River : నాలుగు దేశాల రాజధానుల గుండా ప్రవహించే ఏకైక నది.. ఏదో తెలుసా?
Danube River : ఏకంగా 10 దేశాలమీదుగా ప్రయాణం, మొత్తం 19 దేశాల్లో పరివాహక ప్రాంతం కలిగిన అతిపెద్ద నది. అంతేకాదు ఈ నది 4 దేశాల రాజధానుల మీదుగా ప్రయాణిస్తుంది… ఇంతకీ ఆ నది ఏదో తెలుసా?

10 దేశాలు, 4 రాజధానుల గుండా ప్రవహించే నది ఏది?
ప్రపంచంలో చాలా దేశాల రాజధానులు నదుల ఒడ్డున వెలిశాయి. ఇండియా రాజధాని డిల్లీ యమునా నది ఒడ్డున ఉంటుంది... అలాగే యూకే రాజధాని లండన్ థేమ్స్ నది, ఫ్రాన్స్ రాజధాని పారిస్ సీన్ నది, అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీ పోటోమాక్ నది, ఈజిప్ట్ రాజధాని కైరో నైలు నది, ఇరాక్ రాజధాని బాగ్దాద్ టైగ్రిస్ నది ఒడ్డున ఉన్నాయి. ఇలా ఒక్కో దేశ రాజధాని ఒక్కో నదీ తీరంలో ఉన్నాయి... కానీ ఒకే నది ఒడ్డున ఏకంగా నాలుగు దేశాల రాజధానులు ఉన్నాయంటే నమ్మగలరా? అంతేకాదు ఈ నది ఒకటి రెండు కాదు ఏకంగా 10 దేశాల గుండా ప్రవహిస్తుంది... ఇంత ప్రత్యేకమైనది ఇంకెదో కాదు యూరప్ లో ప్రవహించే డాన్యూబ్ నది (Danube River).
డాన్యూబ్ నది జన్మస్ధలం ఏది?
డాన్యూబ్ నది ఐరోపా ఖండంలో ప్రవహించే ప్రముఖ నది. జర్మనీలోని బ్లాక్ ఫారెస్ట్ ఈ నది జన్మస్థానం... ఇక్కడ ప్రారంభమయ్యే నది తూర్పు దిశగా సుదీర్ఘ ప్రయాణం సాగిస్తుంది. సుమారు 2,850 కిలోమీటర్ల పొడవున ప్రవహించే డాన్యూబ్.. యూరప్‌లో రెండవ అత్యంత పొడవైన నది. రష్యాలో ప్రవహించే వోల్గా నది మొదటి స్థానంలో ఉంది.
జర్మనీలో చిన్న ప్రవాహంగా మొదలయ్యే డాన్యూబ్ తన ప్రయాణంలో అనేక ఉపనదులను కలుపుకుంటూ భారీ నదిగా మారుతుంది. ఎన్నో నగరాలు, పట్టణాలు, వ్యవసాయ ప్రాంతాలకు నీటిని అందిస్తూ చివరకు నల్ల సముద్రంలో కలుస్తుంది.
డాన్యూబ్ ఏఏ దేశాల రాజధానుల గుండా ప్రవహిస్తుంది?
డాన్యూబ్ నది ప్రత్యేకత ఏమిటంటే.. ఇది నాలుగు దేశాల రాజధాని నగరాల గుండా ప్రవహిస్తుంది. ప్రపంచంలో ఒకే నది నాలుగు దేశాల రాజధానులను తాకడం చాలా అరుదైన విషయం. ఇది ఏఏ దేశ రాజధానుల గుండా ప్రవహిస్తుందంటే..
వియన్నా (Vienna) – ఆస్ట్రియా రాజధాని వియన్నా డాన్యూబ్ నది తీరంలో ఉంది. సంగీతం, కళలు, చారిత్రక భవనాలకు ప్రసిద్ధి చెందిన ఈ నగర అభివృద్ధిలో డాన్యూబ్ కీలక పాత్ర పోషించింది.
బ్రాటిస్లావా (Bratislava) – స్లోవేకియా రాజధాని బ్రాటిస్లావా డాన్యూబ్ నది ఒడ్డున ఉంది. ఈ నది నగరానికి రవాణా, వాణిజ్యంతో పాటు పర్యాటక ప్రాధాన్యంను కూడా అందిస్తోంది.
బుడాపెస్ట్ (Budapest) – హంగేరి రాజధాని బుడాపెస్ట్‌ను డాన్యూబ్ నది రెండు భాగాలుగా విభజిస్తుంది. బుడా, పెస్ట్ ప్రాంతాలను కలుపుతూ నదిపై నిర్మించిన వంతెనలు ఈ నగరానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.
బెల్గ్రేడ్ (Belgrade) – సెర్బియా రాజధాని బెల్గ్రేడ్ వద్ద డాన్యూబ్ నది, సావా నదితో కలుస్తుంది. ఈ ప్రాంతం చారిత్రకంగా, రవాణా పరంగా ఎంతో కీలకమైనది.
డాన్యూబ్ 10 దేశాల గుండా ప్రవహిస్తుందా..!
డాన్యూబ్ నది మొత్తం 10 దేశాల గుండా ప్రవహిస్తుంది. ఒకే నది ఇన్ని దేశాలకు అనుసంధానంగా ఉండటం చాలా ప్రత్యేకమైన విషయం. జర్మనీలో మొదలయ్యే ఈ నది తూర్పు యూరప్ మీదుగా ప్రయాణించి నల్ల సముద్రంలో కలుస్తుంది.
డాన్యూబ్ నది ప్రవహించే 10 దేశాలు ఇవే
1. జర్మనీ (Germany)
2. ఆస్ట్రియా (Austria)
3. స్లోవేకియా (Slovakia)
4. హంగేరీ (Hungary)
5. క్రొయేషియా (Croatia)
6. సెర్బియా (Serbia)
7. రొమేనియా (Romania)
8. బల్గేరియా (Bulgaria)
9. మాల్డోవా (Moldova)
10. ఉక్రెయిన్ (Ukraine)
ఈ నది కొన్ని ప్రాంతాల్లో ఒక దేశం గుండా ప్రవహిస్తే, మరికొన్ని చోట్ల రెండు దేశాల మధ్య సరిహద్దుగా ఉంటుంది. అందుకే డాన్యూబ్ కేవలం నది మాత్రమే కాదు.. అనేక దేశాలను కలిపే అంతర్జాతీయ జలమార్గంగా కూడా ప్రాధాన్యం పొందింది.
డాన్యూబ్ నది ప్రధాన ప్రవాహం 10 దేశాల గుండా వెళ్తున్నప్పటికీ, దీని పరివాహక ప్రాంతం మరో 9 దేశాలకు కూడా విస్తరించి ఉంటుంది. అంటే ఆ దేశాల్లో కురిసే వర్షపు నీరు, అక్కడి నదులు, ఉపనదుల ద్వారా చివరకు డాన్యూబ్ నదీ వ్యవస్థలోకి చేరుతుంది. ఆ దేశాలు..
1. బోస్నియా అండ్ హెర్జెగోవినా
2. చెక్ రిపబ్లిక్
3. స్లోవేనియా
4. మాంటెనిగ్రో
5. స్విట్జర్లాండ్
6. ఇటలీ
7. పోలాండ్
8. ఉత్తర మాసిడోనియా
9. అల్బేనియా
ఈ విధంగా మొత్తం 19 దేశాల నీటి వ్యవస్థలు డాన్యూబ్ నదీ పరివాహక ప్రాంతంతో సంబంధం కలిగి ఉంటాయి. ప్రపంచంలో అత్యంత అంతర్జాతీయ నదీ పరివాహక ప్రాంతాల్లో డాన్యూబ్ ఒకటిగా గుర్తింపు పొందింది.
నల్ల సముద్రంలో డాన్యూబ్ సంగమం
యూరప్ లో దాదాపు 2850 కిలోమీటర్ల ప్రయాణం సాగించే డాన్యూబ్ నది చివరకు రొమేనియా, ఉక్రెయిన్ ప్రాంతాల్లో డాన్యూబ్ డెల్టాను ఏర్పరుస్తుంది. ఇక్కడ నది అనేక శాఖలుగా విడిపోయి చిత్తడి నేలలు, సరస్సులు, నీటి మార్గాలు, దీవులతో కూడిన భారీ డెల్టా ప్రాంతాన్ని సృష్టిస్తుంది.
ఈ డెల్టా ఐరోపాలో అత్యంత ముఖ్యమైన పర్యావరణ ప్రాంతాల్లో ఒకటి. అనేక రకాల పక్షులు, చేపలు, ఇతర జలచరాలకు ఇది నివాసంగా ఉంది. జీవవైవిధ్యం, ప్రకృతి సంపద కారణంగా డాన్యూబ్ డెల్టాకు అంతర్జాతీయ గుర్తింపు లభించింది. ఇక్కడి పర్యావరణ వ్యవస్థ పరిరక్షణకు కూడా ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నారు.
డాన్యూబ్ నది చివరకు నల్ల సముద్రంలో కలుస్తుంది. జర్మనీలోని బ్లాక్ ఫారెస్ట్‌లో చిన్న ప్రవాహాలుగా మొదలైన ఈ నది.. అనేక దేశాలు, రాజధాని నగరాలు, చారిత్రక ప్రాంతాలను దాటుతూ చివరకు సముద్రంలో కలవడం దీని సుదీర్ఘ ప్రయాణానికి ముగింపు.











