Godavari: గోదావరి నది సముద్రంలో కలిసే చోట కనిపించే అద్భుతం.. ‘అన్నా చెల్లెళ్ల గట్టు’
Godavari: గోదావరి నది తెలుగు రాష్ట్రాలకు ఎంతో ముఖ్యమైనది. గోదావరితో దైవంతో సమానంగా కొలుస్తారు. అయితే గోదావరి నది సముద్రంలో కలిసే చోట ఒక అద్భుత ప్రదేశం ఉంది. అదే అన్నా చెల్లెళ్ల గట్టు.

అన్నాచెల్లెళ్ల గట్టు గురించి తెలుసా?
ఆంధ్రప్రదేశ్‌లో గోదావరి నది సముద్రంలో కలిసే ప్రాంతాల్లో అంతర్వేది ఎంతో ప్రత్యేకమైనది. ఇక్కడ వశిష్ఠ గోదావరి సముద్రంలో కలిసే ప్రాంతాన్ని ‘అన్నాచెల్లెళ్ల గట్టు’ అని పిలుస్తారు. సముద్రం మధ్యలో పొడవుగా ఇసుక మేట గట్టు మాదిరిగా కనిపిస్తుంది. ఈ గట్టుకు ఒకవైపు గోదావరి నీరు, మరోవైపు సముద్రపు నీరు కనిపించేలా ఉంటుంది. ముఖ్యంగా రెండు వైపులా నీటి రంగులో తేడా కనిపించడం ఎంతో చూడముచ్చటగా ఉంటుంది. ఒక వైపు నీరు స్వచ్ఛంగా కనిపిస్తే, మరో వైపు సముద్రపు నీలి ఆకుపచ్చ కలిసిన రంగులో కనిపిస్తుంది.ఈ కారణంగానే అన్నాచెల్లెళ్ల గట్టు పర్యాటకులను బాగా ఆకర్షిస్తోంది.
ఎక్కడ ఉంది?
అన్నాచెల్లెళ్ల గట్టు అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయానికి సమీపంలోనే ఉంది. ఆలయ దర్శనానికి వచ్చే భక్తులు గట్టు ప్రాంతాన్ని కూడా సందర్శిస్తుంటారు. సముద్ర తీరం, లైట్‌హౌస్, కొబ్బరి తోటలు, వశిష్ఠాశ్రమం వంటి ప్రదేశాలు చుట్టుపక్కల ఉన్నాయి. దీంతో అంతర్వేది ఆధ్యాత్మిక పర్యటనతో పాటు ప్రకృతి అందాలను ఆస్వాదించేందుకు కూడా మంచి ప్రాంతంగా నిలుస్తోంది. గోదావరి నది సుదీర్ఘ ప్రయాణం తర్వాత ఇక్కడ సముద్రాన్ని చేరుతుంది. నదీ జలాలు సముద్రపు ఉప్పునీటిలో కలిసే దృశ్యం ఈ ప్రాంతానికి ప్రత్యేక గుర్తింపు తెచ్చింది. గోదావరి వరదల సమయంలో నీటి ప్రవాహం మరింత ఉధృతంగా ఉండటంతో సంగమ ప్రాంతంలో భారీ నీటి కదలిక కనిపిస్తుంది. అందుకే ఈ ప్రాంతాన్ని దగ్గరగా చూడాలనుకునే వారు స్థానిక సూచనలు పాటించడం అవసరం
ఆ పేరెలా వచ్చింది?
అన్నాచెల్లెళ్ల గట్టు పేరు వెనుక కూడా ఆసక్తికరమైన విషయం ఉంది. గోదావరిని చెల్లిగా, సముద్రాన్ని అన్నగా భావిస్తూ ఈ సంగమ ప్రాంతానికి అన్నాచెల్లెళ్ల గట్టు అనే పేరు వచ్చిందని స్థానికులు చెబుతారు. ఇక్కడ గోదావరి నీరు సముద్రంలో కలిసే దృశ్యం ఎంతో ఆకట్టుకుంటుంది. నదీ ప్రవాహం, సముద్రపు అలలు, ఇసుక గట్టు కలిసి ఒక ప్రత్యేకమైన ప్రకృతి దృశ్యాన్ని చూపిస్తాయి. అందుకే అంతర్వేదికి వెళ్లే పర్యాటకులు ఈ ప్రాంతాన్ని తప్పక చూడాలి. అయితే సంగమ ప్రాంతంలో ఒక్కోసారి నీటి ప్రవాహాలు ప్రమాదకరంగా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి నీటిలోకి వెళ్లకుండా దూరం నుంచి దృశ్యాన్ని ఆస్వాదించడం మంచిది.

