Free Bus: దివ్యాంగులకు సీఎం చంద్రబాబు బంపర్ ఆఫర్
Chandrababu Naidu: ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా విజయవాడలో సీఎం చంద్రబాబు నాయుడు దివ్యాంగుల క్రికెట్ ప్లేయర్ కరుణ కుమారికి రూ. 15 లక్షలు, దీపికకు రూ. 10 లక్షలతో పాటు ఇళ్ల నిర్మాణం ప్రకటించారు. రూ.6,000 పింఛను ఇస్తున్నట్లు వెల్లడించారు.

విజయవాడలో ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం: అంధ క్రీడాకారిణులకు సీఎం అభినందనలు
దివ్యాంగుల క్రికెట్ ప్లేయర్లకు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు బంపర్ ఆఫర్ ప్రకటించారు. ప్రపంచ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. ఇటీవల అంధ మహిళల ప్రపంచ కప్ పోటీల్లో అద్భుత ప్రతిభ కనబరిచిన కరుణ కుమారి, దీపికలను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ప్రత్యేకంగా అభినందించారు.
దివ్యాంగులు ఎప్పుడూ బలహీనులు కారని, వారు విభిన్న ప్రతిభావంతులు అని చంద్రబాబు నాయుడు ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. కొంచెం మద్దతిస్తే వారు విజయం సాధించగలరనీ, విల్ పవర్, పట్టుదల, శక్తి వారికి పుష్కలంగా ఉన్నాయని తెలిపారు. పట్టుదలకు దివ్యాంగులు చిరునామాగా ఉంటారని ముఖ్యమంత్రి కొనియాడారు. సమాజంలో అందరిలాగే దివ్యాంగులకు కూడా అవకాశాలు, హక్కులు, గౌరవం దక్కాలని ఆయన ఆకాంక్షించారు.
క్రీడాకారిణులకు ప్రోత్సాహకాలు
ప్రపంచ కప్‌లో దేశం గర్వపడేలా రాణించిన కరుణ కుమారి, దీపికలను ఈ కార్యక్రమం ద్వారా అభినందించడమే కాకుండా, పూర్తిగా ప్రోత్సహించాలని ముఖ్యమంత్రి ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున కరుణ కుమారికి రూ. 15 లక్షల నగదు ప్రోత్సాహం, అలాగే ఇంటి నిర్మాణం చేపడతామని సీఎం హామీ ఇచ్చారు. మరో క్రీడాకారిణి దీపికకు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున రూ. 10 లక్షల ప్రోత్సాహం, ఇంటి నిర్మాణం చేపడతామని ప్రకటించారు.
ఈ క్రీడాకారులకు శిక్షణ ఇచ్చిన కోచ్ అజయ్ కుమార్ రెడ్డికి ముఖ్యమంత్రి రూ. 2.50 లక్షల నగదు ప్రోత్సాహకం ప్రకటించారు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) తరపున అంధ మహిళల క్రికెట్ టీంకు ముఖ్యమంత్రి రూ.10 లక్షల చెక్కును అందించారు. దీంతో పాటు ఏసీఏ, గొట్టిపాటి హర్షవర్ధన్ తరుపున కరుణ కుమారికి ఒక్కొక్కరి తరపున రూ.5 లక్షల చొప్పున మొత్తం రూ.10 లక్షల చెక్కును సీఎం చంద్రబాబు స్వయంగా అందజేశారు. అనంతరం ముఖ్యమంత్రి దివ్యాంగులకు కిట్లు పంపిణీ చేశారు.
దివ్యాంగుల పింఛనుగా రూ.6,000
దివ్యాంగుల ఎదుగుదలకు ఉన్న అడ్డంకులు తొలగిస్తూ తమ ప్రభుత్వం అవసరమైన విధానాలను రూపొందిస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. దివ్యాంగులకు అండగా ఉన్నది తమ ప్రభుత్వమేనని ఉద్ఘాటించారు. స్వర్గీయ ఎన్టీఆర్ మొదట దివ్యాంగుల పింఛను రూ.35గా నిర్ణయించారని, ఆ తర్వాత 2014లో తాను ముఖ్యమంత్రి అయిన వెంటనే ఆ పింఛనును రూ.3,000కు పెంచామని తెలిపారు.
తాజాగా 2024లో మళ్లీ రూ.6,000కు పెంచామని ఆయన తెలిపారు. దేశంలో ఎక్కడా రూ.6 వేలు పింఛను ఇవ్వడం లేదని, ఇది దివ్యాంగుల పట్ల తమ ప్రభుత్వానికి ఉండే అభిమానం, ప్రేమను తెలియజేస్తుందని అన్నారు. రాష్ట్రంలో 7.68 లక్షల మంది దివ్యాంగులకు ప్రతి నెలా రూ.470 కోట్లు, ఏడాదికి రూ.6 వేల కోట్లు పింఛన్ల రూపంలో ఇస్తున్నామని ముఖ్యమంత్రి వివరించారు.
దివ్యాంగులను ఆదుకోవడానికి ప్రభుత్వ చర్యలు
గత పాలకుల అస్తవ్యస్థ విధానాలతో రాష్ట్రం ఆర్థికంగా ఛిన్నాభిన్నమైనా, దివ్యాంగులను ఆదుకోవడానికి తమ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. వైకల్యం విజయానికి అడ్డం కాదని కరుణ కుమారి, దీపిక, కోచ్ అజయ్ కుమార్ రెడ్డి నిరూపించారని ఆయన ప్రశంసించారు. అల్లూరి జిల్లాకు చెందిన కరుణ కుమారి ఎంతో ప్రేరణతో ఉండేదని, కేవలం శబ్దంతోనే క్రికెట్ నేర్చుకుందని ముఖ్యమంత్రి తెలిపారు.
ఆర్థిక పరిస్థితి బాగోలేకపోయినా కప్పుతో ఇంటికి వస్తానని తండ్రికి మాట ఇచ్చి, అవార్డుతో వచ్చి మాట నిలబెట్టుకుందని కొనియాడారు. తీవ్రమైన దృష్టిలోపం ఉన్నా ప్రతిభలో వెనకబడకుండా, 42 పరుగులు చేసి దేశానికి కప్ రావడంలో కీలకంగా వ్యవహరించిందని అన్నారు. ఆమెను చూసి తనకు తృప్తి కలిగిందని, ఆధునిక వసతులతో ఉన్న పాఠశాలలో కాకుండా ప్రభుత్వ స్కూల్లో చదువుకుని ప్రపంచ కప్ గెలవడం అందరికీ స్ఫూర్తి కావాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు.
అంతేకాక, బ్యాక్ లాగ్ పోస్టులకు సంబంధించిన స్పెషల్ రిక్రూట్ మెంట్ డ్రైవ్‌ను పొడిగిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ ఏడాది 1800 మోటార్ వాహనాలను దివ్యాంగులకు పంపిణీ చేస్తున్నట్లు, వీటితో పాటు వీల్ చైర్లు, ట్రై సైకిళ్లు, వినికిడి యంత్రాలు దాదాపు 14 వేల మందికి పంపిణీ చేసినట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు.
అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం.. ఇంద్రధనస్సులా 7 వరాలు
ప్రభుత్వం అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా దివ్యాంగుల కోసం ఇంద్రధనస్సులా 7 వరాలను చంద్రబాబు ప్రకటించారు.
1. మహిళలతో పాటు దివ్యాంగులకు కూడా ఏపీఎస్ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం కల్పిస్తామన్నారు.
2. స్థానిక సంస్థల్లో, కార్పొరేషన్స్-పబ్లిక్ సెక్టార్ ఎంటర్‌ప్రైజెస్‌లో కనీసం ఒక దివ్యాంగ ప్రతినిధిని నామినేట్ చేస్తామన్నారు.
3. ఆర్ధిక సబ్సిడీ పథకాన్ని SC, ST, BC, మైనారిటీలకు అందించినట్టుగానే దివ్యాంగులకు మళ్లీ ప్రారంభిస్తామన్నారు.
4. SAAP ద్వారా అన్ని క్రీడా కార్యక్రమాలు, టాలెంట్ డెవలప్మెంట్ స్కీములు దివ్యాంగులకు అందుబాటులో ఉండేలా చర్యలు.
5. బహుళ అంతస్తులు కలిగిన ప్రభుత్వ హౌసింగ్ ప్రాజెక్టుల్లో దివ్యాంగులకు గ్రౌండ్ ఫ్లోర్ కేటాయిస్తామన్నారు.
6. బాపట్లలో ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ పాఠశాల, జూనియర్ కాలేజ్‌తో పాటు వినికిడి లోపం ఉన్న విద్యార్థుల కోసం ప్రత్యేక డిగ్రీ కాలేజీ ఏర్పాటు. రెసిడెన్షియల్ స్కూల్స్, కాలేజీలు, హాస్టల్స్‌లో చదివే దివ్యాంగ విద్యార్ధులకు అదే చోట సామాజిక భద్రతా పెన్షన్ పంపిణీ చేస్తామని తెలిపారు.
7. రాష్ట్ర స్థాయిలో అమరావతిలో ‘దివ్యాంగ్ భవన్’ ఏర్పాటు చేయనున్నట్టు సీఎం ప్రకటించారు.

