Gold in Silk Saree: పట్టుచీర జరీలో బంగారం ఉంటుందా? ఒక్క చీర నుంచి ఎంత బంగారం తీయొచ్చు?
Gold in Silk Saree: పట్టుచీర కట్టుకుంటే వచ్చే అందమే వేరు. ముఖ్యంగా పెళ్లిళ్లలో ధరించే కంచి పట్టు చీరల్లో జరీ మెరుపు చాలా ప్రత్యేకంగా ఉంటుంది. అయితే ఈ పట్టుచీరల జరీలో నిజంగానే బంగారం ఉంటుందా? ఒక చీర నుంచి ఎంత బంగారు తీసుకోవచ్చో ఇక్కడ తెలుసుకుందాం.

పట్టుచీర జరీలో బంగారం ఉంటుందా?
చాలామంది మహిళలు పండగలు, పెళ్లిళ్లు వంటి ప్రత్యేక సందర్భాలకు ఎక్కువగా పట్టు చీరలు కట్టుకుంటూ ఉంటారు. పట్టు చీరకు అందం దాని జరీ వర్క్ లో ఉంటుంది. ఆ జరీ ఎంత మెరిస్తే చీర అంత రిచ్ గా కనిపిస్తుంది. అయితే ఆ మెరుపు వెనుక బంగారం కూడా ఉండొచ్చని మీకు తెలుసా? అసలు చీరలో బంగారం ఎందుకు పెడతారు? ఒక్క చీరలో ఎంత బంగారం ఉంటుంది? దాన్ని ఎలా తీసుకోవచ్చు? వంటి విషయాలు ఇక్కడ తెలుసుకుందాం.
కొన్ని అధ్యయనాల ప్రకారం కొన్ని రకాల పట్టుచీర జరీలో బంగారాన్ని వాడతారని తెలుస్తోంది. 2022లో జరిగిన ఒక అధ్యయనంలో 68 రకాల జరీ శాంపిల్స్‌ను పరీక్షించారు. వాటి బరువులో బంగారం శాతం 0.04% నుంచి 0.58% వరకు ఉంది. ఆరు మీటర్ల బ్రోకేడ్ పట్టుచీర తయారీకి కనీసం 240 గ్రాముల జరీని వాడతారని ఆ అధ్యయనం చెబుతోంది.
ఒక చీర జరీలో ఎంత బంగారం ఉంటుంది?
ఒక పట్టుచీరలో 240 గ్రాముల వరకు జరీ ఉంటే, అందులో సగటున 0.22% బంగారం ఉంటుంది. అంటే జరీలో సుమారు 0.53 గ్రాముల బంగారం ఉండొచ్చు. అయితే, ఇది అన్ని చీరలకు వర్తించదు. ఒకవేళ జరీలో బంగారం శాతం 0.04% ఉంటే, 240 గ్రాముల జరీ నుంచి కేవలం 0.096 గ్రాముల బంగారం మాత్రమే వస్తుంది.
అన్ని పట్టు చీరల్లో బంగారం ఉంటుందా?
మనం వాడే ప్రతి పట్టుచీరలో బంగారం ఉంటుందని చెప్పలేము. అసలైన జరీలో సాధారణంగా వెండి తీగపై బంగారు పూత పూస్తారు. కొన్ని రకాల్లో రాగి లేదా ఇతర లోహాలను కూడా వాడతారు. ఆర్టిఫిషియల్ జరీలో అయితే ప్లాస్టిక్ లేదా లోహంలా కనిపించే ఇతర పదార్థాలు ఉండొచ్చు. ఇవన్నీ చూడటానికి బంగారు రంగులోనే మెరుస్తుంటాయి. కానీ, వాటిలో వాడే లోహాలు, వాటి విలువ వేరుగా ఉంటాయి. చీర జరీ బంగారు రంగులో ఉన్నంత మాత్రాన అందులో నిజమైన బంగారం ఉందని నమ్మడం కరెక్ట్ కాదు.
పాత పట్టుచీరల్లో బంగారం ఎక్కువగా ఉంటుందా?
కొన్ని పాత కాంచీపురం, బెనారస్ పట్టుచీరల్లో వెండి జరీతో పాటు ఎక్కువ బంగారు పూతను వాడినట్లు రికార్డులు చెబుతున్నాయి. ముఖ్యంగా 1960 నుంచి 1980 మధ్య కాలంలో నేసిన చీరల్లో విలువైన లోహాలను ఎక్కువగా వాడారని నిపుణులు చెబుతున్నారు. అయితే, అన్ని పాత చీరల్లో ఎక్కువ బంగారం ఉంటుందని కచ్చితంగా చెప్పలేం. చీరను నేసిన విధానం, జరీ నాణ్యత, వాడిన లోహం పరిమాణం ముఖ్యం. అలాగే, చీర ధర ఎక్కువగా ఉన్నంత మాత్రాన అందులో బంగారం కూడా ఎక్కువే ఉంటుందని అనుకోకూడదు.
బంగారం మొత్తం మన చేతికి వస్తుందా?
జరీలో ఉన్నట్లుగా లెక్కించిన బంగారం, దాన్ని టెక్నాలజీ సాయంతో బయటకు తీశాక వచ్చే బంగారం ఒకేలా ఉండవు. బంగారాన్ని వేరు చేసే ప్రాసెస్‌లో కొంత నష్టం జరుగుతుంది. జరీ తయారీ, బంగారు పూత స్వభావం కూడా ఫైనల్ రిజల్ట్‌ను మారుస్తాయి. దీనికి తోడు బంగారాన్ని వేరు చేయడానికి అయ్యే ఖర్చును కూడా మనం లెక్కలోకి తీసుకోవాలి. అలాగే పాత చీరను అమ్మే ముందు, నమ్మకమైన నిపుణుల దగ్గర జరీని పరీక్షించి, అందులో వెండి, బంగారం ఎంత ఉందో తెలుసుకోవడం మంచిది.





