కొన్ని సినిమాలకు డిమాండ్ ఉన్నట్లుండి వచ్చేస్తుంది. రిలీజ్ కాకుండానే రీమేక్ లకు ఎగబడిపోతారు. ఇప్పుడు అదే జరుగుతోంది.  మెగా మేనల్లుడు సాయి ధరం తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా డెబ్యు డైరెక్టర్ బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందిన చిత్రం ఉప్పెన. ఈ చిత్రం వాస్తవానికి ఏప్రిల్ 2న విడుదల కావాల్సింది. కానీ కరోనా వల్ల ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలియని పరిస్దితి ఏర్పడింది. ఈ నేపధ్యంలో నిర్మాతకు సంతోషపడే వార్త ఒకటి బయిటకు వచ్చింది. అయితే అందులో నిజం ఎంత ఉందనేది తెలియటం లేదు. ఎందుకంటే ఇదంతా బిజినెస్ కోసం మీడియాని పట్టుకుని చేస్తున్న హంగామా అని కొందరంటున్నారు.

 ఇంతకీ వార్త ఏమిటంటే..ఈ చిత్రం తమిళ రీమేక్ అమ్ముడైందని.  విజయ్ సేతుపతి విలన్ గా చాలా కీలకమైన పాత్ర పోషించిన ఉప్పెనను అప్పుడే తమిళం లో రీమేక్ చేసే దిశగా చర్చలు మొదలయ్యాయని చెప్తున్నారు. అంతేకాదు ఈ సినిమాకు హీరో కూడా ఫిక్స్ అయ్యిపోయాడట.

అతను మరెవరో కాదు..తమిళంలో స్టార్ హీరోగా వెలుగుతున్న విజయ్ కొడుకు జాసన్ సంజయ్ ని హీరోగా పరిచయం చేయడానికి ఉప్పెననే ఎంచుకోబోతున్నట్టుగా తెలుస్తోంది. మాస్టర్ లో విజయ్ తో కలిసి నటించిన విజయ్ సేతుపతి ఉప్పెన కథ గురించి అవుట్ ఫుట్ గురించి గొప్పగా చెప్పడంతో విజయ్ ఎగ్జైట్ అయిపోయి ఓకే చెప్పినట్లుగా తెలిసింది. రిలీజ్ అయ్యి రిజల్ట్ ఏమిటో తేలకముందే ఇలా క్రేజీ ఆఫర్ రావడం గొప్ప విషయమే అంటోంది ఇండస్ట్రీ. అంతవరకూ బాగానే ఉంది కానీ..ఇలా మీడియాకు లీక్ లు ఇస్తోందెవరు అనేది పెద్ద సస్పెన్స్ గా మారింది. కొందరైతే ఇది బిజినెస్ పరంగా ఆడే గేమ్ అంటున్నారు. ఈ సినిమాకు ఉన్న పళంగా క్రేజ్ క్రియేట్ చేసి డిజిటల్ రైట్స్ అమ్మేందుకు చేస్తున్న మీడియా హంగామా అని తీసి పారేస్తున్నారు. దాంతో ఇందులో ఎంతవరకూ నిజం ఉందనేది ఓ పెద్ద ప్రశ్నగా మారింది. 

ప్రస్తుతం సంజయ్ ఫిలిం మేకింగ్ అండ్ యాక్టింగ్ కోర్స్ కోసం కెనడాలో ఉన్నాడు. కరోనా తర్వాత అంతర్జాతీయ విమాన సర్వీసులను ఆపేయడంతో ఇండియాకు వద్దామనుకున్నా రాలేకపోయాడు. ఇక్కడికి చేరుకోగానే స్క్రీన్ టెస్ట్ చేసి ఫైనల్ చేయబోతున్నారని తమిళ మీడియా అంటోంది. ఇక ఈ తమిళ వెర్షన్ కు నిర్మాతలుగా విజయ్ సేతుపతితో పాటు ఒరిజినల్ వెర్షన్ తీసిన మైత్రి సంస్థ భాగస్వామ్యం వహించే అవకాశం ఉందని తెలుస్తోంది. 

విజయ్ కుమారుడు గా సంజయ్ మీద అభిమానుల్లో ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. దాంతో ఓపినింగ్స్ అదిరిపోతాయని, వెల్కమ్ చాలా గ్రాండ్ గా ఉంటుందని అక్కడ మీడియా అంచనా వేస్తోంది. ఇక ఈ వార్త రాగానే మీడియాలో  ఉప్పెన పై అంచనాలు పెరిగాయి. ఆ ఎఫెక్ట్ బిజినెస్ మీద కూడా పడనుంది.   దాదాపు రూ.22 కోట్ల బ‌డ్జెట్‌తో తెర‌కెక్కిన ఉప్పెన చిత్రం బుచ్చి బాబు ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌గా, హీరోయిన్ గా  కృతి శెట్టి న‌టించింది.