Guava Capital: దేశంలోనే జామపండ్లకు స్పెషల్ సిటీ.. కేరాఫ్ అడ్రస్ ఎక్కడో తెలుసా?
Guava Capital: జామపళ్లు అనగానే చిన్ననాటి జ్ఞాపకాలు వస్తాయి. ఉప్పు, కారం వేసి తింటే భలే ఉంటుంది. ఇప్పుడు కొనుక్కుని తినాలంటే ధరలు పెరిగిపోయాయి. అయితే దేశంలో జామపండ్ల సాగుతో ఓ ప్రాంతానికి ప్రత్యేక గుర్తింపు వచ్చింది. ఆ నగరం ఏది? వాటి ప్రత్యేకత ఏంటి?

జామ పండ్ల రాజధాని ఎక్కడుందో తెలుసా?
దేశంలో జామపండ్ల సాగుకు కొన్ని ప్రాంతాలు ప్రత్యేక గుర్తింపు పొందాయి. అలాంటి వాటిలో ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ ఒకటి. ఇక్కడ పండే రెండు రకాల జామపండ్లకు భౌగోళిక గుర్తింపు (GI Tag) లభించింది. ఒకటి తెల్లటి గుజ్జుతో ప్రత్యేకంగా కనిపిస్తే.. మరొకటి గులాబీ, ఎరుపు రంగు గుజ్జుతో ఆకట్టుకుంటుంది. ఇంతకీ ఆ రెండు రకాలేంటి? జామ సాగుకు ఈ నగరం ఎందుకు ప్రసిద్ధి చెందింది?
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ నగరం గతంలో అలహాబాద్‌గా ప్రసిద్ధి చెందింది. ఈ ప్రాంతంలో తరతరాలుగా జామ సాగు కొనసాగుతోంది. ముఖ్యంగా ఇక్కడి జామపండ్లకు ఉన్న ప్రత్యేక రుచి, వాటి లక్షణాలు ఈ ప్రాంతానికి గుర్తింపు తీసుకొచ్చాయి. అందుకే ప్రయాగ్‌రాజ్‌ను Guava Capital of India అని పిలుస్తారు.
GI గుర్తింపు పొందిన ఆ రెండు జామ రకాలేంటి?
ఉత్తరప్రదేశ్‌లో ప్రయాగ్‌రాజ్‌తో పాటు కౌశాంబి, ఫరూఖాబాద్, అలీగఢ్, బదాయూన్ వంటి ప్రాంతాల్లోనూ జామ సాగు విస్తరించింది. అయితే అలహాబాద్ పేరుతో గుర్తింపు పొందిన కొన్ని ప్రత్యేక రకాలు ఈ ప్రాంతానికి ప్రత్యేకతగా నిలుస్తున్నాయి.
జామ పళ్లలో కూడా రకాలు ఉంటాయి. అందులో అలహాబాద్ సఫేదా: ఈ రకం జామపండ్లు లేత ఆకుపచ్చ తొక్కతో, లోపల తెల్లటి గుజ్జుతో ఉంటాయి. ఈ రకానికి GI గుర్తింపు లభించింది.
అలహాబాద్ సుర్ఖా: ఈ రకం జామపండ్లలో గుజ్జు గులాబీ లేదా ఎరుపు రంగులో ఉంటుంది. ప్రత్యేకమైన రుచి, మంచి రంగు వీటి ప్రత్యేకత. ఈ రకానికి కూడా GI గుర్తింపు ఉంది.
జామ తోటలకు కొత్త సవాళ్లు
ప్రయాగ్‌రాజ్, పొరుగున ఉన్న కౌశాంబి ప్రాంతాలు సంప్రదాయ జామ సాగుకు ప్రసిద్ధి. అయితే ఇటీవలి కాలంలో పట్టణీకరణ, వాతావరణ మార్పులు, పంటలకు సోకే వ్యాధుల కారణాలతో కొన్ని ప్రాంతాల్లో జామ తోటలు తగ్గిపోతున్నాయి. అందుకే జామ సాగును పునరుద్ధరించేందుకు, దిగుబడులను పెంచేందుకు కొత్త రకాలనూ పరిచయం చేస్తున్నారు. రెడ్ డైమండ్, అవధ్ భూషణ్, హిసార్ సఫేదా వంటి రకాలను ఖుస్రూబాగ్‌లోని ఉద్యాన పరిశోధన, శిక్షణ కేంద్రంలో పెంచుతూ విస్తృత సాగుకు ప్రోత్సహించే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
జామ సాగులో ప్రత్యేక స్థానాన్ని నిలబెట్టుకుంటున్న నగరం
కొత్త రకాలు అందుబాటులోకి వస్తున్నప్పటికీ అలహాబాద్ సఫేదా, అలహాబాద్ సుర్ఖా జామపండ్లకు ఉన్న గుర్తింపు కొనసాగుతోంది. GI గుర్తింపు వల్ల ఈ ప్రాంతీయ ప్రత్యేకతను తీసుకొస్తున్నాయి. జామ సాగును కాపాడుకోవడంతో పాటు రైతులకు మెరుగైన సాగు అవకాశాలను కల్పించడం కూడా ఈ ప్రాంతానికి ముఖ్యంగా మారింది. మొత్తంగా, ప్రత్యేకమైన జామ రకాలు, తరతరాల సాగు సంప్రదాయం కారణంగా ప్రయాగ్‌రాజ్ భారతదేశంలోని ప్రసిద్ధ జామ పండ్ల ప్రాంతాల్లో ఒకటిగా నిలుస్తోంది.

