పండ్లు తీసుకోవడం వల్ల మనం ఈజీగా కూడా బరువు తగ్గొచ్చు.కానీ, బరువు తగ్గడానికి పండ్లు మాత్రమే తీసుకుంటే సరిపోదు.
పండ్లు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. ప్రతి ఒక్కరూ కచ్చితంగా పండ్లు తినాల్సిందే. వాటిని ఏదో ఒక రూపంలో డైట్ లో చేర్చుకోవాలని నిపుణులు కూడా చెబుతుంటారు. అంతేకాదు.. పండ్లు తీసుకోవడం వల్ల మనం ఈజీగా కూడా బరువు తగ్గొచ్చు.కానీ, బరువు తగ్గడానికి పండ్లు మాత్రమే తీసుకుంటే సరిపోదు. పండ్లలో పోషకాలు చాలా ఎక్కువగా ఉంటాయి. వాటిలో విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. అయితే, ఫ్రూట్ డైట్ ఎక్కువ కాలం పాటిస్తే, శరీరంపై వివిధ ఆరోగ్య సమస్యలు, దుష్ప్రభావాలు ఏర్పడతాయి. మరి, పండ్లు తినడం వల్ల కలిగే ప్రయోజనాలేంటి? నష్టాలేంటో తెలుసుకుందామా...

ఫ్రూట్ డైట్ అంటే ఏమిటి..?
ఫ్రూట్ డైట్ అంటే.. కేవలం పండ్లు మాత్రమే తినడం.ఇదొక వీగన్ డైట్. దీనిలో.. తాజా పండ్లు మాత్రమే తింటారు. కొంతమంది కొద్దిగా కూరగాయలు, గింజలు, విత్తనాలు కూడా తింటారు. అయితే అన్నం, చిరుధాన్యాలు, పాలు, మాంసాహారం, ఉప్పు వంటి ఇతర ఆహారాలను పూర్తిగా మానేస్తారు. రోజువారీ కేలరీల్లో 70–80 శాతం భాగాన్ని పండ్ల నుంచే పొందుతారు. వారికీ ఆకలి తీరే వరకు పండ్లు తినవచ్చు. అయితే.. కేవలం తీయని పండ్లు మాత్రమే కాదు..కొన్ని కాల కూరగాలయను కూడా తీసుకుంటారు. టమాటాలు, అవకాడో, బెండకాయలు, క్యాప్సికం, సొరకాయలు, ఆలివ్స్, ముల్లంగి, క్యారెట్, బీట్రూట్ లాంటివి కూడా తమ డైట్ లో భాగం చేసుకుంటూ ఉంటారు.

పండ్లు మాత్రమే తింటే ఏమౌతుంది?
1.ప్రోటీన్, కొవ్వు లోపం...
పండ్లలో ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు చాలా తక్కువగా ఉంటాయి. ఎక్కువసేపు పండ్లు మాత్రమే తినడం వల్ల కండరాల నష్టం కలుగుతంది.అలసటగా ఉంటుంది. రోగనిరోధక శక్తి తగ్గడం వంటి సమస్యలు వస్తాయి. శరీరం సరిగ్గా పని చేయడానికి ప్రోటీన్, కొవ్వులు చాలా అవసరం. ఇవి మనకు కేవలం పండ్లు తింటే లభించవు. అందుకే కేవలం పండ్లు తినకూడదు. పోషక లోపం ఏర్పడుతుంది.
రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి:
పండ్లలో సహజ చక్కెర ఎక్కువగా ఉంటుంది. ఎక్కువ పండ్లు తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అకస్మాత్తుగా పెరుగుతాయి. ఇది మధుమేహం ఉన్నవారికి చాలా ప్రమాదకరం. నిరంతరం అధిక చక్కెర స్థాయిలు బరువు పెరగడం, ఇన్సులిన్ నిరోధకత వంటి సమస్యలకు దారితీయవచ్చు.
జీర్ణ సమస్యలు:
పండ్లలో అధిక ఫైబర్ ఉండటం మంచిదే అయినప్పటికీ, ఎక్కువ ఫైబర్ అతిసారం, గ్యాస్, కడుపు నొప్పి వంటి జీర్ణ సమస్యలను కలిగిస్తుంది. ముఖ్యంగా, అధిక మొత్తంలో పండ్ల రసం, అధిక చక్కెర కంటెంట్ ఉన్న పండ్లు కడుపు ఆమ్లతను పెంచుతాయి. ఎసిడిటీ సమస్యలు పెరిగే అవకాశం ఉంది.
ఎముకల బలం తగ్గడం:
పండ్లలో కాల్షియం, విటమిన్ డి వంటి ఖనిజాలు తక్కువగా ఉంటాయి. ఎక్కువసేపు పండ్లు మాత్రమే తినడం వల్ల ఎముకలు బలహీనపడతాయి. ఆస్టియోపోరోసిస్ వంటి సమస్యలు వస్తాయి. ఇది మహిళలకు చాలా ప్రమాదకరం.
దంతక్షయం, ఆమ్లత్వం:
పండ్లలోని సహజ ఆమ్లాలు (సిట్రిక్ యాసిడ్, మాలిక్ యాసిడ్) దంతక్షయం, దంతాల ఎనామిల్ సమస్యలను కలిగిస్తాయి. పండ్లు, పండ్ల రసాలను తరచుగా తీసుకోవడం దంత ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది.
శారీరక శక్తి , అలసట తగ్గడం:
పండ్లు త్వరగా జీర్ణమవుతాయి. శరీరానికి శక్తిని ఇస్తాయి, కానీ అవి ఎక్కువసేపు కడుపు నిండుగా ఉంచవు. దీనివల్ల మీరు నిరంతరం ఆకలిగా, అలసటగా ఉంటుంది. పండ్లు తిన్నా కూడా తల తిరుగుతూ ఉంటుంది. శక్తి లేనట్లుగా, నీరసంగా అనిపిస్తూ ఉంటుంది. కేవలం పండ్లు తిని బరువు తగ్గినా.. మళ్లీ అన్ని ఆహారాలు తినడం మొదలుపెడితే.. అంతకంటే ఎక్కువ బరువు పెరిగే అవకాశం ఉంటుంది.
పోషక లోపాలు:
ఫలాలు మాత్రమే తినడం వల్ల ముఖ్యమైన పోషకాలు కోల్పోవచ్చు. ముఖ్యంగా.. ఐరన్, కాల్షియం, విటమిన్ డి, జింక్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్ బి12 లోపం ఎక్కువగా ఏర్పడుతుంది.

పండ్లలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. కానీ పండ్లు మాత్రమే తినే ఆహారం మీ శరీరానికి సమతుల్య ఆహారాన్ని అందించదు. ఇది స్వల్పకాలంలో బరువు తగ్గడంలో సహాయపడినప్పటికీ, దీర్ఘకాలికంగా పాటిస్తే ఇది వివిధ ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది. మన శరీరానికి సమతుల్య ఆహారాన్ని అనుసరించడం మంచిది, పండ్లతో పాటు ఇతర పోషకాలు (ప్రోటీన్, కొవ్వు, ఖనిజాలు) అధికంగా ఉండే ఆహారాన్ని కూడా చేర్చుకోవడం మంచిది. ఏదైనా కొత్త ఆహారం ప్రారంభించే ముందు, పోషకాహార నిపుణుడు లేదా వైద్యుడి సలహా తీసుకోవడం చాలా ముఖ్యం.

పండ్లను మాత్రమే తింటే కలిగే లాభాలు...
పండ్లను మాత్రమే తింటే..కచ్చితంగా పూర్తిగా నష్టాలు మాత్రమే కాదు.. కొన్ని లాభాలు కూడా ఉన్నాయి. పండ్లలో విటమిన్ సి, ఫోలేట్, పొటాషియం వంటి విటమిన్లు ఉంటాయి. ఇవి మన ఆరోగ్యానికి మేలు చేసేవే. అంతేకాదు.. పండ్లలో ఫైబర్ అధికంగా ఉండటం వల్ల మలబద్దకం సమస్యను తగ్గిస్తుంది. పండ్లు తక్కువ క్యాలరీ ఉంటాయి కాబట్టి.. బరువు తగ్గే అవకాశం ఉంటుంది.హార్ట్ డిసీజ్, కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గించడంలో సహాయపడుతుంది. పండ్లు యాంటీఆక్సిడెంట్స్ లో అధికంగా ఉండటం వల్ల ఆరోగ్యానికి మేలు చేస్తుంది.
ఫైనల్ గా...
పండ్లను మాత్రమే తింటే కొన్ని సందర్భాల్లో తాత్కాలికంగా ఉపయోగకరంగా ఉన్నా, దీన్ని దీర్ఘకాలికంగా అనుసరించడం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ముఖ్యంగా ప్రోటీన్, విటమిన్ B12, కాల్షియం వంటి మూలకాలు లేకపోవడం వల్ల తీవ్ర సమస్యలు ఎదురవుతాయి.
శరీరానికి అన్ని రకాల పోషకాలు అవసరం. కనుక మంచి ఆరోగ్య ప్రయోజనాల కోసం పండ్లు అధికంగా ఉండే, కానీ సమతుల్యంగా డిజైన్ చేసిన ఆహారం తీసుకోవడమే మంచిది.
