జనవరి 1 నుంచి ఇంటర్నెట్ లేకపోయినా ట్రాన్సాక్షన్స్ చేయొచ్చు
జనవరి 1, 2025 నుండి UPI ట్రాన్సాక్షన్స్ కి సంబంధించిన కొత్త రూల్స్ అమలు కానున్నాయి. ఈ విషయాన్ని RBI ప్రకటించింది. UPI 123 పేమెంట్స్ లిమిట్ కూడా పెంచారు. అవి కూడా జనవరి 1 నుంచి వినియోగదారులు ఉపయోగించుకోవచ్చని ఆర్బీఐ ప్రకటించింది. కొత్త రూల్స్, అప్డేషన్స్ కి సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ ఉన్నాయి.
డిజిటల్ ట్రాన్సాక్షన్స్ పల్లెల్లోకి కూడా వచ్చేశాయి. చదువు లేని వాళ్లు కూడా స్మార్ట్ ఫోన్లు ఉపయోగించడం, UPI లావాదేవీలు చేయడం నేర్చుకొని మరీ ట్రాన్సాక్షన్స్ చేస్తున్నారు. ఇప్పటికే ప్రతి వస్తువు కొనుగోలు ఫోన్ పే, గూగుల్ పే లను ఉపయోగించి చేస్తున్నారు. కరెన్సీ వాడకం చాలా వరకు తగ్గిపోయింది. డిజిటల్ లావాదేవీలు భారీగా పెరిగిన నేపథ్యంలో RBI ఇప్పటికే కొత్త నియమాలు ప్రకటించింది. అవన్నీ కొత్త సంవత్సరం 2025లో జనవరి 1 నుంచి అమలు కానున్నాయని ఇటీవల ఆర్బీఐ ప్రకటించింది.
జనవరి 1 నుండి UPI 123 చెల్లింపు లావాదేవీల పరిమితి పెరిగింది. ప్రస్తుతానికి UPI చెల్లింపు పరిమితి రూ.5,000 గా ఉంది. జనవరి 1 నుంచి రూ.10,000 వరకు ట్రాన్సాక్షన్ చేయవచ్చు. RBI ఇప్పటికే ఈ కొత్త నియమాన్ని ప్రకటించినప్పటికీ బ్యాంకులు, సర్వీస్ ప్రొవైడర్లు ఈ నియమాలను పాటించి, కస్టమర్లకు సేవలందించడానికి గడువు తీసుకున్నారు. ఇప్పుడు జనవరి 1 నుంచి రూ.10,000 వరకు లిమిట్ పెంపు సౌకర్యం కూడా అమలుకానుంది.
UPI 123Pay మార్పులతో పాటు RBI UPI లైట్ వాలెట్ల కోసం పరిమితులను కూడా పెంచింది. వాలెట్ బ్యాలెన్స్ పరిమితి రూ. 2,000 నుండి రూ. 5,000కి పెంచారు. ప్రతి లావాదేవీ పరిమితి రూ. 500 నుండి రూ. 1,000 వరకు పెంచారు. జనవరి 1 నుండి ఈ కొత్త నియమాలను అమలు చేయాలని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ నిర్ణయించింది. జనవరి 1 నుండి కొత్త UPI చెల్లింపు లావాదేవీ పరిమితిని పాటించాలని బ్యాంకులకు సూచించింది.
జనవరి 1 నుండి UPI చెల్లింపు పరిమితులే కాదు.. మరికొన్ని కొత్త రూల్స్ కూడా అమలులోకి వస్తున్నాయి. UPI 123 Pay ద్వారా జరిగే లావాదేవీలకు సర్వీస్ ఛార్జీలు ఇకపై ఉండవు. ఇది ప్రజలకు ఎంతో ఉపయోగకరమైన విషయం. ఈ ఫీచర్ ఫోన్‌లలో డిజిటల్ చెల్లింపులను సులభతరం చేస్తుంది. వినియోగదారులు ఇంటర్నెట్ కనెక్షన్ లేకుండా UPI సేవలను యాక్సెస్ చేయడానికి వీలు కల్పిస్తుంది. అంటే IVR ద్వారా చెల్లింపులు చేయవచ్చు.
జనవరి 1 నుండి అమలులోకి రానున్న మరో కొత్త రూల్ ఏంటంటే.. పాన్ కార్డ్‌తో ఆధార్ కార్డ్ లింక్ చేయడం తప్పనిసరి చేశారు. పాన్ కార్డ్‌తో ఆధార్ లింక్ చేయకపోతే పాన్ కార్డ్ నిలిపివేస్తారు. పాన్ కార్డ్ నిలిపివేస్తే ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన ఏ సేవలనూ పొందలేరు.