Vastu Tips for Study Room: స్టడీ రూమ్ ఈ దిశలో ఉంటే చదువులో విజయం మీ సొంతం!
వాస్తు ప్రకారం నడుచుకుంటే అంతా మంచే జరుగుతుందని చాలామంది నమ్ముతారు. చదువుకు సంబంధించి వాస్తు శాస్త్రం కొన్ని విషయాలు చెబుతోంది. స్టడీ రూమ్ వాస్తు ప్రకారం ఉంటే చదువులో విజయం తథ్యమట. మరి స్టడీ రూమ్ ఎలా ఉండాలి? ఏ వైపు ఉండాలో ఇక్కడ చూద్దాం.

స్టడీ రూమ్ వాస్తు నియమాలు
ఇంటి ప్రతి భాగానికి ప్రత్యేక వాస్తు నియమాలు ఉంటాయి. ముఖ్యంగా పిల్లలు చదువుకునే స్టడీ రూమ్ కి చాలా ప్రాముఖ్యత ఉంది. దాని దిశ స్థానం, కొలతలు అన్నీ జ్ఞానం, ఏకాగ్రత, పరీక్షల్లో విజయానికి దోహదపడతాయి. వాస్తు శాస్త్ర సూత్రాలను పాటిస్తే పిల్లల జీవితంలో మంచి మార్పులు చూడవచ్చు.
స్టడీ రూమ్ ఏ దిశలో ఉండాలంటే..
వాస్తు ప్రకారం ఈశాన్య దిశ జ్ఞానానికి మూలం. ఆ దిశలో స్టడీ రూమ్ ఉంటే పిల్లల ఆలోచనా శక్తి, ఏకాగ్రత పెరుగుతాయి. ఉదయం సూర్య కిరణాలు నేరుగా గదిలోకి వచ్చేలా కిటికీలు ఉంటే, ఆ కిరణాలు ఆరోగ్యానికి, మనసుకు ఉత్తేజాన్నిస్తాయి. వాస్తు ప్రకారం అగ్ని, వాయు, ఆకాశ శక్తులు కలిసే ప్రదేశం ఈశాన్యం.
స్టడీ రూమ్ అమరిక
కిటికీలు: తూర్పు, ఉత్తర దిశల్లో కిటికీలు ఉంటే మంచి గాలి, వెలుతురు వస్తాయి. గాలి, వెలుతురు లేని గదిలో పిల్లలకు ఏకాగ్రత లోపిస్తుంది. సహజమైన వెలుతురు తెలివితేటలను పెంచుతుంది.
కూర్చునే దిశ: చదువుకునేటప్పుడు పిల్లలు తూర్పు ముఖంగా కూర్చోవడం మంచిది. సూర్య శక్తి మనసుకు ప్రశాంతత, ఏకాగ్రతను ఇస్తుంది.
స్టడీ టేబుల్, కుర్చీ: టేబుల్ గట్టి చెక్కతో చేసినది అయితే మంచిది. టేబుల్ మీద పుస్తకాలు, లైట్ వంటి అవసరమైన వస్తువులు మాత్రమే ఉంచాలి. చిన్న అలమారాలు కూడా టేబుల్ దగ్గర కాకుండా, గోడకు అమర్చాలి.
ఇవి వద్దు
స్టడీ రూమ్ లో బీరువాలు, పాత వస్తువులు, పెద్ద అలమారాలు ఉండకూడదు. వీటివల్ల మానసిక ఒత్తిడితో పాటు చదువు మీద ఆసక్తి తగ్గుతుంది. గది ఎప్పుడూ శుభ్రంగా, చక్కగా ఉండాలి.
ఆధ్యాత్మిక భావన
ఈశాన్య దిశ శివుని శక్తికి ప్రతీక. స్టడీ రూమ్ ఆ దిశలో ఉంటే, విద్యార్థికి దైవ ఆశీస్సులు లభిస్తాయి. కొందరు సరస్వతీ దేవి చిత్రపటం లేదా చిన్న విగ్రహాన్ని టేబుల్ దగ్గర ఉంచుతారు. ఇది చదువుపై ఆసక్తిని పెంచుతుంది.
సహజ వెలుతురులో..
మంచి వెలుతురు, గాలి, ప్రశాంతత కలిగిన గదిలో చదివితే.. పిల్లలకు జ్ఞాపకశక్తి, ఏకాగ్రత, ఆసక్తి పెరుగుతాయి. ఈశాన్య దిశ ఎక్కువ సహజ వెలుతురును అందిస్తుంది. గాలి, పంచభూతాల సమతుల్యత మనసుకు ఉత్తేజాన్నిస్తాయి.
ప్రశాంతమైన రంగులు
గోడలకు ప్రశాంతమైన రంగులు (ఆకుపచ్చ, లేత గులాబీ, లేత నీలం) వాడండి. మెల్లగా ధ్యాన సంగీతం ప్లే చేయవచ్చు. చెక్క లేదా మట్టి కుండీలలో చిన్న మొక్కలు పెట్టవచ్చు. స్టడీ రూమ్ కేవలం గది కాదు.. అది జ్ఞానాన్ని పెంపొందించే పవిత్ర స్థలం. వాస్తు, ఆధ్యాత్మికత, శాస్త్రీయ కారణాలు కలిసి పిల్లల చదువు, జీవితాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్తాయి. ఈశాన్యంలో ఉన్న స్టడీ రూమ్ వారి భవిష్యత్తు విజయానికి నాంది పలుకుతుంది.