ప్రపంచంలో విమానాశ్రయాలు లేని దేశాలివే.. మరి ఆ దేశాలకు ఎలా వెళ్తారు.?
Airport: ప్రపంచంలోని చాలా దేశాల్లో విమానాశ్రయాలు ఉన్నాయి. విమాన ప్రయాణం అందుబాటులోకి రావడంతో అంతర్జాతీయ ప్రయాణాలు సులభమయ్యాయి. అయితే, ప్రపంచంలో ఐదు దేశాలకు మాత్రం ఇప్పటి వరకు సొంతంగా వాణిజ్య విమానాశ్రయాలు లేవని తెలుసా?

వాటికన్ సిటీ
ప్రపంచంలోనే అతి చిన్న దేశం వాటికన్ సిటీ. దీని విస్తీర్ణం సుమారు 0.44 చదరపు కిలోమీటర్లు మాత్రమే. ఇటలీ రాజధాని రోమ్ నగరం మధ్యలో ఉన్న ఈ దేశం క్రైస్తవులకు పవిత్ర ప్రదేశం. పోప్ నివాసం ఇక్కడే ఉంటుంది. సెయింట్ పీటర్స్ బసిలికా, వాటికన్ మ్యూజియమ్స్ వంటి ప్రసిద్ధ ప్రదేశాలు పర్యాటకులను ఆకర్షిస్తాయి. చాలా చిన్న భూభాగం కావడంతో వాణిజ్య విమానాశ్రయం నిర్మించడానికి తగినంత స్థలం లేదు. అయితే, ఇక్కడ చిన్న ఎయిర్పోర్ట్ లేదు. ఇటలీలోని రోమ్ విమానాశ్రయాల్లో దిగి, అక్కడి నుంచి కారులో సుమారు 30 నుంచి 45 నిమిషాల్లో వాటికన్ సిటీకి చేరుకోవచ్చు.
మొనాకో
యూరప్‌లోని అతి చిన్న దేశాల్లో మొనాకో ఒకటి. మధ్యధరా సముద్ర తీరంలో ఉన్న ఈ దేశం విలాసవంతమైన జీవనశైలి, అందమైన తీర ప్రాంతాలు, కార్ రేసింగ్ పోటీలకు ప్రసిద్ధి. ఇక్కడి రాజభవనం, క్యాసినోలు, సముద్ర తీరాలు పర్యాటకులను ఆకర్షిస్తాయి. దేశ విస్తీర్ణం చాలా తక్కువగా ఉండటంతో పెద్ద విమానాశ్రయాన్ని నిర్మించడానికి స్థలం లేదు. అయితే, హెలికాప్టర్ సేవలు అందుబాటులో ఉన్నాయి. ఫ్రాన్స్‌లోని నీస్ కోట్ డి'అజూర్ విమానాశ్రయంలో దిగి, అక్కడి నుంచి కారులో సుమారు 30 నుంచి 45 నిమిషాల్లో మొనాకోకు చేరుకోవచ్చు. రైలు, బస్సు సౌకర్యాలు కూడా ఉన్నాయి.
శాన్ మారినో
శాన్ మారినో పూర్తిగా ఇటలీ భూభాగంతో చుట్టుముట్టిన చిన్న దేశం. సుమారు 61 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగిన ఈ దేశం పురాతన కోటలు, కొండలు, ప్రకృతి అందాలకు ప్రసిద్ధి. ఇక్కడి చారిత్రక కట్టడాలు పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తాయి. చిన్న భూభాగం, కొండ ప్రాంతాలు ఎక్కువగా ఉండటంతో వాణిజ్య విమానాశ్రయం లేదు. ఇటలీలోని రిమిని నగరంలో ఉన్న ఫెడెరికో ఫెల్లిని అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగి, కారులో సుమారు 30 నిమిషాల్లో శాన్ మారినోకు చేరుకోవచ్చు. బస్సు సౌకర్యం కూడా అందుబాటులో ఉంది.
లిక్టెన్స్టైన్
స్విట్జర్లాండ్, ఆస్ట్రియా మధ్య ఉన్న చిన్న దేశం లిక్టెన్స్టైన్. పచ్చని మైదానాలు, అడవులు, నదులు, పర్వతాలు ఈ దేశానికి ప్రత్యేక ఆకర్షణ. ఇక్కడి పురాతన కోటలు, ప్రకృతి అందాలు పర్యాటకులకు మంచి అనుభూతిని అందిస్తాయి. దేశ విస్తీర్ణం తక్కువగా ఉండటంతో పాటు పర్వత ప్రాంతాలు ఎక్కువగా ఉండటం వల్ల వాణిజ్య విమానాశ్రయం నిర్మించలేదు. స్విట్జర్లాండ్‌లోని జ్యూరిచ్ విమానాశ్రయంలో దిగి, అక్కడి నుంచి రైలు లేదా కారులో లిక్టెన్స్టైన్కు వెళ్లవచ్చు. రోడ్డు మార్గంలో సాధారణంగా రెండు గంటల నుంచి రెండున్నర గంటల వరకు పట్టవచ్చు.
అండోరా
ఫ్రాన్స్, స్పెయిన్ మధ్య పైరినీస్ పర్వత ప్రాంతాల్లో ఉన్న దేశం అండోరా. మంచుతో కప్పబడిన పర్వతాలు, స్కీయింగ్ కేంద్రాలు, ప్రకృతి అందాలకు ఇది ప్రసిద్ధి. శీతాకాలంలో మంచు క్రీడల కోసం పెద్ద సంఖ్యలో పర్యాటకులు ఇక్కడికి వస్తుంటారు. పర్వత ప్రాంతాలు ఎక్కువగా ఉండటంతో విమానాశ్రయం నిర్మించడానికి అవసరమైన సమతల భూమి అందుబాటులో లేదు. స్పెయిన్‌లోని అండోరా–లా సేయు డి ఉర్గెల్ విమానాశ్రయం నుంచి కారులో సుమారు 35 నిమిషాల్లో అండోరాకు చేరుకోవచ్చు. అయితే, ఇక్కడ విమాన సర్వీసులు పరిమితంగా ఉంటాయి. మరో ప్రత్యామ్నాయం బార్సిలోనా విమానాశ్రయం. అక్కడి నుంచి బస్సు లేదా కారులో సుమారు మూడు గంటల్లో అండోరాకు వెళ్లవచ్చు.





