ఈ దేశానికి వెళితే భారతీయులకు ఫుడ్ ఫ్రీ.. అక్కడ మనవాళ్లకు రాచమర్యాదలు
భారతీయులకు ఓ దేశం స్పెషల్ ట్రీట్ ఇస్తోంది. మన సరిహద్దు దేశంలో ఇండియన్స్ కు రాచమర్యాదలు దక్కుతున్నాయిట. ఓ కన్నడ యూట్యూబర్‌కు ఈ అనుభవం ఎదురైంది. భారతీయులకు రాచమర్యాదలు చేసే ఆ దేశంలోని ప్రాంతమేదో తెలుసుకోండి.
భారతీయులకు ఫుడ్ ఫ్రీ
అవకాశం ఉన్నప్పుడల్లా మనదేశంలో ఎన్నో దేశాలకు ఆర్థికసాయాన్ని అందించింది. యుద్ధాలతో చితికిపోయిన దేశాలకు ఆహారాన్ని, వైద్యులను పంపించి ఆదుకుంది. అందుకే కొంతమంది దేశస్థులకు భారతీయులు అంటే ఎంతో ఇష్టం. అలాంటి దేశాల్లో ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ కూడా చేరిపోయింది. యుద్ధాలు, తాలిబన్ల పాలనతోనే అఫ్గానిస్థాన్ చితికిపోయింది. అయితే అక్కడి ప్రజల్లో భారతీయులపై ఎంతో ప్రేమ ఉందని ఓ కన్నడ యూట్యూబర్ తెలిపారు. అఫ్గాన్ సరిహద్దు నగరమైన జలాలాబాద్ వీధుల్లో ఓ కన్నడ యూట్యూబర్ ఫుడ్ టూర్ చేశాడు. పది రూపాయల బిర్యానీ నుంచి కిలోన్నర బరువుండే 'పిజ్జా చప్లీ కబాబ్' వరకు ఎన్నో ఆశ్చర్యకరమైన విషయాలను వివరించారు.
జలాలాబాద్ కు వెళితే..
పాకిస్థాన్-అఫ్గానిస్థాన్ సరిహద్దుల్లోని ప్రధాన నగరం జలాలాబాద్. ఇక్కడ ప్రజల జీవనశైలి చాలా వెరైటీగా ఉంటుంది. పొద్దుపొద్దున్నే వాళ్లు చేసే బ్రేక్‌ఫాస్ట్, అక్కడి వాతావరణం ప్రపంచంలోని మిగతా ప్రాంతాలకు చాలా భిన్నంగా కనిపిస్తుంది.
ఇక్కడ ఉదయం బ్రేక్‌ఫాస్ట్ వేడివేడి, చిక్కటి మీగడతో ఉన్న తాజా ఆవు పాలతో మొదలవుతుంది. ఇక్కడ పాలను గ్లాసుల్లో కాదు లీటర్ల లెక్కన తాగుతారు. వీటితో పాటు బెండకాయ కూర, పప్పు, ఛోలే, నాన్ (అఫ్గానీ రోటీ) వంటివి తింటారు. అఫ్గానిస్థాన్‌లో పన్నీర్ ఒక రకంగా మాంసాహారంగానే చూస్తారు. ఎందుకంటే, ఇక్కడ పాలు విరగ్గొట్టి పన్నీర్ చేసేటప్పుడు.. దాన్ని వడకట్టి గట్టిగా మార్చేందుకు వస్త్రానికి బదులుగా గొర్రె లేదా ఆవుల పేగులు వాడతారు. అందుకే ఇది నాన్-వెజ్ అయిపోతుంది!
ఈ నగరంలో రోడ్డు పక్కన జనాలు కూర్చుని పొద్దున్నే బిర్యానీ తింటూ ఉంటారు. పేదవాళ్లు వచ్చి ₹10 లేదా ₹20 ఇచ్చినా వ్యాపారులు ఎంతో ప్రేమగా బిర్యానీ పెడతారు. భారతీయులను చూస్తే ఇక్కడి జనాలకు విపరీతమైన ప్రేమ. భారతీయులను 'మెహమాన్' అంటే అతిథి అని పిలిచి చాలా మంది దుకాణదారులు భోజనానికి డబ్బులు కూడా తీసుకోరు. ఉచితంగానే ఆహారాన్ని అందిస్తారు.
టేస్టీ వంటకాలు
ఈ నగరంలోభారీ సైజులో ఉండే 'చప్లీ కబాబ్'. స్విమ్మింగ్ పూల్ అంత పెద్ద పెనం మీద మటన్ ఖైమా, గుడ్లు, టమాటా, ఉల్లిపాయలు, మసాలా దినుసులు, చీజ్ కలిపి ఏకంగా కిలోన్నర బరువుండే మెగా కబాబ్ తయారు చేస్తారు. దీన్నే 'పిజ్జా కబాబ్' అని పిలుస్తారు. అలాగే 500 గుడ్లు కొట్టి చేసే భారీ ఆమ్లెట్ కూడా ఇక్కడ చాలా స్పెషల్.
ఇక్కడ తిరిగే ట్యాక్సీలన్నీ కచ్చితంగా 'బ్లూ అండ్ వైట్' (Blue & White) రంగులోనే ఉండాలని తాలిబన్ ప్రభుత్వం కఠిన నిబంధన పెట్టింది.

