Aadhaar PAN Link : డిసెంబర్ 31 డెడ్‌లైన్.. ఆధార్, పాన్ లింక్ చేయకపోతే ఏం జరుగుతుంది?
Aadhaar PAN Linking : డిసెంబర్ 31లోపు ఆధార్ కార్డు, పాన్ కార్డును లింక్ చేయడం తప్పనిసరి. గడువు దాటితే పాన్ డీయాక్టివ్ అవుతుంది. దీంతో మీ బ్యాంక్ సహా ఇతర లావాదేవీల్లో ఇబ్బందులు తలెత్తుతాయి. పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

ఆధార్, పాన్ లింక్ ఎందుకు తప్పనిసరి?
దేశవ్యాప్తంగా ఉన్న పాన్ కార్డు హోల్డర్లందరికీ కేంద్ర ప్రభుత్వం మరోసారి కీలక హెచ్చరిక జారీ చేసింది. ఇన్‌కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 సెక్షన్ 139AA ప్రకారం, పర్మినెంట్ అకౌంట్ నంబర్ (PAN) ను ఆధార్‌తో లింక్ చేయడం తప్పనిసరి. ఇందుకోసం ప్రభుత్వం ఈ ఏడాది డిసెంబర్ 31 వరకూ గడువు ఇచ్చింది. గడువు ముగిసినా ఇప్పటికీ లింక్ చేయని వారు జనవరి 1, 2026 నుంచి పెద్ద ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆ తేదీ తర్వాత పాన్ డీయాక్టివ్ అవుతుంది.
పాన్ డీయాక్టివ్ అయితే బ్యాంకింగ్, ట్యాక్స్, రుణాలు, ఇన్వెస్ట్‌మెంట్లు, పెద్ద మొత్తంలో కొనుగోళ్లు వంటి దాదాపు అన్ని ఆర్థిక కార్యకలాపాలు నిలిచిపోతాయి.
ఎన్‌రోల్‌మెంట్ నెంబర్‌తో ఉన్న పాన్ సరిపోదా?
చాలామంది ఆధార్ కార్డు రాకముందే పాన్ పొందారు. అప్పట్లో ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ నెంబర్ (EID) ఉపయోగించి పాన్ జారీ చేసుకున్నారు. ఇప్పుడు చాలా మంది, “మన పాన్ ఇప్పటికే EID ఆధారంగా లింక్ అయి ఉంటుంది కాబట్టి మళ్లీ చేయాల్సిన పని లేదు”
అంటూ భావిస్తున్నారు. దీని పై కేంద్రం స్పందిస్తూ.. కేవలం ఆధార్ కార్డు నెంబర్‌తోనే పాన్ లింక్ చేయాలి. ఎన్‌రోల్‌మెంట్ నెంబర్ సరిపోదు. ఇలాంటి వారు కూడా తప్పనిసరిగా డిసెంబర్ 31లోపు పాన్, ఆధార్ లింక్ పూర్తి చేయాలి అని పేర్కొంది. లింక్ చేయకపోతే జనవరి 1, 2026 నుంచి పాన్ ఆటోమేటిక్‌గా ఇనాక్టివ్ అవుతుంది.
చివరి తేదీ దాటితే ఎదురయ్యే ఇబ్బందులు ఏమిటి?
పాన్ పనిచేయకుండా పోతే, మీ రోజువారీ ఆర్థిక కార్యకలాపాలు ఆగిపోతాయి. పాన్ డీయాక్టివ్ అయినప్పుడు మీరు బ్యాంక్ ఖాతా ఓపెన్ చేయడం, డీమ్యాట్, ట్రేడింగ్ అకౌంట్స్ ఓపెన్ చేయడం, 50,000 పైగా డిపాజిట్లు/విత్‌డ్రాలు, ఐటిఆర్ దాఖలు చేయడం, ట్యాక్స్ రిఫండ్స్ పొందడం, FDలపై సాధారణ TDS బదులు అధిక TDS (20% వరకు), లోన్లు, క్రెడిట్/డెబిట్ కార్డులు పొందడం, మ్యూచువల్ ఫండ్స్ కొనుగోలు చేయలేరు. ఇల్లు/వాహనం కొనుగోలుకు అవసరమైన ధృవీకరణలో సమస్యలు రావచ్చు.
డీయాక్టివేట్ పాన్ రీయాక్టివేషన్ ఎలా?
గడువు దాటితే పాన్ మళ్లీ యాక్టివేట్ చేయడానికి రూ. 1,000 జరిమానా ఉంటుంది. యాక్టివేషన్‌కు 1 వారం నుంచి 1 నెల పడే అవకాశం ఉంటుంది.
ఆన్లైన్‌లో పాన్, ఆధార్ లింక్ చేసే పద్ధతి స్టెప్ బై స్టెప్
1. ఇన్‌కమ్ ట్యాక్స్ పోర్టల్ ఓపెన్ చేయండి.
2. హోమ్‌పేజీలో ఎడమవైపు ‘Link Aadhaar’ పై క్లిక్ చేయండి.
3. పాన్ నెంబర్, ఆధార్ నెంబర్ నమోదు చేయండి.
4. వివరాలు సరైందో లేదో చూసి Validate పై క్లిక్ చేయండి.
5. అవసరమైతే లేట్ ఫీ రూ.1000 ఫీజు ఆన్లైన్‌లో చెల్లించండి.
6. OTP వెరిఫికేషన్ పూర్తి చేస్తే లింకింగ్ ప్రాసెస్ పూర్తవుతుంది.
పాన్, ఆధార్ లింకింగ్ అయిందా? లేదా? ఎలా చెక్ చేయాలి?
వెబ్‌సైట్ ద్వారా:
1. అదే పోర్టల్‌లో ‘Link Aadhaar Status’ పై క్లిక్ చేయండి.
2. పాన్, ఆధార్ నెంబర్లు నమోదు చేస్తే మీ స్టేటస్ తెలుస్తుంది.
SMS ద్వారా:
UIDPAN ఇలా టైప్ చేసి 567678 లేదా 56161 నంబర్‌కు పంపాలి.
ఉదాహరణ: UIDPAN 123412341234 ABCDE1234F
ఆ తర్వాత మీకు వివరాలు అందుతాయి.

