వేడి వేడి అన్నంలో మామిడికాయ పచ్చడి వేసుకొని తింటే ఆ రుచే వేరు. అయితే చాలామంది మామిడి కాయ పచ్చడి పెట్టడం శ్రమతో కూడుకున్న పని అనుకుంటారు. కానీ ఈ 5 చిట్కాలతో ఈజీగా పచ్చడి రెడీ చేసేయచ్చు. ఎలా చేయాలో ఓసారి చూసేయండి.  

మామిడి కాయ పచ్చడిని చాలామంది ఇష్టంగా తింటారు. వేడి అన్నంలో మామిడికాయ పచ్చడి.. దానిపై కాస్త నెయ్యి వేసుకొని తింటే ఆ రుచి ఎలా ఉంటుందో మాటల్లో చెప్పలేము. అయితే ఈ పచ్చడిని తయారు చేయడం చాలా శ్రమతో కూడుకున్న పని అని చాలామంది అనుకుంటారు. ఈ శ్రమంతా ఎందుకని పచ్చళ్లను బయటే కొనుగోలు చేస్తుంటారు. కానీ కొన్ని చిట్కాలతో మ్యాంగో పికిల్ ని ఈజీగా, త్వరగా తయారు చేసుకోవచ్చు. అదేలాగో ఇక్కడ చూద్దాం.

సరైన మామిడి రకాన్ని ఎంచుకోండి

పచ్చడికి ప్రాణం మామిడి కాయ. అయితే ప్రతి రకం మామిడి పచ్చడికి పనికిరాదు. రాజపురి, సెంద్ర, రామకేల లేదా తోతాపురి ఉత్తమ రకాలు. మామిడి పూర్తిగా కాయగా, గట్టిగా ఉండాలి. తద్వారా కోసేటప్పుడు రసం రాదు. వర్కింగ్ ఉమెన్స్ పండ్ల దుకాణంలో మామిడి కాయలను కట్ చేయించుకుంటే శుభ్రమైన, స్టీల్ కత్తితోనే కట్ చేయించుకోవాలి.

నూనె, మసాలా దినుసుల సరైన నిష్పత్తి

పచ్చడి మన్నిక, రుచి రెండూ మీరు వాడే నూనె, మసాలా దినుసుల నిష్పత్తిపై ఆధారపడి ఉంటాయి. ఆవ నూనె ఉత్తమం. పసుపు, కారం, జిలకర్ర, మెంతులు, ఆవాలు, కలౌంజి, ఇవన్నీ పచ్చడికి సువాసన రుచిని ఇస్తాయి. మీరు ఈ మసాలా మిశ్రమాన్ని ముందుగానే తయారు చేసి నిల్వ చేసుకోవచ్చు. సమయం దొరికినప్పుడు మామిడిలో కలిపి పచ్చడి చేసుకోవచ్చు.

 ప్రతి కిలో కట్ చేసిన మామిడికి:

  • ఆవ నూనె – 250 ml
  • జిలకర్ర – 2 టేబుల్ స్పూన్లు
  • మెంతులు – 1 టేబుల్ స్పూన్
  • ఉప్పు – 2 టేబుల్ స్పూన్లు
  • పసుపు – 1 టేబుల్ స్పూన్
  • కారం – రుచికి సరిపడా
  • ఆవాలు (దోరగా వేయించినవి) – 1 టేబుల్ స్పూన్
  • కలౌంజి – ½ టేబుల్ స్పూన్

మామిడిని ఎండలో ఆరబెట్టాల్సిన అవసరం లేదు

పాత పద్ధతుల్లో మామిడిని కోసి ఎండలో ఆరబెట్టేవారు. కానీ ఇప్పుడు అలా చేయాల్సిన అవసరంలేదు. మీరు ఈ పనిని త్వరగా చేయచ్చు. కట్ చేసిన మామిడిని కిచెన్ టవల్‌పై పరిచి 2 గంటలు ఫ్యాన్ కింద ఆరబెట్టండి. తర్వాత కొద్దిగా ఉప్పు, పసుపు కలిపి 3-4 గంటలు మూతపెట్టి ఉంచండి. ఇది తేమను తొలగిస్తుంది. మీరు ఉదయం ఆఫీసుకు వెళ్లే ముందు ఈ పని చేసి, సాయంత్రం వచ్చి మసాలా కలిపితే మీ శ్రమ సగం తగ్గుతుంది.

పచ్చడిని నిల్వ చేసే స్మార్ట్ పద్ధతి

పచ్చడి ఎన్ని రోజులు నిల్వ ఉంటుందనేది మీరు దాన్ని ఎలా నిల్వ చేస్తారనే దానిపై ఆధారపడి ఉంటుంది. గాజు లేదా సిరామిక్‌తో చేసిన శుభ్రమైన, పొడి జాడీలనే వాడండి. పచ్చడిని జాడీలో నింపిన తర్వాత పైన కొద్దిగా వేడి ఆవ నూనె పోయాలి. దీనివల్ల బ్యాక్టీరియా పెరగవు. జాడీని 2 రోజులు గాలి, వెలుతురు తగిలే చోట ఉంచండి. దీనివల్ల పచ్చడి రుచి పెరుగుతుంది. నూనె మసాలాలో బాగా కలుస్తుంది. పచ్చడిని ఫ్రిజ్‌లో కూడా నిల్వ చేయవచ్చు. కానీ అందులో కొంచెం ఎక్కువ నూనె పోయాలి.

ఇంకా తక్కువ సమయంలో పచ్చడి ఎలా తయారు చేసుకోవచ్చు?

మీకు సమయం లేకపోతే.. ముందుగా ఒక కిలో మామిడిని కోసి ఆరబెట్టండి. మసాలా మిశ్రమాన్ని నూనెలో కొద్దిగా వేయించి (1-2 నిమిషాలు) కట్ చేసిన మామిడిని అందులో కలపండి. ఇప్పుడు 15-20 నిమిషాలు మూతపెట్టి ఉంచండి. తర్వాత రోజు నుంచి ఆ పచ్చడిని తినడానికి తీసుకోండి. ఈ పచ్చడిని తక్కువ మోతాదులో అవసరమైనప్పుడు చేసుకోవడం మంచిది.