స్విగ్గీ, జొమాటో కస్టమర్లకు షాక్.. పండుగ సీజన్ లో దెబ్బకొట్టారు !
Swiggy and Zomato Raise Platform Fees: స్విగ్గీ, జొమాటో కస్టమర్లకు బిగ్ షాక్ తగిలింది. పండుగ సీజన్ డిమాండ్ దృష్ట్యా స్విగ్గీ, జొమాటో మరోసారి ప్లాట్‌ఫామ్ ఫీజును పెంచాయి. ఆ పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

పండుగ సీజన్ ముందు ఫుడ్ డెలివరీ ఫీజు పెంపు
ప్రధాన ఫుడ్ డెలివరీ సంస్థలైన స్విగ్గీ, జొమాటోలు కస్టమర్లకు షాక్ ఇచ్చాయి. వరుసగా తమ ప్లాట్‌ఫామ్ ఫీజులను పెంచాయి. పండుగ సీజన్ సమయంలో ఆర్డర్లు అధికమవుతాయని అంచనా వేసి ఈ నిర్ణయం తీసుకున్నట్టు కంపెనీలు ప్రకటించాయి. వినియోగదారుల ఆర్డర్లపై ఈ ఫీజులు నేరుగా ప్రభావం చూపనున్నాయి.
స్విగ్గీ ప్లాట్‌ఫామ్ ఫీజు రూ.15 పెంపు
బెంగళూరులో ప్రధాన కార్యాలయం ఉన్న స్విగ్గీ, మూడు వారాల్లో మూడోసారి ఫీజును పెంచింది. ఆగస్టు 14న రూ.12 నుంచి రూ.14కి పెంచిన ఈ ఫీజును, ఇప్పుడు రూ.15గా నిర్ణయించింది. ఇందులో జీఎస్టీ కూడా కలిపి ఉంటుంది.
అధిక డిమాండ్ ఉన్న మార్కెట్లలో మాత్రమే ఈ పెంపు అమలు అవుతుంది. పరిశ్రమ విశ్లేషకుల అంచనాల ప్రకారం, పండుగల తర్వాత ఈ ఫీజు తిరిగి రూ.12కు తగ్గే అవకాశం ఉంది.
జొమాటో ప్లాట్‌ఫామ్ ఫీజు రూ.12 లకు పెంపు
స్విగ్గీ బాటలోనే ముందుకు సాగుతూ జొమాటో కూడా తన ప్లాట్‌ఫామ్ ఫీజును రూ.10 నుంచి రూ.12కు పెంచింది. ఈ పెంపులో జీఎస్టీ ఉండదని కంపెనీ స్పష్టం చేసింది. అంటే వినియోగదారులు అదనంగా పన్ను చెల్లించాల్సి వస్తుంది. జొమాటో చివరిసారిగా 2024 అక్టోబర్‌లో ఫీజును సవరించింది. దాదాపు ఏడాది తర్వాత మళ్లీ జొమాటో ప్లాట్‌ఫామ్ ఫీజు లో మార్పులు చేసింది.
ఆర్థిక పరిస్థితులే కారణమా?
2025–26 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో స్విగ్గీ నష్టాలు రెండింతలై రూ.1,197 కోట్లకు చేరాయి. కంపెనీ ఇన్‌స్టామార్ట్ క్విక్ కామర్స్ విభాగంలో భారీగా పెట్టుబడులు పెట్టడం వలన నష్టాలు పెరిగాయని సమాచారం. అదే సమయంలో, ఆపరేటింగ్ ఆదాయం 54% పెరిగి రూ.4,961 కోట్లకు చేరింది.
మరోవైపు, జొమాటో నికర లాభం 90% పడిపోయి రూ.25 కోట్లకు చేరింది. అయితే కంపెనీ ఆదాయం 70% పెరిగి రూ.7,167 కోట్లకు చేరింది. ఈ నేపథ్యంలో అదనపు ఆదాయ వనరుగా ప్లాట్‌ఫామ్ ఫీజు పెంపు అవసరమని రెండు కంపెనీలు భావిస్తున్నాయని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు.
కస్టమర్లపై ప్లాట్‌ఫామ్ ఫీజు ప్రభావం
ఫుడ్ డెలివరీ ఆర్డర్లలో సగటు బిల్లు రూ.500 నుంచి రూ.600 మధ్య ఉంటుంది. దానితో పోలిస్తే రూ.12–15 ఫీజు తక్కువగానే కనిపించినా, పెద్ద సంఖ్యలో ఆర్డర్ల ద్వారా కంపెనీలకు కోట్ల రూపాయల ఆదాయం వస్తోంది.
ఉదాహరణకు, స్విగ్గీ రోజుకు సుమారు 20 లక్షల ఆర్డర్ల ద్వారా కేవలం ఫీజుల ద్వారానే రూ.3 కోట్లకు పైగా సంపాదించే అవకాశముంది. జొమాటో కూడా 23–25 లక్షల ఆర్డర్ల ద్వారా దాదాపు అంతే ఆదాయాన్ని పొందుతోంది.
పెరుగుతున్న పోటీ
ఈ రంగంలో పోటీ పెరుగుతొంది. కొత్త కంపెనీలు వస్తున్నాయి. మొబిలిటీ స్టార్టప్ రాపిడో, ఇటీవల బెంగళూరులోని కొన్ని ప్రాంతాల్లో ఓన్లీ పేరుతో ఫుడ్ డెలివరీ సేవలు ప్రారంభించింది. స్విగ్గీ, జొమాటో వసూలు చేసే 16–30% కమీషన్‌తో పోలిస్తే, రాపిడో తన ఫీజులను 8–15% మధ్య ఉంచింది. ఇది భవిష్యత్తులో మార్కెట్ పోటీని మరింత కఠినతరం చేయవచ్చని నిపుణులు భావిస్తున్నారు.