- Home
- Business
- Gold Price Crash: మళ్లీ పశ్చిమాసియాలో ముదిరిన యుద్ధం..పాతాళానికి పడిపోతున్న పసిడి, సిల్వర్
Gold Price Crash: మళ్లీ పశ్చిమాసియాలో ముదిరిన యుద్ధం..పాతాళానికి పడిపోతున్న పసిడి, సిల్వర్
Gold Price Crash: గత కొద్ది రోజులుగా ఆకాశమే హద్దుగా పెరిగిన బంగారం ధరలు ఇప్పుడు క్రమంగా దిగొస్తున్నాయి. వరుసగా రెండు రోజుల నుంచి పసిడి ధరల్లో తగ్గుదల నమోదవుతుండటంతో బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి కొంత ఊరట లభిస్తోంది.

తగ్గుముఖం పడుతున్న పసిడి, సిల్వర్
ఇటీవల భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు ఇప్పుడు తగ్గుముఖం పడుతున్నాయి. ముఖ్యంగా అమెరికా డాలర్ బలపడటం విలువైన లోహాలపై ఒత్తిడి పెంచుతున్నట్లు తెలుస్తోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు డాలర్లలో నిర్ణయించబడుతుండటంతో డాలర్ బలపడిన సమయంలో పసిడికి డిమాండ్‌పై ప్రభావం పడే అవకాశం ఉంటుంది. దీంతో గత నాలుగైదు రోజులుగా బంగారం, వెండి ధరల్లో ఒడిదుడుకులు కనిపిస్తున్నాయి.
ముఖ్యంగా శ్రావణమాసం, పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాల కోసం ఆభరణాలు కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్న వారికి తాజా ధరల తగ్గుదల కలిసొస్తోంది. కేవలం మూడు రోజుల్లోనే తులం బంగారం ధర దాదాపు రూ.7,500 వరకు తగ్గడం మార్కెట్‌లో చర్చనీయాంశంగా మారింది.
రూ.1,56,770కు చేరిన బంగారం
తాజా ధరలను పరిశీలిస్తే గత రెండు రోజుల వ్యవధిలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,470 మేర తగ్గింది. ఇదే సమయంలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,350, 18 క్యారెట్ల బంగారం ధర రూ.830 వరకు దిగొచ్చింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ప్రస్తుతం రూ.1,56,770 వద్ద కొనసాగుతుండగా, 22 క్యారెట్ల బంగారం రూ.1,43,700 వద్ద ఉంది. 18 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,17,850 వద్ద ట్రేడ్ అవుతోంది.
మళ్లీ ముదిరిన యుద్ధం
పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు కూడా అంతర్జాతీయ మార్కెట్లను ప్రభావితం చేస్తున్నాయి. అమెరికా, ఇరాన్ మధ్య మరోసారి ఉద్రిక్తతలు పెరగడం, హర్మూజ్ జలసంధి పరిసరాల్లో చోటుచేసుకుంటున్న పరిణామాలు ప్రపంచ వాణిజ్యంపై ఆందోళన కలిగిస్తున్నాయి. కీలక సముద్ర రవాణా మార్గాల్లో భద్రతకు సంబంధించిన పరిణామాలు చమురు ధరలు, డాలర్ కదలికలు, పెట్టుబడిదారుల సెంటిమెంట్‌ను ప్రభావితం చేసే అవకాశం ఉంది. ఈ అంశాల ప్రభావం బంగారం, వెండి మార్కెట్‌పైనా కనిపిస్తోంది.
ఎగబడుతున్న పసిడి ప్రియులు
మరోవైపు ప్రస్తుతం శుభకార్యాలు, పెళ్లిళ్ల సీజన్ కొనసాగుతుండటంతో ఆభరణాలకు డిమాండ్ పూర్తిగా తగ్గలేదు. ధరలు కొంత దిగిరావడంతో ఇంతకాలం కొనుగోళ్లను వాయిదా వేసుకున్న వినియోగదారులు ఇప్పుడు మళ్లీ జ్యువెలరీ షాపుల వైపు ఆసక్తి చూపుతున్నారు. దీంతో రిటైల్ మార్కెట్‌లో కొనుగోళ్లు క్రమంగా పెరుగుతున్నట్లు తెలుస్తోంది. ధరలు మరింత తగ్గితే కొనుగోలు చేయాలనే ఆలోచనలో మరికొందరు ఎదురుచూస్తున్నారు.
ధరలపై కొంతకాలం ఒత్తిడి
అయితే బంగారం ధరలు ఇంకా తగ్గుతాయా అన్నదే ఇప్పుడు ప్రధాన ప్రశ్నగా మారింది. మార్కెట్ నిపుణుల అంచనాల ప్రకారం అంతర్జాతీయ మార్కెట్లలో ప్రస్తుత పరిస్థితులు కొనసాగితే ధరలపై కొంతకాలం ఒత్తిడి ఉండే అవకాశం ఉంది. ద్రవ్యోల్బణం, అమెరికా వడ్డీ రేట్లపై అంచనాలు, డాలర్ బలం, రూపాయి మారకం విలువ, అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులు, యుద్ధ ఉద్రిక్తతలు వంటి అనేక అంశాలు పసిడి ధరల దిశను నిర్ణయిస్తాయి.

