగ్ ల మధ్య పోరాటాలు అక్కడ నిత్యకృత్యం.
2020- కరోనా అనంతర ప్రపంచంలో నేరాలే యువతకు ఉపాధి అవకాశాలుగా మారుతున్నాయి .
కొన్ని చీకటి వృత్తులు ఇవిగో!
1. మత్తు పదార్థాల సరఫరా :
గంజాయి , కొకెయిన్, ఎల్ఎస్డీ లాంటి వాటి సరఫరా పంపిణీ, కొత్త వారిని ఊబిలోకి లాగడం, ఒక ప్రాంతం నుంచి మరో చోటకు మత్తు పదార్థాల రవాణా. ఈజీ మనీ కోసం యువత ఈ చీకటి వృత్తిని ఎంచుకొంటున్నారు. అనేక చోట్ల గంజాయి, కోకా లాంటి పంటల సాగు. కొన్ని దేశాలు / ప్రాంతాలు వీటి సాగుపై నడుస్తున్నాయి.
2. సైబర్ నేరాలు :
2024 లో మన దేశ ప్రజల నుంచి సైబర్ నేరగాళ్లు కొట్టేసిన మొత్తం రూ.22,845 కోట్లు. ఇన్వెస్ట్మెంట్ మోసాలు, డిజిటల్ అరెస్ట్ లు , క్రెడిట్ కార్డు మోసాలు, సెక్సటార్షన్ .. ఇప్పుడివి ఏటా రెట్టింపు అవుతున్నాయి. ఇప్పుడు వీరు కృతిమ మేథ సాయం తీసుకొంటున్నారు. జస్ట్ ఫోటో దొరికితే చాలు... ఒక అశ్లీల ఫిలింను తయారు చేసి బ్లాక్ మెయిల్ చేసి సంపదను దోచేసే రోజులు ఎంతో దూరంలో లేవు.
3 . చర్మ వ్యాపారం :
రీల్స్, యూట్యూబ్ ఫిలిమ్స్, మోడల్స్ గా మొదలయ్యి ఓటిటి, అశ్లీల ఇండస్ట్రీ.. అటుపై హనీ ట్రాపింగ్, సెక్సటార్షన్, చైల్డ్ ట్రాఫికింగ్ దాక . ఇదో ఉపాధి అని వేలమంది యువతులు నమ్ముతున్న పరిస్థితి. సొంతంగా ఓన్లీ ఫాన్స్ లాంటి వాటి ద్వారా వర్చువల్ బిజినెస్ సాగిస్తున్నవారు కొందరు.. వ్యవస్థీకృత గ్యాంగ్ లకు చిక్కి జీవితాన్ని నాశనం చేసుకొంటున్నవారు ఎందరో. కేవలం అమ్మాయిలే కాదు అబ్బాయిలు కూడా ఈ రంగంలో.
4 . ప్రకృతి సంపద స్మగ్గ్లింగ్ :
ఇసుక, ఖనిజ సంపద, ఎర్రచందనం, చందనం, ఏనుగు దంతాలు, కస్తూరి జింక ద్రవం, ఖడ్గ మృగం కొమ్ము, పులి గోళ్లు.. ఇలా ఆయా ప్రాంతాల బట్టి. ఈజీ మనీ కోసం స్మగ్లింగ్ ముఠాల్లో గ్యాంగ్ లో చేరుతున్న యువత.
5. కిడ్నాప్, బ్లాక్ మెయిల్ డబ్బులు వసూలు, ఆన్లైన్ అప్పుల వసూళ్లకోసం దౌర్జన్యాలు, పిల్లల్ని కిడ్నాప్ చేసి అవయవ ముఠాలకు బెగ్గింగ్ మాఫియాలకు అమ్మడం, ఫెర్టిలిటీ సెంటర్స్ వద్ద ఆ విక్రేతలుగా ఉపాధి ..(లోకం ఎంత చెడ్డది . సికింద్రాబాద్ లో పట్టుకొన్నారు. మిగతా చోట్ల? ఇప్పటికీ వందలాది కేంద్రాల్లో ఇదే పరిస్థితి హ్యాపీగా మరిచి పోయారు.)
6 . మనీ లాండరింగ్ , పెద్దలకు బినామీలుగా మారడం, సుపారీ హత్యలు.
కారణాలు - పరిష్కారాలు
1. నిరుద్యోగిత :
సాప్ట్ వేర్ స్వర్ణ యుగం ముగిసింది. ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికెషన్స్ రావు. కృతిమ మేథ ఉద్యోగాలను తినేస్తోంది.
కృతిమ మేథ యుగంలో ఉపాధి పొందేందుకు యువతలో విద్యార్థుల్లో నైపుణ్యాలు పెంపొందించాలి. విద్యావవస్థలో సమూల మార్పులు రావాలి. బట్టీ చదువులు, దొంగమార్కులు, చూసి రాతల పరీక్షలు... ఆగిపోవాలి.
2. చదవక పోయినా ప్రతి ఒక్కరి చేతికి డిగ్రీ వచ్చేస్తుంది. చేతిలో సెల్ ఫోన్. అందులో లగ్జరీ లైఫ్ స్టైల్ వీడియోలు. పోలిక. అనుకరణ. కష్టపడకుండా స్వర్గసుఖాలు అనుభవించాలి. దీని కోసం డబ్బు కావాలి. ఈజీ మనీ కోసం నేరాలు.
3 . పాఠశాల దశలోనే చెడు సావాసాలు.. వ్యసనాలు.. మందు-మగువ-మత్తు పానీయాలు.. డబ్బు కావాలి. ముందు పాకెట్ మనీ. .. అటుపై లాప్ టాప్ అమ్మడం.. అటుపై చైన్ స్నాచింగ్. అటుపై పైన చెప్పిన ఏదో ఒక బ్లాక్ వృత్తిలో చేరిక. నేటి బాలలే రేపటి నేరగాళ్లు అనే పరిస్థితి.
4 ."రేపు అనేది భ్రమ.. నేడే వాస్తవం.. కాబట్టి ఏమి చేసైనా స్వర్గ సుఖాలు అనుభవించాల్సిందే" అనే ధోరణి. బీద/దిగువ మధ్య తరగతి కుటుంబం నుంచి యువతి అమీర్ పేట హాస్టల్ కొస్తుంది. శిక్షణ తీసుకొని ఉద్యోగం సంపాదిస్తే నెలకు వచ్చే జీతం ఒక్క రోజు బైక్ ఎక్కి ఓయో హోటల్స్ కు వెళితే వస్తుంది అని తెలుసుకుంటుంది. "నా జీవితం.. నా ఇష్టం.. చెప్పడానికి మీరు ఎవ్వరు?" అనే బ్రెయిన్ వాష్ ఎలాగూ ఉంది. ఆరునెలల్లో సొంత కారు.. బ్యాంకు బాలన్స్.. ఆమెను చూసి మరో పది మంది. ఈ సంపాదన ఎంతకాలం సాగుతుంది? గ్లామర్ అడుగంటాక జీవితం ఎలా అనే ఆలోచన రాదు.. రానివ్వరు.
5 . రీల్స్ లో, ఓటిటిలలో, కామెడీ షో లలో ఇలాంటి వాటిని గొప్పగా చూపిస్తున్నారు. స్మగ్లర్స్ హీరోలుగా, వాంప్ పాత్రలు హీరోయిన్స్ గా. ఇది చదివి మీరు తెలుగు సినిమా గురించి ఆలోచిస్తున్నారా? పంజాబ్ లో పరిస్థితి మరీ దారుణం. పంజాబ్ ఫోక్ సాంగ్స్ లో మాదక ద్రవ్యాలు, గన్స్ నేరాలు, గూండాలు.. ఎప్పుడు ఇవే . చూసి చూసి స్లో పాయిజన్ లాగ యూత్ కు ఎక్కేసింది. ఇంగిత జ్ఞానం చచ్చింది. మంచి చేప్పేవారు వారు ఎవరు ? చిబితే వారిని చీరి చింతకు కట్టేయరా??
యువత కు బ్రెయిన్ వాష్ . ఎవరైనా చెబితే... మోరల్ పోలిసింగ్ చెయ్యడానికి మీరెవ్వరు? అని ఎదురు దాడులు.
6 . యూట్యూబ్ నిండా స్కిన్ షో లు.. అసభ్యకర కంటెంట్ .. క్రైమ్ వీడియో లు .. చంచల్ గూడ, చర్లపల్లి జైలులో ఈ గోడ నడిగినా చెబుతాయి.. హత్య ఎలా చెయ్యాలి అనేది యూట్యూబ్ చూసి నేర్చుకొన్న యువ నేరగాళ్లు లక్షల్లో.
7. రాజకీయం
ఒక ఓటుకు అయిదు నుంచి పది లక్షలు ఇవ్వాల్సి వచ్చినప్పుడు గెలిచినవాడు తన పెట్టుబడికి పది రెట్లు సంపాదించాలని ప్రయత్నిస్తాడు. రియల్ ఎస్టేట్ డెవలప్ చేసి అక్కడ ప్రయోజనం పొందడం .. పాతబడిన పధ్ధతి. అంత ఓపిక వుండదు. టైం దొరకదు. గంజాయి మొదలు ఏది వీలయితే దాని ద్వారా నేరుగా దోచెయ్యడమే. ఒక్కో ఏసీబీ రైడ్ లో చిన్నస్థాయి అధికారి వద్ద కూడ వందల కోట్లు బయట పడుతున్నాయి అంటే అవినీతి ఏ స్తాయిలో ఉందొ అర్థం చేసుకోవచ్చు.
పంజాబ్ లో మొత్తం 17 మంది డిజిపిలు ఉన్నారు. అకార పుష్టి ... నైవేద్య నష్టి. అక్కడ క్రైమ్ మూడు పూలు ఆరు కాయలు.
తెలంగాణలో ప్రతి అయిదుగురు కానిస్టేబుళ్లలో ఒకరు బెట్టింగ్ ఊబిలో .. కొంతమంది సైబర్ నేరాల్లో..
కంచె చేను మేయదా?
పోలీస్ లు కూడా సమాజంలో భాగం కదా?
నేరమయ సమాజంలో కొన్ని వ్యవస్థలు పవిత్రంగా ఉండాలంటే కుదురుతుందా?
ఫాన్స్ ఓన్లీ అప్ చేస్తున్న కొంత మంది టీచర్లు.
హాస్టల్స్ లో కీచకులుగా మారిన కొంతమంది.
కొంతమంది డాక్టర్లు క్రిమినల్స్ గా . ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్ ముఠాల .. నేరగాళ్లకు సహకరించే ముఠాలు.. చికిత్స పేరుతొ కోల్డ్ బ్లడ్ మర్డర్ లు.. విద్య, వైద్యం, పోలీస్ వ్యవస్థలకు కూడా పడుతున్న చెదలు.
పిల్లలు చెడుదారులు పట్టకుండా ఏం చేయాలి..?
1 . నెట్ లో దొరికే చెత్తకు దూరంగా వుండడం. పిల్లల చేతికి మొబైల్ ఇవ్వకపోవడం. పెద్దలు మొబైల్ ను కేవలం ప్రొఫెషనల్ అవసరాలకోసం వాడడం .
2 . విద్య వ్యవస్థలో సమూల మార్పులు.
ఏమిటి అంటారా ? అందుకోసమే కాలికి బలపం కట్టుకొని ఊరూరా తిరుగుతూ మీ ఊరికొచ్చాను. ఏదో వీడి పబ్లిసిటీ కోసం అని మీరనుకొన్నారు .
వచ్చారు .. బాలమిత్ర క్లాస్ కు వచ్చిన వారు లాభ పడ్డారు .
మీ ఊరికి వస్తా. మీ పిల్లలు చదివే స్కూల్ కు వస్తా. పట్టువదలని విక్రమార్కుడిలా ఇంకో సారి వస్తా.
నా బాద్యత నిర్వహిస్తా.
పిల్లలకు బ్రెయిన్ వాష్ చేస్తా .
సొల్లు ఫోన్ మహమ్మారి నుంచి బాల్యాన్ని కాపాడుతా!
నేటి బాలల్ని రేపటి ఉత్తమ పౌరులుగా తీర్చి దిద్దుతా!
3. సమాజంలో నైతిక విలువలు పెరగాలి. అడ్డగోలు మార్గాల్లో డబ్బు సంపాదించేవారిని హీరోలుగా చూసే ధోరణి పోవాలి .
మంచి పనులు చేసేవారికి గౌరవం పెరగాలి .
4 . పెద్ద సముద్రం అయినా వాన చినుకుతోనే నిండుతుంది . చీకటి ని తిడుతూ కూర్చోకండి. మీ వంతుగా చిన్న పని చెయ్యండి .
ఒక విదార్థిని మొబైల్ వ్యసనం నుండి కాపాడండి. మా బడి విద్యార్థులు మొబైల్ వాడరు. పుస్తకాలు చదవడానికి ఇష్టపడుతారు. ఐదో తరగతి విద్యార్ధి విఖ్యాత్ ను తండ్రి కెవిఎన్ రెడ్డి గారు... హెయిర్ కటింగ్ సెలూన్ కు తీసుకొని వెళ్లారు. అక్కడ మరో ముగ్గురు పిల్లలు. వాళ్ళందరూ మొబైల్స్ లో. విఖ్యాత్ మాత్రం అక్కడున్న మ్యాగజైన్స్ చదువుతూ. హ్యాపీ గా ఫీల్ అయిన తండ్రి ఫోటో తీసి పంపారు.
దాన్ని నేను ఫేస్బుక్ లో పోస్ట్ చేశాను . దీని చూసి మంచి మరింత పెరుగుతుంది అని నా ఉద్దేశం.
ఎక్కడో ముదిగుబ్బ లాంటి చోట్ల ఉన్న బడులకు కూడా నా సొంత ఖర్చులతో వెళ్లి కౌన్సిలింగ్ ఇచ్చినా నాకు ఎలాంటి ఉద్దేశం ఉంటుంది ?
అందరు పిల్లలు బాగుపడాలని..
నా పోస్ట్ పై ఒకాయన కామెంట్ .. మీ స్కూల్ పబ్లిసిటీ కోసం అని.
ఇంకో అయన అంటాడు.. "ఆ పిల్లాడికి సెల్ ఫోన్ లేదు .. అందుకే బుక్ చదువుతున్నాడు" అని
మీరు మంచి.చేయకపోతే పోయే .. కాలక్షేపం కోసం సోషల్ మీడియా ఎక్కి సమాజంపై ... మంచి చేసేవారి పై రాళ్ళు వేయకండి .
చివరిగా ఒక మాట. సొంత డబ్బా అనుకునేవారు అనుకోని .. నష్టం లేదు .
మొన్న విజయవాడ ఎయిర్పోర్ట్.
ఒక వ్యక్తి పరుగెత్తుకొని వచ్చి.." సార్ ఎలా ఉన్నారు . ఇంత ఫిట్ గా స్లిమ్ గా ఎలా ఉన్నారు . అప్పటికీ ఇప్పటికీ ఏమీ మార్పులేదు" అని పలకరించాడు .వద్దన్నా వినకుండా అక్కడ కాంటీన్ లో కొబ్బరి బిస్కెట్ లు తినిపించాడు .
తాను నా 2003 బ్యాచ్ స్టూడెంట్. హైదరాబాద్ సిటీలో డిసిపి. అంటే జిల్లా ఎస్పీ స్థాయి.
సమాజం నేరమయం అయితే అందరూ ప్రభావితులు అవుతారు. ముఖ్యంగా సాధారణ ప్రజలు.
ఎంతో మందిని ఉన్నత అధికారులుగా తీర్చి దిద్దిన నాపై కంటే మీపై .. నేరమయ సమాజం ప్రభావం చూపుతుంది .
నా వంతు బాద్యతగా సమాజాన్ని జాగృతం చేస్తున్నా .
మరి మీరు?

