సుప్రసిద్ధ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్య పరిస్థితి క్రమంగా మెరుగుపడుతోందని ఆయన కుమారుడు ఎస్పీ చరణ్‌ వెల్లడించారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు. ఎక్మో/వెంటిలేటర్‌ సాయంతో  ట్రీట్మెంట్ కొనసాగుతోందని చెప్పారు. డాక్టర్లు తన తండ్రికి ఫిజియో థెరపీ చేస్తున్నారని చెప్పారు. ప్రస్తుతం ఆయన ఆహారంగా ద్రవ పదార్థాలు తీసుకుంటున్నారని, ఆస్పత్రి నుంచి సాధ్యమైనంత త్వరగా ఇంటికి వెళ్లాలన్న ఆసక్తితో ఉన్నారంటూ చరణ్‌ ట్విటర్‌లో పేర్కొన్నారు.

కరోనా వైరస్‌ సోకడంతో ఆగస్టు 5న బాల సుబ్రహ్మణ్యం చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. ఆయన ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో వైద్యులు వెంటిలేటర్‌, ఎక్మో సాయంతో చికిత్స ప్రారంభించారు. ఇటీవల ఆయనకు కరోనా నెగెటివ్‌ అని తేలడంతో అందరూ సంతోషం వ్యక్తంచేశారు.

 ప్రస్తుతం బాలు, డాక్టర్ల   సహాయంతో లేచి కూర్చుంటున్నారు. 15-20 నిమిషాల పాటు కూర్చోగలుగుతున్నారు. ఎస్పీబీ సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని ప్రముఖ నటుడు రజనీకాంత్, కమలహాసన్, దర్శకుడు భారతీరాజా, ఇళయరాజా, ఏఆర్‌ రెహమాన్, తమిళనాడు ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామి సోషల్ మీడియా  ద్వారా తమ ఆకాంక్షను వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. బాలు త్వరగా కోలుకోవాలని సామూహిక ప్రార్థనలు చేశారు.  బాలు త్వరగా కోలుకొని క్షేమంగా ఇంటికి తిరిగి రావాలని అందరూ ఆకాంక్షిస్తున్నారు.