బ్యాంకు దివాలా తీస్తే ఏం చేయాలి? సేవింగ్స్‌లో ఎంత అమౌంట్ తిరిగి లభిస్తుందో తెలుసా?
భారతదేశంలో బ్యాంకులు దివాలా తీస్తే ఆ బ్యాంకు కస్టమర్ల పరిస్థితి ఏమవుతుందో తెలుసా? సాధారణంగా దాచుకున్న డబ్బంతా పోయిందని ఖాతాదారులు లబోదిబోమంటారు. కాని వారి భవిష్యత్తు భద్రత కోసం ఓ ప్రత్యేకమైన ఏర్పాటు ఉంది. దాని ద్వారా బ్యాంకు ఖాతాదారులకు సెక్యూర్ అమౌంట్ కూడా లభిస్తుంది. ఈ విషయం గురించి పూర్తి వివరాలు ఇక్కడ ఉన్నాయి.
ఇండియాలో బ్యాంకులు దివాలా తీసినా కస్టమర్లు ఇబ్బందులు పడకూడదని డిపాజిట్ ఇన్షూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ (DICGC) కస్టమర్ల డబ్బును బీమా చేసి ఉంచుతుంది. ఇది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కు చెందిన అనుబంధ సంస్థ. అందువల్ల మీరు డబ్బులు దాచుకున్న బ్యాంకు దివాలా తీసినా భయపడాల్సిన అవసరం ఉండదు.
ఒకవేళ బ్యాంకు దివాలా తీసినా డిపాజిట్లకు మాత్రం 5 లక్షల రూపాయల వరకు డిపాజిట్ ఇన్సూరెన్స్ లభిస్తుంది. మీకు ఖాతా ఉన్న బ్యాంకు దివాలా తీస్తే ఈ డబ్బు మీకు లభిస్తుంది. ఈ బీమా మొత్తాన్ని కొన్నేళ్ల క్రితం మాత్రమే పెంచారు. ఫిబ్రవరి 4, 2020 ముందు వరకు బ్యాంకులు దివాలా తీసిన సందర్భంలో డిపాజిట్లకు కేవలం 1 లక్ష వరకే బీమా ఉండేది.
2020లో ఈ నియమం మారింది. డిపాజిట్ బీమా 1 లక్ష నుండి 5 లక్షలకు పెరిగింది. ఒక వ్యక్తి అనేక బ్యాంకుల్లో ఖాతాలు కలిగి ఉంటే ప్రతి బ్యాంకులో అతని/ఆమె డిపాజిట్లకు ప్రత్యేకంగా బీమా ఉంటుంది. కానీ ఒకే బ్యాంకులో ఉన్న మొత్తం డిపాజిట్లకు కలిపి రూ. 5 లక్షల గరిష్ట పరిమితి వర్తిస్తుంది. అన్ని కమర్షియల్ బ్యాంకులు (ప్రైవేట్, పబ్లిక్, విదేశీ బ్యాంకులు), చిన్న ఫైనాన్స్ బ్యాంకులు, కోఆపరేటివ్ బ్యాంకులు DICGC బీమా పరిధిలో ఉంటాయి.
బ్యాంకు లైసెన్స్ రద్దు చేసినప్పుడు లేదా బ్యాంకు శాశ్వతంగా మూసివేసినప్పుడు 5 లక్షల వరకు బీమా లభిస్తుంది. పరిమితి కంటే ఎక్కువ డిపాజిట్లు ఉన్నవారు (రూ.5 లక్షల కంటే ఎక్కువ) వారి మిగిలిన డబ్బు తిరిగి రావడం చాలా కష్టం కావచ్చు. ఎందుకంటే ఇది బ్యాంక్ ఎసెట్ రికవరీ ప్రక్రియపై ఆధారపడి ఉంటుంది. అందువల్ల రూ. 5 లక్షలతో సరిపెట్టుకోవాల్సిందే.
బ్యాంకు దివాలా తీస్తే 90 రోజుల్లోపు బీమా మొత్తం లభిస్తుంది. భారతదేశంలోని అన్ని వాణిజ్య బ్యాంకులకు DICGC బీమా వర్తిస్తుంది. 5 లక్షల వరకు డబ్బు అయితే కచ్చితంగా గ్యారెంటీ ఉంది.