Poor Man Biryani: హైదరాబాద్ పేదల బిర్యానీ ఏదో తెలుసా? ఈ బిర్యానీ స్పెషల్ ఏంటి?
Poor Man Biryani: హైదరాబాద్ బిర్యానీకి ఫేమస్ అనే విషయం మనకు తెలుసు. కానీ ఇదే హైదరాబాద్ లో స్పెషల్ గా పేదలకు బిర్యానీ ఉందని తెలుసా? ఏ బిర్యానీని పేదల బిర్యానీ అని పిలుస్తారు?

Poor Man Biryani
హైదరాబాద్ అనగానే ఎవరికైనా ముందు గుర్తుకు వచ్చేది బిర్యానీనే. కేవలం ధమ్ బిర్యానీ మాత్రమే కాదు.. చాలా రకాల డిఫరెంట్ బిర్యానీలు అందుబాటులో ఉన్నాయి. కానీ, హైదరాబాద్ వీధుల్లో నిశ్శబ్దంగా, అత్యంత ఆదరణ పొందిన మరో బిర్యానీ కూడా ఉందనే విషయం చాలా మందికి తెలీదు. ముఖ్యంగా పేదల బిర్యానీగా పిలుచుకునే ఫేమస్ ఫుడ్ ఒకటి ఉందని తెలుసా? అదే కళ్యాణీ బిర్యానీ. ఈ బిర్యానీ స్పెషల్ ఏంటి? దీనిని పేదల బిర్యానీ అని ఎందుకు పిలుస్తారు? ఇది మన దేశంలోకి ఎలా అడుగుపెట్టింది?
కళ్యాణీ బిర్యానీని దేనితో తయారు చేస్తారు..?
చాలా మంది కళ్యాణీ బిర్యానీని చాలా మంది మేక మాంసం (మటన్) తో తయారు చేస్తారు అని అనుకుంటారు. కానీ, అసలైన కళ్యాణీ బిర్యానీని మాత్రం ఎద్దు లేదా గేదె మాంసం (బీఫ్) తో తయారు చేస్తారు. నార్మల్ హైదరాబాదీ దమ్ బిర్యానీలో కుంకుమ పువ్వు, కాజూ, నెయ్యి, ఖరీదైన హోల్ సేల్ మసాలాలు ఉంటాయి. కానీ, కళ్యాణీ బిర్యానీలో ఇవి ఏవీ ఉండవు. కానీ, ఈ బిర్యానీలో టమాటలు, ధనియాలు, జీలకర్ర మిశ్రమం ఎక్కువ కలుపుతారు. చిన్న చిన్న మాంసం ముక్కలతో ఘుమఘుమలాడే జీలకర్ర, టమాటా ఫ్లేవర్ తో దీనిని తయారు చేస్తారు.
కళ్యాణీ బిర్యానీ హైదరాబాద్ లోకి ఎలా అడుగుపెట్టింది?
ఈ బిర్యానీ మన దేశంలో అడుగుపెట్టడం వెనక పెద్ద చరిత్రే ఉంది. 18వ శతాబ్దంలో కర్ణాటకలోని బసవ కళ్యాణ్ ( బీదర్) నుంచి వచ్చిన కళ్యాణీ నవాబులు.. హైదరాబాద్ భాగ్య నగరంలో స్థిరపడ్డారు. చార్మినార్ సమీపంలోని షా ఆలీ బండా దగ్గర తమ హవేలీ నిర్మించుకున్నారు. బీదర్ నుంచి లేదా ఇతర ప్రాంతాల నుంచి తమ హవేలీకి వచ్చే అతిథులకు, పర్యాటకులకు ఉచితంగా ఈ బిర్యానీతో ఆతిథ్యం ఇచ్చేవారు. 1948 తదుపరి కాలంలో నవాబుల వైభవం తగ్గిపోవడంతో, వారి వంటశాలలో పనిచేసే రాచరిక వంట మనుషులు ఉపాధి కోసం బయటకు వచ్చి వీధుల్లో చిన్న చిన్న బండ్లు, హోటళ్లు ఏర్పాటు చేశారు. నవాబుల వంటశాల జ్ఞాపకార్థంగా కళ్యాణీ బిర్యానీ అనే పేరు పెట్టి చార్మినార్ సమీపంలో అమ్మడం ప్రారంభించారు. తర్వాత.. హైదరాబాద్ సిటీలోని చాలా ప్రాంతాల్లో కూడా ఇప్పుడు ఈ బిర్యానీ అందుబాటులో ఉంది.
కళ్యాణీ బిర్యానీని పేదల బిర్యానీ అని ఎందుకు పిలుస్తారు..?
హైదరాబాద్ లో మామూలు చికెన్ లేదా మటన్ బిర్యానీ ధర రూ.250 నుంచి రూ.400 వరకు ఉంటుంది. అదే కళ్యాణీ బిర్యానీ సింగిల్ ప్లేట్ కేవలం రూ.60 నుంచి రూ.100 లోపే లభిస్తుంది. తక్కువ బరువులో ప్రోటీన్, కడుపు నిండా కమ్మని అన్నం లభించడంతో రోజువారీ కూలీలు, విద్యార్థులు, ఆఫీస్ ఉద్యోగులకు ఇది అత్యంత చవకైన ఆహారంగా మారింది. అందుకే, ఈ బిర్యానీని పేదల బిర్యానీగా పిలుస్తారు.





