5 రోజుల్లో 30% పెరిగిన ఓలా ఎలక్ట్రిక్ షేర్లు.. కొనాలా, అమ్మాలా లేక హోల్డ్ చేయాలా?
Ola Electric Mobility: ఓలా ఎలక్ట్రిక్ షేర్లు కేవలం 5 రోజుల్లో దాదాపు 30% పెరిగాయి. ఇలాంటి సమయంలో మీరు ఓలా షేర్లు కొనాలా, అమ్మాలా లేక హోల్డ్ చేయాలా? విశ్లేషకుల అభిప్రాయాలు, ఫండమెంటల్స్, భవిష్యత్ అంచనాల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

షేర్ మార్కెట్‌లో దుమ్మురేపుతున్న ఓలా ఎలక్ట్రిక్
ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ షేర్లు గత ఐదు ట్రేడింగ్ సెషన్లలో 29.6% పెరిగాయి. సోమవారం ఒక్క రోజే బీఎస్‌ఈలో 13% వరకు పెరిగి రూ.61.14 వద్ద ట్రేడయ్యాయి. ఈ పెరుగుదలకు ప్రధాన కారణం కంపెనీకి లభించిన ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ (PLI) సర్టిఫికేషన్. ఈ సర్టిఫికేషన్ కంపెనీ మార్జిన్లు మెరుగుపడటానికి, లాభదాయకత వైపు వేగంగా అడుగులు వేయడానికి దోహదపడుతుందని మేనేజ్‌మెంట్ ప్రకటించింది.
KNOW
ఓలాపై PLI సర్టిఫికేషన్ ప్రభావం
భారీ పరిశ్రమల మంత్రిత్వశాఖ స్కీమ్ కింద ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఓలా ఎలక్ట్రిక్‌కు ఆమోదం తెలిపింది. దీని ప్రకారం 2028 వరకు కంపెనీకి అమ్మకాల విలువలో 13% నుంచి 18% వరకు ఇన్సెంటివ్ లభ్యం అవుతుంది. ఈ సర్టిఫికేషన్ ఓలా Gen 3 S1 స్కూటర్లన్నింటికీ వర్తిస్తుంది. ఇవి ప్రస్తుతం కంపెనీ మొత్తం అమ్మకాలలో సగానికి పైగా వాటాను కలిగి ఉన్నాయి.
కంపెనీ ప్రతినిధి మాట్లాడుతూ, “Gen 3 స్కూటర్లకు PLI సర్టిఫికేషన్ పొందడం లాభదాయకతకు కీలకమైన అడుగు. ఇది మా ఖర్చు నిర్మాణాన్ని, మార్జిన్లను బలపరుస్తుంది” అని తెలిపారు.
షేర్ మార్కెట్ లో ఓలా పరుగులపై విశ్లేషకులు ఏమంటున్నారు?
• మందార్ భోజానే (Choice Broking) – స్టాక్ ఫాలింగ్ ఛానెల్ నుంచి బ్రేకౌట్ ఇచ్చిందని తెలిపారు. రూ.52–50 స్థాయిలో కొనుగోలు అవకాశాలు ఉన్నాయని, రూ.62–70 వరకు వెళ్లే అవకాశముందని అభిప్రాయపడ్డారు.
• డ్రుమిల్ విఠ్లాని (Bonanza) – స్టాక్‌కు రూ.55–58 వద్ద రెసిస్టెన్స్, రూ.50 వద్ద సపోర్ట్ ఉందని చెప్పారు. RSI 68 వద్ద ఉండటం వల్ల షార్ట్‌టర్మ్‌లో సరిదిద్దుకునే అవకాశం ఉందని హెచ్చరించారు.
• అనిరుధ్ గార్గ్ (INVasset PMS) – సంవత్సరం పాటు కొనసాగిన డౌన్‌ట్రెండ్ నుంచి స్టాక్ బయటపడిందని, వాల్యూమ్స్ బలంగా ఉన్నాయని అన్నారు. రూ.68–70 స్థాయికి వెళ్లే అవకాశం ఉన్నా, RSI 70 వద్ద ఉండటంతో జాగ్రత్త అవసరమని పేర్కొన్నారు.
ఓలా ఆర్థిక స్థితి ఎలా ఉంది?
మార్కెట్‌లో ఓలా దూకుడు ఉన్నప్పటికీ కంపెనీ ఫండమెంటల్స్ ఇంకా బలహీనంగానే ఉన్నాయి. జూన్ క్వార్టర్‌లో కంపెనీ రూ.428 కోట్లు నికర నష్టాన్ని ప్రకటించింది. ఇది గత ఏడాదితో పోలిస్తే ఎక్కువ అయినా, క్రమంగా అది తక్కువైంది. రెవెన్యూ ఏడాది వారీగా సగానికి తగ్గి రూ.828 కోట్లకు చేరింది. అయితే గ్రాస్ మార్జిన్ 25.6% కు మెరుగుపడింది.
గత వారం జరిగిన వార్షిక సర్వసభ్య సమావేశంలో IPO నిధుల పునర్వినియోగం, టైమ్‌లైన్ పొడిగింపు కోసం షేర్‌హోల్డర్ల ఆమోదం పొందింది. విశ్లేషకులు దీన్ని “స్ట్రక్చరల్ మైల్స్‌స్టోన్” గా అభివర్ణించినప్పటికీ, మార్కెట్ షేర్ నిలుపుకోవడం కీలకమని హెచ్చరించారు.
ఇండస్ట్రీ సవాళ్లు, ఓలా భవిష్యత్ ప్రణాళికలు ఎలా ఉన్నాయి?
ఈవీ రంగం ప్రస్తుతం చైనా అమలు చేసిన రేర్ ఎర్త్ ఎగుమతి పరిమితుల ప్రభావం ఎదుర్కొంటోంది. దీనికి ప్రతిస్పందనగా ఓలా, రేర్ ఎర్త్ మాగ్నెట్స్ లేని మోటార్ల అభివృద్ధి వేగవంతం చేస్తోంది. రాబోయే నెలల్లో సరఫరా గొలుసు సమస్యలు తగ్గుతాయని అంచనా.
అలాగే, కంపెనీ కొత్త మోడళ్లపై ఆశలు పెట్టుకుంది. S1 Pro Sport, S1 Pro+ 5.2 kWh, Roadster X+ 9.1 kWh మోడళ్లు త్వరలో విడుదల కానున్నాయి. డెలివరీలు 2025 చివరి త్రైమాసికం నుంచి 2026 ఆరంభం వరకు జరగనున్నాయి.
ఓలా ఎలక్ట్రిక్ స్టాక్ పనితీరు ఎలా ఉంది?
2025లో ఇప్పటివరకు ఓలా షేర్లు IPO ధర రూ.76 కంటే ఇంకా తక్కువగా ఉన్నాయి. అయినప్పటికీ షార్ట్‌టర్మ్, మీడియంటర్మ్ మూవింగ్ అవరేజ్‌లకు పైగా ట్రేడవుతున్నాయి. 200-డే SMA కంటే మాత్రం దిగువన ఉన్నాయి.
ఆగస్టులో కంపెనీ షేర్లు లిస్టింగ్ నుంచి ఇప్పటివరకు అత్యుత్తమ నెలవారీ పనితీరును చూపాయి. ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల ఆసక్తి పెరగడం, PLI సర్టిఫికేషన్ పొందడం, కొత్త ఉత్పత్తులపై ఆశలు పెట్టుకోవడం దీనికి ప్రధాన కారణాలు.
వ్యక్తిగత ఆర్థిక లక్ష్యాలతో నిర్ణయం తీసుకోండి
మొత్తంగా ఓలా షేర్లపై ఇన్వెస్టర్ రిస్క్ బేరింగ్ కెపాసిటీ, ఇన్వెస్ట్ చేసే టైమ్ ఫ్రేమ్, వ్యక్తిగత ఆర్థిక లక్ష్యాలపై ఆధారపడి ఉంటుంది. అయితే విశ్లేషకుల అభిప్రాయాలు, కంపెనీ పరిస్థితులు చూసుకుంటే.. ఓలా షేర్ ధర రూ.50–52 వరకు పడితే మాత్రమే కోనుగోలు చేయడం ఉత్తమం. ఇప్పటికే ఇన్వెస్ట్ చేసి ఉంటే, 68–70 వరకు వెళ్లే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. కాబట్టి హోల్డ్ చేయవచ్చు. తక్కువ లాభాలు తీసుకోవాలనుకుంటే, ప్రస్తుత స్థాయిల్లో లేదా 62–68 దగ్గర ప్రాఫిట్ బుకింగ్ చేయవచ్చు.
అంటే, ప్రస్తుతానికి కొత్తగా వెంటనే కొనడం సురక్షితం కాదు, ఇప్పటికే పెట్టుబడి పెట్టినవారు హోల్డ్ చేయవచ్చు, లాభం తీసుకోవాలనుకునేవారు అమ్ముకోవచ్చు. ఇవి కేవలం అంచనాలు మాత్రమే.. కాబట్టి మీకు తెలిసిన మరింత మంది నిపుణుల సలహాలు తీసుకోగలరు.