తక్షణ శక్తి కోసం చాలామంది కొన్నిరకాల డ్రింక్స్ తాగుతుంటారు. ముఖ్యంగా క్రీడాకారులు, జిమ్లో చెమట్లు చిందించేవాళ్లు వీటిని ఎక్కువగా తీసుకుంటారు. ఇందులోనూ ఎనర్జీ డ్రింక్, స్పోర్ట్స్ డ్రింక్ అని రెండురకాలుంటాయి. ఇందులో తేడా ఏంటి? ఆరోగ్యానికి ఏది మంచిది?

చాలామంది ఎనర్జీ డ్రింక్‌నే స్పోర్ట్స్ డ్రింక్ అనుకుంటారు. మరికొందరేమో ఎనర్జీ డ్రింక్స్ అంటారు. అసలు ఏది మంచిదో తెలీక చాలా ఆలోచిస్తుంటారు. అయితే, ఈ రెండిటి మధ్య తేడా వాటి తయారీలో వాడే పదార్థాల మీద ఆధారపడి ఉంటుంది.

కాస్త వేడిగా అనిపించినా, బాగా కష్టపడ్డా వెంటనే రంగురంగుల ఎనర్జీ డ్రింక్ కొనుక్కుని తాగేస్తారా? మీ పిల్లలు ఆడుకోవడానికి వెళ్లేటప్పుడు స్పోర్ట్స్ డ్రింక్‌కు బదులుగా ఎనర్జీ డ్రింక్ కొనిస్తున్నారా? కూల్ డ్రింక్స్ కంటే ఇదే చాలా ఆరోగ్యకరమని తాగుతున్నారా? ఈ రెండు డ్రింక్స్‌కి చాలా తేడా ఉందని మీకు తెలుసా?

1. ఎనర్జీ డ్రింక్: ఎనర్జీ డ్రింక్స్‌ని శక్తి కోసం తాగుతారు. ఇందులో చక్కెర, కెఫీన్ చాలా ఎక్కువగా ఉంటాయి. దీని వల్ల తాగిన వెంటనే శరీరం, మనస్సు ఉత్తేజంగా మారుతాయి. ఇది శరీరానికి గ్లూకోజ్‌ను అందించి శక్తిని ఇస్తుంది. ఈ ఎనర్జీ డ్రింక్ ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉంది. షాపింగ్ మాల్స్, రెస్టారెంట్లు, హోటల్స్‌లో ఎక్కడ చూసినా ఎనర్జీ డ్రింక్స్ రంగురంగుల చిన్న, పెద్ద సీసాలు, క్యాన్లు దొరుకుతున్నాయి. కొన్ని బ్రాండ్ల ధరలు చాలా ఎక్కువగా ఉన్నప్పటికీ, చాలా లోకల్ బ్రాండ్లు తక్కువ ధరకే దొరుకుతున్నాయి.

2. స్పోర్ట్స్ డ్రింక్స్: స్పోర్ట్స్ డ్రింక్‌లో ముఖ్యంగా కార్బోహైడ్రేట్లు ఉంటాయి. అంతేకాకుండా ప్రోటీన్, విటమిన్లు, సోడియం, పొటాషియం, మెగ్నీషియం వంటి ఖనిజాలు కూడా ఉంటాయి. ఎనర్జీ డ్రింక్‌లాగా ఇందులో కెఫీన్ ఉండదు. సాధారణంగా క్రీడాకారులు ఈ రకమైన డ్రింక్‌ను ఎక్కువగా తాగుతారు. వ్యాయామానికి ముందు, తర్వాత క్యాలరీల లోటును పూడ్చడానికి ఈ డ్రింక్ తాగమని కోచ్‌లు లేదా డైటీషియన్లు సలహా ఇస్తారు. రోజూ చాలా కష్టపడేవారు లేదా నీరసంగా ఉన్నవారు ఈ డ్రింక్ తాగితే మంచిది.

స్పోర్ట్స్ డ్రింక్‌ను ఇంట్లోనే తయారు చేసుకోవచ్చని మీకు తెలుసా? నీళ్లలో చక్కెర వేసే బదులు తేనె, సైంధవ లవణం, నిమ్మరసం, కాల్షియం, మెగ్నీషియం పౌడర్ కలిపితే స్పోర్ట్స్ డ్రింక్ రెడీ అయిపోతుంది.

ఎనర్జీ డ్రింక్ ఎక్కువగా తాగితే ఏమవుతుంది?

బాగా కష్టపడిన తర్వాత శరీరంలో క్యాలరీలు తగ్గిపోతే ఎనర్జీ డ్రింక్ తాగాల్సిన అవసరం ఉంటుంది. అందుకే క్రీడాకారుల్లో స్పోర్ట్స్ డ్రింక్‌తో పాటు ఎనర్జీ డ్రింక్‌కు కూడా మంచి డిమాండ్ ఉంది. అవసరం లేకుండా రంగురంగుల తీపి నీళ్లు తాగాలనిపిస్తే లేదా అలవాటుగా ఎనర్జీ డ్రింక్స్ కొనుక్కుని తాగేస్తూ ఉంటే వెంటనే ఆపేయండి. ఎందుకంటే కెఫీన్ కడుపులో యాసిడ్ స్థాయిని పెంచుతుంది. ఎనర్జీ డ్రింక్‌లోని 250 నుంచి 300 మిల్లీలీటర్లలో కనీసం 32 మిల్లీగ్రాముల కెఫీన్ లేదా అంతకంటే ఎక్కువ ఉంటుంది. దీనివల్ల మీ జీర్ణశక్తి బలహీనపడుతుంది, గ్యాస్, అసిడిటీ సమస్యలు పెరుగుతాయి. ఊబకాయం, దంతాలు క్షీణించడం, మైగ్రేన్, డయాబెటిస్ వంటి సమస్యలు కూడా వస్తాయి. గర్భిణులు లేదా పాలిచ్చే తల్లులు ఈ ఎనర్జీ డ్రింక్ తాగితే రక్తపోటు పెరుగుతుంది, గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉంది. అందుకే అవసరమైతే ఇంట్లో స్పోర్ట్స్ డ్రింక్ చేసుకొని తాగండి కానీ షాపుల్లో కొన్న ఎనర్జీ డ్రింక్ వద్దు.