ఆస్కార్ అవార్డుల  కన్నులపండుగగా నేటి ఉదయం ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ అవార్డుల్లో కొరియన్ చిత్రం పారాసైట్ ఉత్తమ చిత్రంగా ఎంపికైంది. దాదాపుగా 6 విభాగాల్లో నామినేట్ అయిన ఈ చిత్రం బెస్ట్ మూవీగా నిలిచింది.

కామెడీ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రమంతా ఒక రెండు కుటుంబాల చుట్టూ తిరుగుతుంది. ఒక పేద కుటుంబానికి చెందిన ఒక నలుగురు వ్యక్తులు ఎలా ఒక ధనిక కుటుంబంలో ఒకరి తరువాత ఒక్కరుగా వారు ఒకే కుటుంబానికి చెందిన వారు అని తెలియనీయకుండా పనికి కుదిరారనేది ప్రధాన కథాంశం. 

ఆ తరువాత ఒకానొక సందర్భంలో  ధనిక కుటుంబమంతా సెలవులపై వెళ్ళినప్పుడు ఈ పెద్ద కుటుంబంలోని వారంతా ఆ భవంతిలో ఫుల్లుగా ఎంజాయ్ చేస్తుంటారు. ఉన్నపళంగా ఆ ధనిక కుటుంబం సెలవులను అర్థాంతరంగా ముగించుకొని ఇంటికి తిరిగి వస్తుంది. 

ఈ క్రమంలో కార్ డ్రైవర్ గా పని చేస్తున్న పేద ఇంటి వ్యక్తిని గురించి ధనిక ఇంటి యజమాని చాలా హీనంగా మాట్లాడతాడు. దాన్ని మనసులో పెట్టుకున్న ఆ వ్యక్తి ఆ ధనిక ఇంటి యజమానిని చంపేస్తాడు. కథలో ఇంకొన్ని పాత్రలు ఉన్నప్పటికీ కూడా ఈ లైన్ మనకు ప్రధానంగా కనబడుతుంది. 

Also read: నాలుగు ఆస్కార్ లు పొందిన ‘పారాసైట్‌’ రివ్యూ!

ఇదే తరహాలో 2009లోనే మన భారతీయ చిత్రం కూడా ఒకటి రూపొందింది. బారాణా పేరుతో విడుదలైన ఈ చిత్రం కూడా ఒక కామెడీ థ్రిల్లరే! ఈ చిత్రం లో డ్రైవర్ శుక్ల పాత్రలో నటించిన నసీరుద్దీన్ షాని యజమానురాలు నిత్యం అవమానపరుస్తూ అతన్ని హీనంగా చూస్తుంది. 

పేదరికం వల్ల ఇలాంటి అవమానాలు అన్ని భరించవలిసి వస్తుందని భావిస్తున్న నసీరుద్దీన్ షాకి రూమ్ మేట్స్ రూపంలో ఇంకో ఇద్దరు తోడవుతారు. వారంతా కలిసి కిడ్నాప్ లు చేయడం ద్వారా డబ్బులు సంపాదించాలని పూనుకుంటారు. 

ఈ రెండు చిత్రాల్లోనూ పేద జీవితం వల్ల పడే కష్టాలను, సమాజంపట్ల వారికి అంతర్లీనంగా ఉండే కసి, గొప్ప జీవితంపైన మోజు అన్ని కూడా మనకు కనబడుతాయి. ఈ రెండు చిత్రాల్లో ఒక మాట్టకోస్తే మన భారతీయ  చిత్రం బారాణా ఒకింత మనకు బాగా కనెక్ట్ అయినట్టుగా మనకు కనబడుతుంది. ముఖ్యంగా నసీరుద్దీన్ షా ఆక్షన్, ఇండియన్ ఎమోషనల్ డ్రామాకు మనం బాగా కనెక్ట్ అవుతాము. 

ఈ చిత్రంలో మనకు వాచ్ మాన్ పాత్రలో నటించిన విజయ్ రాజ్ టైఫాయిడ్ జ్వరంతో బాధపడుతున్న తన కొడుకుని ఆసుపత్రిలో చెరిపించేందుకు ప్రతి అపార్ట్మెంట్ తలుపు తట్టి... ఎవరు సహాయం చేయకపోవడం వల్ల  అతడు బాధపడుతూ చెప్పే డైలాగ్స్ కు ప్రతి సగటు భారతీయుడు కూడా కనెక్ట్ అవుతాడు. 

ఈ ప్రపంచీకరణ చెందిన సమాజంలో సగటు జీవనం సాగిస్తున్న ఒక సాధారణ దిగువ స్థాయి వ్యక్తుల జీవితాలు ఎలా ఉంటాయి, వారి ఆలోచనా సరళి, వారి ఆశలు అన్నిటిని కూడా డైరెక్టర్ రాజా మీనన్ చాలా బాగా చూపెట్టాడు. 

పారాసైట్ గొప్ప సినిమానే... కానీ మన భారతీయ చిత్రం కూడా ఒకటి ఇదే ఇతివృత్తంతో, అంతకన్నా మంచి కామెడీ ఎలెమెంట్స్ తో ఉంది. తప్పకుండా చూడలిసిన చిత్రం ఈ బారాణా.