మహేష్‌బాబు కెరీర్‌లో మైలు రాయి లాంటి చిత్రం `ఒక్కడు`. గుణశేఖర్‌ దర్శకత్వంలో ఎంఎస్‌రాజు నిర్మించిన ఈ చిత్రం అప్పట్లో సూపర్‌ హిట్‌గా నిలిచింది. మహేష్‌ యాక్షన్‌, భూమిక నటన, ప్రకాష్‌ రాజ్‌ విలనిజం సినిమాకి హైలైట్‌గా నిలిచాయి. ఇప్పుడు మరోసారి `ఒక్కడు` సినిమా ప్రస్తావన వచ్చింది. అంతేకాదు త్వరలోనే దీనికి సీక్వెల్‌ ఉండబోతుంది. తాజాగా నిర్మాత ఎంఎస్‌ రాజు ఈ విషయాన్ని వెల్లడించారు. 

ఎంఎస్‌.రాజు నిర్మించిన `శత్రువు` ముప్పై ఏళ్లు పూర్తి చేసుకుంది. వెంకటేష్‌ హీరోగా, కోడి రామకృష్ణ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని సుమంత్‌ ప్రొడక్షన్స్ పతాకంపై ఎంఎస్‌ రాజు నిర్మించారు. ఈ సినిమా ముప్పై ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్బంగా నిర్మాత ఎంఎస్‌ రాజు ట్విట్టర్‌లో అభిమానులు ముచ్చటించారు. ఈ సందర్భంగా వారు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం చెప్పారు. 

చాలా మంది అభిమానులు మహేష్‌తో సినిమా గురించి, `ఒక్కడు` సీక్వెల్‌గా గురించి ప్రశ్నించగా, కచ్చితంగా ఉంటుందని, మరో వచ్చే నెలలో ఆ వివరాలు వెల్లడిస్తానని తెలిపారు. మహేష్‌ మార్క్ యాక్షన్‌తో సినిమా ఉంటుందా? అన్న ప్రశ్నకి ఉంటుందన్నారు. `ఒక్కడు` సీక్వెల్‌ చేస్తే దానికి గుణశేఖరే దర్శకత్వం వహిస్తానన్నారు. దీన్ని బట్టి మహేష్‌తో ఎంఎస్‌ రాజు సినిమా త్వరలోనే ఉంటుందని తెలుస్తుంది. 

చాలా రోజులుగా ఎంఎస్‌ రాజు.. మహేష్‌తో సినిమా చేస్తానని చెబుతున్నారు. తాజాగా దానికి సమాధానం ఇవ్వడంతో `ఒక్కడు` సీక్వెల్‌ తెరపైకి వచ్చింది. మరి ఈ సినిమా ఎప్పుడుంటుంది. మహేష్‌ ఈ సినిమా చేస్తారా? లేదా అన్నది చూడాలి. ఇదిలా ఉంటే ఇటీవల ఎంఎస్‌ రాజు దర్శకుడిగా మారి రూపొందించిన `డర్టీ హరి` చిత్రం ఓటీటీలో విడుదలై మంచి ప్రశంసలందుకోవడంతోపాటు కలెక్షన్లని రాబట్టింది.