Earth: భూమి ఆకస్మాత్తుగా తిరగడం ఆగిపోతే ఏమవుతుందో తెలుసా.?
Earth: భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడు చుట్టూ తిరుగుతుందనే విషయం తెలిసిందే. అయితే భూమి తిరగడం ఆగిపోతే ఏమవుతుందో ఎప్పుడైనా ఆలోచించారా.? ఆసక్తికర విషయాలు మీకోసం.

భూభ్రమణం అంటే ఏంటి.?
భూమి ఉత్తర ధ్రువం నుంచి దక్షిణ ధ్రువం వరకు ఉన్న ఒక ఊహాత్మక రేఖ చుట్టూ తిరుగుతుంది. దీనినే భూభ్రమణం అంటారు. భూమి సుమారు 24 గంటల్లో ఒక పూర్తి చుట్టు తిరుగుతుంది. ఈ కారణంగానే మనకు పగలు, రాత్రి అనుభవం కలుగుతుంది. భూమి తిరుగుడు వాతావరణ మార్పులు, గాలుల దిశ, సముద్ర ప్రవాహాలపై కూడా ప్రభావం చూపుతుంది.
భూమి తిరుగుడు వల్ల కలిగే ముఖ్య ప్రభావాలు
భూమి తిరగడం వల్ల పగలు రాత్రుల ఏర్పాటవుతుంది. భూమి వంగిన స్వభావం కారణంగా ఋతువుల మార్పు జరుగుతుంది. కోరివోలిస్ ప్రభావం వల్ల గాలులు, సముద్ర ప్రవాహాలు వేర్వేరు దిశల్లో కదులుతాయి. భూమి లోపలి కోర్ కదలిక వల్ల శక్తివంతమైన అయస్కాంత క్షేత్రం ఏర్పడుతుంది, ఇది సూర్యుని నుంచి వచ్చే హానికర కిరణాల నుంచి భూమిని రక్షిస్తుంది.
భూభ్రమణ దినోత్సవం చరిత్ర
జనవరి 8వ తేదీన భూభ్రమణ దినోత్సవంగా జరుపుకుంటారు. భూమి తిరుగుతుందనే భావన పురాతన గ్రీకు తత్వవేత్తల కాలం నుంచే ఉంది. అయితే దీనికి ప్రత్యక్ష శాస్త్రీయ ఆధారం ఇచ్చింది ఫ్రాన్స్ శాస్త్రవేత్త లియోన్ ఫౌకాల్. 1851 సంవత్సరంలో ఆయన ఫౌకాల్ పెండ్యూలం అనే ప్రయోగం ద్వారా భూమి తిరుగుతుందనే విషయాన్ని స్పష్టంగా చూపించారు. ఈ ప్రయోగం అంతటి ప్రాధాన్యం పొందింది కాబట్టి నేటికీ ప్రపంచవ్యాప్తంగా అనేక సైన్స్ మ్యూజియంల్లో ప్రదర్శిస్తారు.
భూమి అకస్మాత్తుగా తిరగడం ఆపేస్తే ఏమవుతుంది?
భూమి ఒక్కసారిగా తిరగడం ఆపితే భారీ విపత్తులు తప్పవు. ఒక వైపు శాశ్వత పగలు ఉండిపోతుంది, అక్కడ తీవ్రమైన వేడి పెరుగుతుంది. మరో వైపు శాశ్వత రాత్రి ఏర్పడి తీవ్రమైన చలి, మంచు కప్పేస్తుంది. వాతావరణ సమతుల్యత పూర్తిగా దెబ్బతింటుంది. జీవ వైవిధ్యం తీవ్రంగా నశించే ప్రమాదం ఉంటుంది. మొత్తానికి మనిషి జీవితం కొనసాగడం చాలా కష్టం అవుతుంది.
భూభ్రమణ ఎలా జరుపుకుంటారు?
ఈ రోజు ఉద్దేశం శాస్త్ర విజ్ఞానం పట్ల అవగాహన పెంచడం. పాఠశాలలు, సైన్స్ మ్యూజియంల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఫౌకాల్ పెండ్యూలం ప్రదర్శనల ద్వారా భూమి తిరుగుడు అర్థమయ్యేలా చూపిస్తారు. భూమి తిరుగుడు మనకు సాధారణంగా కనిపించినా, అది లేకపోతే జీవితం ఊహించలేనంత ప్రమాదకరంగా మారుతుందనే విషయాన్ని ఈ రోజు గుర్తు చేస్తుంది.

