Malware attacks in India: సైబర్ సెక్యూరిటీ సంస్థ అక్రోనిస్ తాజాగా విడుదల చేసిన సైబర్ థ్రెట్స్ రిపోర్ట్ 2025 ప్రకారం, భారత్ ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకర డిజిటల్ జోన్‌గా మారింది. 

Malware attacks in India: భారత్ లో సైబర్ నేరాల ముప్పు రోజురోజుకు పెరుగుతోంది. టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ సైబర్ నేరగాళ్లు కొత్త పద్ధతులు అవలంబిస్తూ, డేటా దొంగతనాలు, బ్యాంకింగ్ మోసాలు పాల్పడుతున్నారు. అక్రోనిస్ నివేదిక ప్రకారం.. మాల్వేర్ దాడుల్లో భారత్ ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉంది. రాన్సమ్‌వేర్, ఫిషింగ్ ఇమెయిల్‌లు, డీప్‌ఫేక్ స్కామ్‌లు దేశంలోని వ్యక్తులు, సంస్థలు, ప్రభుత్వ సేవలకు పెద్ద సవాలుగా మారాయి.

సైబర్ సెక్యూరిటీ సంస్థ అక్రోనిస్ (Acronis report 2025) తాజా నివేదిక ప్రకారం.. భారత్ మాల్వేర్ దాడుల్లో ప్రపంచంలో అగ్రస్థానం ఉంది. బ్రెజిల్, స్పెయిన్ వంటి దేశాల కంటే భారత్ లో ఎక్కువ సైబర్ మోసాలు జరుగుతున్నాయి. ఇలా భారత్ సైబర్ దాడులకు హాట్‌స్పాట్ గా మారింది. 

అక్రోనిస్ నివేదికలో పేర్కొన్నట్టు.. AI ఆధారిత రాన్సమ్‌వేర్, ఫిషింగ్ ఇమెయిల్‌లు, డీప్‌ఫేక్ స్కామ్‌లు ప్రధాన ముప్పుగా మారాయి. ఈ ఏడాది జనవరి నుంచి జూన్ వరకు సేకరించిన డేటా ఆధారంగా రూపొందించిన ఈ నివేదికలో భారత్‌లో సైబర్ నేరాలు వేగంగా పెరుగుతున్నట్టు హెచ్చరించింది. 

భారతదేశంలో డిజిటల్ అభివృద్ధి కొనసాగుతున్నా, సైబర్ దాడుల ముప్పు ఆందోళన కలిగిస్తోంది. అక్రోనిస్ సైబర్‌థ్రీట్స్ నివేదిక ప్రకారం.. ల్యాప్‌టాప్‌లు, మొబైల్ ఫోన్లు, ఇతర పరికరాలు పలుమార్లు సైబర్ ముప్పులను ఎదుర్కొంటున్నాయి. మే 2025లో Windows OS పరికరాల్లో 12.4% మాల్వేర్ ప్రభావితమవగా, జూన్‌లో ఇది 13.2%కి పెరిగింది. ఇదే ప్రపంచంలోనే అత్యధికం. 

అలాగే.. అధికారిక ఈమెయిల్‌లపై దాడులు పెరిగాయి. 2024లో ఈ దాడులు 20% ఉండగా, 2025లో 25.6%కు పెరిగాయి. సైబర్ నేరగాళ్లు జనరేటివ్ AI సాయంతో ఫిషింగ్, నకిలీ ఇన్‌వాయిస్‌లు, డీప్‌ఫేక్ స్కామ్‌లు సృష్టించి, క్రెడిట్ కార్డులు, పాస్‌వర్డ్‌లు, వ్యక్తిగత డేటాను దొంగిలిస్తున్నారు. ఈ కారణంగా స్కామ్‌లను గుర్తించడం, నియంత్రించడం మరింత క్లిష్టమవుతోంది.

అలాగే, భారత్ లో ఫిషింగ్ దాడులు కూడా ఆందోళనకరంగా పెరిగాయి. ముఖ్యంగా Microsoft Teams, Slack వంటి ప్లాట్ ఫామ్స్ ఎక్కువగా వాడుతుండటంతో వీటిని లక్ష్యంగా చేసుకుని ఫిషింగ్ జరుగుతుంది. 2025లో ఫిషింగ్ దాడులు 9% నుండి 30.5% వరకు పెరిగాయి. అదే విధంగా, payload-less,spoofed ఇమెయిల్ దాడులు 9% నుండి 24.5% వరకు పెరిగాయి. 

డేటా ఎలా కాపాడుకోవాలంటే ?

భారతదేశం సైబర్ ముప్పుల్లో అగ్రస్థానంలో నిలవడంతో, భద్రతా చర్యలు మరింత కీలకంగా మారాయి. సైబర్ భద్రత కోసం AI ఆధారిత సెక్యూరిటీ సొల్యూషన్ల అవసరాన్ని గుర్తు చేస్తున్నాయి. అక్రోనిస్ సంస్థ సూచనల ప్రకారం, ప్రోయాక్టివ్, మల్టీ-లేయర్డ్ సెక్యూరిటీ విధానాలను అనుసరించాలి. వీటిలో ప్రవర్తన-ఆధారిత (behaviour-based) థ్రెట్ డిటెక్షన్, థర్డ్ పార్టీ అప్లికేషన్లకు రెగ్యులర్ ఆడిట్, ఆటోమెటిక్ అప్డేట్‌లు, క్లౌడ్ & ఇమెయిల్ భద్రతా వ్యవస్థలను బలోపేతం చేస్తాయి. 

అదే విధంగా, ఉద్యోగులకు సోషల్ ఇంజినీరింగ్, ఫిషింగ్ వంటి ముప్పులపై అవగాహన కల్పించడం కూడా కీలకం. నిపుణుల సూచన ప్రకారం.. వ్యక్తులు, సంస్థలు తమ పరికరాలు, ఆన్‌లైన్ అకౌంట్లను AI ఆధారిత భద్రతా పరిష్కారాలతో రక్షించుకోవడం అత్యవసరం. మోసగాళ్ల, హ్యాకర్ల వ్యూహాలను ముందుగానే అంచనా వేసి, సమర్థవంతమైన భద్రతా విధానాలను పాటించడం వల్ల ఈ సైబర్ ముప్పు నుంచి బయటపడవచ్చు.