పాకిస్థాన్ లో ఐటీ ఉద్యోగులకు శాలరీలు ఎలా ఉంటాయి? అక్కడ ఐటీ నగరాలు ఏవి?
ఇండియాలో ఐటీ అనేది అతిపెద్ద పరిశ్రమ… మరి పాకిస్థాన్ లో ఐటీ ఇండస్ట్రీ ఉందా? మనలాగే అక్కడ కూడా ఐటీ ఉద్యోగాలకు క్రేజ్ ఉందా? హైదరాబాద్, బెంగళూరు మాదిరిగా పాక్ లో ఐటీ సిటీస్ ఏవి? తెలుసుకుందాం.

పాకిస్థాన్ లో ఐటీ ఇండస్ట్రీ ఉందా?
ఇండియా, పాకిస్థాన్ ఒకప్పుడు కలిసే ఉండేవి… స్వాతంత్య్రం వచ్చాకే రెండు దేశాలుగా విడిపోయాయి. అంటే ఈ రెండుదేశాలు వేరుపడి దాదాపు 79 సంవత్సరాలు పూర్తయ్యిందన్నమాట... ఈ కాలంలో ఇండియా అభివృద్ధిలో దూసుకుపోతుంటే పాకిస్థాన్ మాత్రం అక్కడే ఉంది. శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఇండియా ప్రపంచంతో పోటీ పడుతోంది... ఏకంగా చంద్రుడిపైకి చేరుకుంది. మరీముఖ్యంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) లో కూడా ఇండియా అద్భుతాలు చేస్తోంది... వందలు, వేలు దాటి ఇప్పుడు లక్షల కోట్ల ఆదాయాన్ని పొందుతోంది. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, పుణె వంటి నగరాలు ప్రపంచ ఐటీ మ్యాప్‌లో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాయి.
ప్రపంచం ఐటీ ఇండస్ట్రీ గురించి మాట్లాడుతున్నప్పుడు చాలామందికి ఓ డౌట్ వస్తుంది. ఇండియాలో ఐటీ రంగం ఈ స్థాయిలో డెవలప్ అయ్యింది.... లక్షల కోట్లకు బిజినెస్ చేరుకుంది.. మరి మనతో పాటే స్వాతంత్య్రం పొందిన పాకిస్థాన్ సంగతేంటి? అక్కడ అసలు ఐటీ రంగం ఉందా అనే డౌట్ వస్తుంది. మరి పాక్ లో ఐటీ రంగం ఉందా? ఉంటే అక్కడి ఉద్యోగులకు శాలరీలు ఎలా ఉంటాయి? ఈ ఆసక్తికర విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
పాకిస్థాన్ లో ఐటీ ఇండస్ట్రీ ఉందా?
ఇండియాలో మాదిరిగానే పాకిస్థాన్ లో కూడా ఐటీ రంగం ఉంది... కానీ ఇక్కడున్నంత స్ట్రాంగ్ గా లేదు. ఇండియాలో ఐటీ లక్షల కోట్ల వ్యాపారం... కానీ పాక్ లో ఇంకా వందలు, వేల కోట్లకే పరిమితం అయ్యింది. అయితే పాక్ లో వేగంగా అభివృద్ధి చెందుతున్న రంగాలలో ఇది ఒకటిగా నిలుస్తోంది. పాకిస్థాన్ ఐటీ ఎగుమతులు ఏడాదికి సుమారు 20% పైగా వృద్ధి సాధిస్తున్నాయి. లాహోర్, కరాచీ, ఇస్లామాబాద్ నగరాలు అక్కడ ప్రధాన ఐటీ హబ్‌లుగా ఉన్నాయి.
భారత్‌తో పోలిస్తే పాకిస్థాన్ ఐటీ పరిశ్రమ పరిమాణం చిన్నదే అయినప్పటికీ సాఫ్ట్వేర్ సేవల ఎగుమతులు, విదేశీ కంపెనీలకు రిమోట్‌గా పనిచేయడం, ఫ్రీలాన్సింగ్ ద్వారా ఆదాయం సంపాదించడం వంటి అవకాశాలు పెరుగుతున్నాయి. 2024–25 ఆర్థిక సంవత్సరంలో ఐటీ, టెలికాం రంగాల ఎగుమతుల ఆదాయం 3.814 బిలియన్ డాలర్లుగా ఉండగా, 2025–26లో ఇది 4.6 బిలియన్ డాలర్లకు చేరింది. అంటే ఏడాదిలో సుమారు 20.6 శాతం వృద్ధి నమోదైంది.
పాకిస్థాన్‌లో ఐటీ ఉద్యోగులకు నెలకు ఎంత జీతం వస్తుంది?
పాకిస్థాన్‌లో సాఫ్ట్వేర్ ఇంజినీర్ల జీతాలు వారి అనుభవం, నైపుణ్యం, పనిచేసే కంపెనీ, నగరాన్ని బట్టి మారుతుంటాయి. చిన్న కంపెనీల్లో పనిచేసేవారికి తక్కువ జీతాలు లభిస్తే, అంతర్జాతీయ క్లయింట్లకు సేవలు అందించే సంస్థల్లో ఎక్కువ ప్యాకేజీలు ఉండవచ్చు. పాకిస్థానీ రూపాయల్లో ఉద్యోగులు జీతాలు ఎలా ఉన్నాయో చూద్దాం.
ఫ్రెషర్స్ : 50,000 - 1,20,000 PKR
మిడ్ లెవెల్ (2–5 ఏళ్ల అనుభవం) :1,20,000 – 2,50,000 PKR
సీనియర్ (5–10 ఏళ్ల అనుభవం) : 2,50,000 – 5,00,000 PKR
లీడ్ / మేనేజర్ స్థాయిలో (10+ ఏళ్ల అనుభవం ఉంటే) : 4,50,000 – 9,00,000+ PKR
రిమోట్ వర్క్, ఫ్రీలాన్సింగ్‌తో డాలర్లలో ఆదాయం!
పాకిస్థాన్ ఐటీ రంగంలో ప్రస్తుతం కనిపిస్తున్న మరో ముఖ్యమైన ట్రెండ్ రిమోట్ వర్క్, ఫ్రీలాన్సింగ్. అక్కడి చాలామంది టెక్నికల్ నిపుణులు అమెరికా, బ్రిటన్, యూరప్ వంటి దేశాల్లోని కంపెనీలకు నేరుగా సేవలు అందిస్తున్నారు. ఇందుకోసం ఆయా దేశాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండానే పాకిస్థాన్‌లో ఉంటూ ఆన్లైన్లో పనిచేస్తున్నారు.
ముఖ్యంగా వెబ్ డెవలప్మెంట్, యాప్ డెవలప్మెంట్, గ్రాఫిక్ డిజైనింగ్, డిజిటల్ మార్కెటింగ్, సాఫ్ట్వేర్ కన్సల్టెన్సీ వంటి విభాగాల్లో ఫ్రీలాన్సర్లకు అవకాశాలు ఉన్నాయి. విదేశీ కంపెనీల నుంచి ప్రాజెక్టులు పొందినవారు డాలర్లలో ఆదాయం సంపాదించే అవకాశం ఉంటుంది. స్థానిక కంపెనీల్లో వచ్చే జీతాలతో పోలిస్తే కొన్ని అంతర్జాతీయ రిమోట్ ఉద్యోగాలు, ఫ్రీలాన్స్ కాంట్రాక్టులు ఎక్కువ ఆదాయాన్ని అందించవచ్చు.
పాకిస్థాన్‌లో 2025–26 ఆర్థిక సంవత్సరంలో ఫ్రీలాన్స్ కంప్యూటర్, ఇన్ఫర్మేషన్ సర్వీసుల ఎగుమతుల విలువ సుమారు 1.16 బిలియన్ డాలర్లకు చేరినట్లు గణాంకాలు సూచిస్తున్నాయి. అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఈ విభాగంలో 49.4 శాతం వృద్ధి నమోదైంది.
మొత్తానికి భారత ఐటీ పరిశ్రమతో పోలిస్తే పాకిస్థాన్ టెక్నాలజీ రంగం ఇంకా చాలా వెనుకబడే ఉంది. అయినప్పటికీ ఏడాదికి 20 శాతానికి పైగా ఎగుమతుల వృద్ధి సాధించడం విశేషం. భవిష్యత్తులో అంతర్జాతీయ కంపెనీలతో భాగస్వామ్యాలు, కొత్త టెక్నాలజీల వినియోగం పెరిగితే పాకిస్థాన్ ఐటీ రంగం మరింత విస్తరించే అవకాశం ఉంది.





