- Home
- Feature
- World's Cleanest Country: ప్రపంచంలోనే అత్యంత పరిశుభ్రమైన దేశం ఏదో తెలుసా? 2026 లో ఫస్ట్ ర్యాంక్ సాధించిన కంట్రీ
World's Cleanest Country: ప్రపంచంలోనే అత్యంత పరిశుభ్రమైన దేశం ఏదో తెలుసా? 2026 లో ఫస్ట్ ర్యాంక్ సాధించిన కంట్రీ
Cleanest Country in the World: ప్రపంచ వ్యాప్తంగా పరిశుభ్రత, వాతావరణ కాలష్యంపై జాగ్రత్త పెరిగిపోయింది. పరిశుభ్రతలో దేశాలు పోటీ పడుతున్నాయి. ఇంతకీ ఈ ఏడాది ప్రపంచంలోనే అత్యంత పరిశుభ్రమైన దేశం ఏదో తేలుసా? అక్కడి ప్రజలు పక్కాగా పాటించే సూత్రాలు ఇవే.

ప్రపంచ దేశాలన్నింటికీ సవాలు
ప్రకృతిని రక్షించడం, పర్యావరణాన్ని స్వచ్ఛంగా ఉంచుకోవడం నేడు ప్రపంచ దేశాలన్నింటికీ ఒక ముఖ్యమైన సవాలుగా మారింది. ఎందుకంటే పెరుగుతున్న కాలుష్యం మునుపటి కంటే ఎక్కువ ప్రమాదకరమైన పరిస్థితులను ఎదుర్కొనేలా చేస్తోంది. ఈ తరుణంలో పర్యావరణ పరిరక్షణలో అగ్రగామిగా నిలుస్తూ ప్రపంచానికి ఆదర్శంగా మారుతున్న దేశాలలో 'ఎస్టోనియా' (Estonia) ముందు వరుసలో ఉంది. తాజా పర్యావరణ పనితీరు సూచిక (Environmental Performance Index) ప్రకారం ఎస్టోనియా ప్రపంచంలోనే అత్యంత పరిశుభ్రమైన దేశంగా ఫస్ట్ ప్లేస్ ను సాధించింది.
పర్యావరణ పరిరక్షణలో మొదటి స్థానం
ఎస్టోనియా దేశం పర్యావరణ సమతుల్యతను కాపాడటంలోనూ, ప్రకృతి సంరక్షణలోనూ ఎంతో ముందుంది. పచ్చదనానికి పెద్దపీట వేయడం, కాలుష్యాన్ని అరికట్టేందుకు కఠినమైన నిబంధనలు అమలు చేయడం ఈ దేశ ప్రత్యేకత. ఇక్కడ ప్రభుత్వంతో పాటు సాధారణ ప్రజలు కూడా పర్యావరణాన్ని కంటికి రెప్పలా కాపాడుకుంటారు. చెట్లను నరకడాన్ని నియంత్రించడం, అడవులను విస్తరించడం, ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా తగ్గించడం వంటి చర్యల వల్ల ఈ దేశం స్వచ్ఛతలో నెంబర్ వన్ స్థానాన్ని దక్కించుకోగలిగింది.
హరిత నగరాలు - జీవన విధానం
ఎస్టోనియా రాజధాని టాలిన్ (Tallinn) తో పాటు ఇతర నగరాలు కూడా అత్యంత శుభ్రంగా ఉంటాయి. ఇక్కడ పరిశ్రమల నుండి వెలువడే వ్యర్థాలను కఠినమైన నిబంధనల ద్వారా నియంత్రిస్తారు. అలాగే ప్రజలు పర్యావరణ హితమైన రవాణా మార్గాలను, ఎలక్ట్రిక్ వాహనాలను, సైకిళ్లను ఎక్కువగా ఉపయోగిస్తారు. ఇళ్లలో, కార్యాలయాలలో పునరుత్పాదక శక్తిని (Renewable Energy) వినియోగించడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. సౌర - పవన విద్యుత్ ఉత్పత్తిలో ఈ దేశం ఎంతో పురోగతి సాధించింది.
పర్యాటక రంగం - ప్రకృతి సౌందర్యం
ఎస్టోనియా కేవలం పరిశుభ్రతలోనే కాకుండా ప్రకృతి సౌందర్యంలోనూ ఎంతో గొప్పది. ఇక్కడ విస్తారమైన అడవులు, స్వచ్ఛమైన సరస్సులు, పచ్చని మైదానాలు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటాయి. బాల్టిక్ ప్రాంతంలో ఉన్న ఈ దేశం సహజ సిద్ధమైన వాతావరణాన్ని చెక్కుచెదరకుండా కాపాడుకుంటూ వస్తోంది. ప్రకృతి ప్రేమికులు తప్పక సందర్శించవలసిన ప్రదేశాలలో ఎస్టోనియా ఒకటి. ఎస్టోనియా సాధించిన ఈ ఘనత కేవలం ఒక దేశం యొక్క విజయం మాత్రమే కాదు, యావత్ ప్రపంచానికి పర్యావరణాన్ని ఎలా కాపాడుకోవాలో చూపిన చక్కని మార్గదర్శకం. భవిష్యత్తు తరాలకు స్వచ్ఛమైన భూమిని అందించడంలో ఎస్టోనియా అందరికీ ఆదర్శప్రాయంగా నిలుస్తోంది.













