బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ముంబైలో మెట్రో ఎక్కారు. దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియోలో అక్షయ్ మెట్రోలో తన జర్నీని బాగా ఎంజాయ్ చేసినట్లు కనిపించారు. రెండు గంటల ప్రయాణాన్ని కేవలం ఇరవై నిమిషాల్లో పూర్తి చేయడంతో ఎంతో ఆనందంగా ఉందని అన్నారు.

పూర్తి వివరాల్లోకి వెళితే.. ముంబైలో ఘాటాకోపర్ లో జరుగుతున్న షూటింగ్ లో అక్షయ్ కుమార్ పాల్గొన్నారు. అక్కడ నుండి వెర్సోవా వెళ్లాల్సివుంది. దానికోసం అతను గూగుల్ మ్యాప్ లో ట్రాఫిక్ చెక్ చేశారు. వెర్సోవా చేరుకోవడానికి రెండు గంటల సమయం పడుతుందని తెలుసుకున్నారు.

దీంతో 'గుడ్ న్యూస్' చిత్ర దర్శకుడు డైరెక్టర్ రాజ్.. అక్షయ్ కు మెట్రోలో ప్రయాణించవచ్చనే సలహా ఇచ్చారు. మొదట మెట్రోలో ప్రయాణించడానికి ఆసక్తి చూపని అక్షయ్ ఆ తరువాత ప్రయాణించడానికి సిద్ధమయ్యారు. ఇద్దరు బాడీగార్డుల సహాయంతో మెట్రో ఎక్కి.. సైలెంట్ గా ఓ పక్కకి కూర్చున్నారు. 

దీంతో అభిమానులు ఎవరూ కూడా ఆయన్ని గుర్తు పట్టలేదు. ఆ సమయంలో వర్షం కూడా పడుతోంది. వర్షంలో మెట్రో ప్రయాణాన్ని అక్షయ్ ఎంతో ఎంజాయ్ చేశారు. ఇటీవలే అక్షయ్ నటించిన 'మిషన్ మంగళ్' సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి సక్సెస్ అందుకుంది.