ఒకరు వద్దనుకున్న ప్రాజెక్టులోకి మరొకరు ఎంటర్ కావటం పెద్ద వింతేమీ కాదు..కొత్త అసలే కాదు. అయితే అందరూ వద్దనుకుంటూ ప్రక్కకు వెళ్ళిపోతున్న  సినిమాకి సైన్ చేస్తే మాత్రం అంతా ఆశ్చర్యంగా చూస్తారు.  ఇప్పుడు మహా సముద్రం ప్రాజెక్టు విషయంలో అదే జరుగుతోంది. ఈ సినిమాని చాలా మంది హీరోలు చేయలేమన్నారు. హీరోయిన్స్ కూడా కాదన్నారు. హీరోల్లో బెల్లంకొండ శ్రీను నుంచి రవితేజ, నాగ చైతన్య దాకా ఉన్నారు. అలాగే హీరోయిన్స్ లో ప్రధానంగా సమంత పేరు వినిపించింది. అయితే ఇప్పుడు ఆ సినిమాలో హీరోయిన్ పాత్రని సాయి పల్లవి చేయటానికి ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. ఈ మేరకు కథ విని, తన క్యారక్టరైజేషన్ పై డిస్కస్ చేసినట్లు మీడియా వర్గాల కథనం. అయితే ఆమె ఇంకా ఏ డెసిషన్ చెప్పలేదట. 

అన్నీ అనుకున్నట్లు జరిగితే మహా సముద్రం చిత్రం ఆగస్టు నుంచి ప్రారంభం అవుతుంది. అలాగే ఈ సినిమాలో శర్వానంద్ హీరోగా చేస్తున్నారు. ఇక డైరెక్ట‌ర్ అజ‌య్ భూప‌తి.. తొలి చిత్రం `RX100`తో సెన్సేష‌న‌ల్ హిట్‌ను సొంతం చేసుకున్న ద‌ర్శ‌కుడు. ఈ యువ ద‌ర్శ‌కుడు రెండో సినిమాను స్టార్ట్ చేయ‌డానికి మాత్రం చాలా సమయమే పడుతోంది. రవితేజ‌తో, మ‌రో హీరోతో `మ‌హాసముద్రం` సినిమాను చేయాల‌నుకుని వెయిట్ చేసారు. కానీ రెమ్యున‌రేష‌న్ సమస్య కార‌ణంగా ఆ ర‌వితేజ ప్రాజెక్ట్ నుండి త‌ప్పుకోవ‌డంతో త‌న‌ని చీప్‌స్టార్ అని కామెంట్ చేసి వార్త‌ల్లో కూడా నిలిచాడు.

ఆ త‌ర్వాత కార్తికేయ‌, విశ్వ‌క్‌సేన్‌ల‌తో ఈ సినిమాను అజ‌య్ భూప‌తి తెర‌కెక్కిస్తాడ‌ని వార్త‌లు వినిపించాయి. అంతా సరే అనుకున్న త‌రుణంలో ఇదిగో ఈ వార్త వచ్చింది. ఇక ఈ సినిమాలో మరో హీరో కూడా ఉంటారట. ఆ పాత్రని సైతం ఫైనలైజ్ చేయాల్సి ఉంటుందని అంటున్నారు. కార్తికేయ ఆ పాత్రలో కనిపించే అవకాసం కూడా ఉందంటున్నారు. మరి ఈ మహాసముద్రం ప్రారంభానికి ముందే ఇన్ని ట్విస్ట్ లు ఎదుర్కొంటోంది. రిలీజ్ అయ్యాక ఎన్ని సెన్సేషన్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.