- Home
- Feature
- Shopping Mall: షాపింగ్ మాల్స్‌కు కిటికీలు ఎందుకు ఉండవో తెలుసా? దీని వెనుక ఉన్న అసలు రహస్యం ఇదే!
Shopping Mall: షాపింగ్ మాల్స్‌కు కిటికీలు ఎందుకు ఉండవో తెలుసా? దీని వెనుక ఉన్న అసలు రహస్యం ఇదే!
Shopping Mall: ఏదైనా పెద్ద షాపింగ్ మాల్ వెళ్లి చూడండి... ఒక్క కిటికీ కూడా కనిపించదు. ఉదయం పూట కూడా లోపల మిరుమిట్లు గొలిపే బల్పుల వెలుగులోనే షాపింగ్ చేయాలి. ఇలా షాపింగ్ మాల్స్ కిటికీలు ఎందుకు ఉండవో తెలుసా?

షాపింగ్ మాల్స్‌లో నో విండోస్
పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్‌కి వెళ్లినప్పుడు చుట్టూ చూడండి.. ఒక్క కిటికీ కూడా కనిపించదు. ఉదయం వెళ్లినా, సాయంత్రం వెళ్లినా మాల్ లోపల ఒకే రకమైన ఆహ్లాదకరమైన వాతావరణం కనిపిస్తుంది. ఇలా డిజైన్ చేయడం వెనుక చాలా అర్థముంది. అలాగే దీని వెనుక కస్టమర్ల ప్రవర్తనను ప్రభావితం చేసే ఒక పెద్ద సైకలాజికల్, వ్యాపార వ్యూహం కూడా ఉంది. వ్యాపార ప్రపంచంలో దీనిని గ్రూయెన్ ఎఫెక్ట్ అంటారు. మాల్స్ లోపల కిటికీలు లేదా గడియారాలు లేకపోవడం వల్ల బయట వాతావరణం ఎలా ఉందో కస్టమర్లకు అసలు అర్థం కాదు. దీనివల్ల బయటి ప్రపంచంతో వారి సంబంధం పూర్తిగా తెగిపోతుంది. సమయం గడిచే కొద్దీ ఇంటికి వెళ్లాలి అనే ఆలోచన కూడా త్వరగా రాదు. వినియోగదారులు కాలాన్ని మర్చిపోయి ప్రశాంతంగా ఎక్కువ సమయం మాల్‌లోనే గడుపుతూ షాపింగ్ చేస్తూనే ఉంటారు.
ఉత్పత్తులు రంగులు తెలిసేలా
సహజమైన వెలుతురు రోజు మొత్తంలో మారుతూనే ఉంటుంది. ఉదయం ఉండే ఎండ మధ్యాహ్నానికి లేదా సాయంత్రానికి మారుతుంది. కిటికీల ద్వారా ఈ వెలుతురు లోపలికి వస్తే ప్రొడక్ట్స్ సరిగ్గా కనిపించవు. అలాగే వస్తువుల అసలు రంగులు కూడా సరిగ్గా కనిపించవు. అందుకే మాల్స్ వారు ప్రత్యేకమైన ఆర్టిఫిషియల్ డెకరేటివ్ లైటింగ్‌ను ఉపయోగిస్తారు. ఈ కాంతుల వల్ల లోపల ఉండే ప్రతి బట్టల షోరూమ్, వస్తువు చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది. దీనితో పాటు మాల్స్‌లో భద్రత అనేది అతి ముఖ్యమైన అంశం. కిటికీలు లేకుండా కాంక్రీట్ గోడలు ఉండటం వల్ల సెక్యూరిటీ నిఘా సులభమవుతుంది. అలాగే దొంగతనాలు లేదా అక్రమ ప్రవేశాలు జరిగే అవకాశం కూడా ఉండదు.
ఉష్ణోగ్రత నియంత్రణకు..
షాపింగ్ మాల్స్‌లో పెద్ద కిటికీలు లేకపోవడానికి మరో ముఖ్య కారణం ఉష్ణోగ్రత నియంత్రణ. కిటికీలు ఉంటే బయటి వేడి లేదా చలి సులభంగా లోపలికి వచ్చి ఏసీల పై విపరీతమైన భారం పడుతుంది. కిటికీలు లేకపోవడం వల్ల మాల్ అంతటా ఉష్ణోగ్రత ఎల్లప్పుడూ స్థిరంగా ఉంటుంది. విద్యుత్ వినియోగం కూడా తగ్గుతుంది. అంతేకాకుండా కిటికీల స్థానంలో ఉండే ఖాళీ గోడలను మాల్ యజమానులు బ్రాండ్ అడ్వర్టైజ్‌మెంట్లు, పెద్ద డిజిటల్ స్క్రీన్‌ల కోసం వాడుకుంటారు. ఈ ప్రకటనల ద్వారా మాల్స్ యాజమాన్యానికి భారీగా అదనపు ఆదాయం సమకూరుతుంది. ఇలా ఒక చిన్న డిజైన్ వెనుక కస్టమర్ సైకాలజీ, భద్రత, పర్యావరణ నియంత్రణ వంటి ఎన్నో కారణాలు ఉన్నాయి.

