Camphor Vastu Tips: కర్పూరాన్ని ఇలా వెలిగిస్తే.. డబ్బు సమస్యలకు చెక్ పెట్టవచ్చు!
హిందూ సంప్రదాయం ప్రకారం.. కర్పూరం లేకుండా ఏ పూజా పూర్తికాదు. జ్యోతిష్యం ప్రకారం కర్పూరంతో కొన్ని పరిహారాలు చేస్తే ఇంట్లో సమస్యలకు చెక్ పెట్టడమే కాదు.. లక్ష్మీదేవి అనుగ్రహం పొందవచ్చు. మరి కర్పూరంతో ఏం చేస్తే ఇంట్లో సమస్యలు దూరమవుతాయో ఇక్కడ చూద్దాం.

కర్పూరం వాస్తు చిట్కాలు
హిందూ సంస్కృతిలో కర్పూరానికి ప్రత్యేక స్థానం ఉంది. పూజలు, వ్రతాల్లో కర్పూరాన్ని ఎక్కువగా వాడుతుంటారు. కర్పూరంతో హారతి ఇస్తే దేవతలు సంతోషిస్తారని నమ్ముతారు. కర్పూరం.. హారతి ఇవ్వడానికి మాత్రమే కాదు, చెడు శక్తులను తొలగించడానికి కూడా ఉపయోగపడుతుంది. జ్యోతిష్య ప్రయోజనాల కోసం కర్పూరాన్ని ఎలా ఉపయోగించాలో ఇక్కడ చూద్దాం.
ప్రతికూల శక్తి పోవాలంటే..
కర్పూరం చాలా శక్తివంతమైనది. ఇది ప్రతికూల శక్తి, చెడు శక్తులు, దృష్టి దోషం వంటి వాటిని తొలగించే శక్తిని కలిగి ఉంటుంది. దీనికోసం పూజా కార్యక్రమాల తర్వాత కర్పూరంతో పాటు 2-3 లవంగాలు వేసి దీపం వెలిగించాలి. దాని నుంచి వచ్చే బలమైన సువాసన ప్రతికూల శక్తిని తొలగిస్తుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.
గ్రహ దోష నివారణ:
జ్యోతిష్యం ప్రకారం గ్రహ దోషాలను ఎదుర్కొనే శక్తి కర్పూరానికి ఉంది. రాహు, కేతు, శుక్ర, శని వంటి గ్రహాల అనుగ్రహం పొందడానికి కర్పూరాన్ని ఉపయోగిస్తారు. గ్రహ దోష నివారణకు ఆవు పేడ మీద 4-5 కర్పూరాలు వెలిగించాలి. ఈ పరిహారాన్ని రోజూ సాయంత్రం లేదా శని, శుక్ర, అమావాస్య, పౌర్ణమి వంటి రోజుల్లో చేయాలి. దీంతో గ్రహ దోషాలు తొలగి శుభ ఫలితాలు కలుగుతాయి.
అదృష్టం కోసం:
కర్పూరం అదృష్టానికి చిహ్నం. కాబట్టి మీ పర్సులో కర్పూరం ఉంచితే పెద్ద మార్పు కనిపిస్తుంది. మీరు శుభకార్యానికి వెళ్తున్నా లేదా ఏదైనా ముఖ్యమైన పనికి వెళ్తున్నా కర్పూరాన్ని వెంట తీసుకెళ్లండి. దీంతో మీ పని విజయవంతం అవుతుంది.
సంపద, శ్రేయస్సు కోసం:
కర్పూరం లక్ష్మీదేవికి చిహ్నంగా భావిస్తారు. ఇది మీ జీవితంలో సంపద, శ్రేయస్సు, ఆర్థిక వృద్ధిని ఆకర్షించడంలో సహాయపడుతుంది. సంపద, శ్రేయస్సు కోసం మీ లాకర్‌లో లేదా ఇంట్లో డబ్బు ఉంచే చోట కర్పూరం ఉంచండి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.
సానుకూల శక్తి పెరగడానికి...
కర్పూరం ఇంటి వాతావరణాన్ని ఆహ్లాదకరంగా మారుస్తుంది. మీరు పడుకునే గదిలో కర్పూరం ఉంచితే చెడు శక్తులు తొలగి, సానుకూల శక్తి పెరుగుతుంది. ఇంటి నైరుతి దిశలో కర్పూరం ఉంచితే జీవితంలో శ్రేయస్సు వస్తుంది.