Asianet News TeluguAsianet News Telugu

క్రౌడ్ ఫండింగ్ మూవీ 'మిస్టర్ అండ్ మిస్' రివ్యూ

క్రౌడ్ ఫండింగ్ కాన్సెప్టుతో తీసే సినిమాలు మన దగ్గర చాలా చాలా తక్కువ. అసలు ఒకరి కథను ఒక ప్రొడ్యూసరే నమ్మి పెట్టుబడి పెట్టడం కష్టం. అలాంటిది చాలా మందిని ఒప్పించి అందరి దగ్గరా తలో కాస్తా తీసుకుని చేయటం అంటే పెద్ద యజ్ఞం చేసినట్లే. అయితే 2019లో సైమా అవార్డుల్లో బహుమతి గెల్చిన షార్ట్‌ ఫిల్మ్‌ నే సినిమా గా తీస్తాననటంతో పని కాస్త ఈజీ అయ్యిందేమో. ఇంతకీ ఆ షార్ట్ ఫిలింలో ఏముంది. దాన్ని సినిమాగా తీసే క్రమంలో ఏమేం మార్పులు చేసారు. అసలు షార్ట్ ఫిలిం ఐడియా సినిమాకు పనికొస్తుందా..కథేంటి వంటి విషయాలు రివ్యూలో చూద్దాం. 
 

Mr & Miss telugu  Movie Review jsp
Author
Hyderabad, First Published Jan 30, 2021, 4:25 PM IST

అమలాపురం కుర్రాడు శివ(శైలేష్‌ సన్నీ) ఇంట్లో వాళ్ల పోరు పడలేక సాఫ్ట్ వేర్ జాబ్ చేయాలని హైదరాబాద్ లో దిగుతాడు. ఇక్కడ జాబ్ కోసం వేసే ట్రైల్స్ లో తను ఇంగ్లీష్ లో పరమ పూర్  అని, అందుకే జాబ్ తనకు సెట్ కావటం లేదని తెలుస్తుంది. ఈ క్రమంలో శశికళ అలియాస్‌ శశి (జ్ఞానేశ్వరి) ఓ ఇంటర్వూలో హెచ్ ఆర్ గా తగులుతుంది. ఆమె మనోడి పూర్తి రివర్స్ గేర్. హై ఫై బ్యాచ్. ఈ మధ్యనే ముంబై నుంచి హైదరాబాద్ వచ్చింది. అలాగే రీసెంట్ గా తన లవర్ తో బ్రేక్ అప్ అయ్యి ఉంటుంది. ఆ ఫాస్ట్ అమ్మాయికు ఈ విలేజ్ కుర్రాడు,అతనిలో అమాయికత్వం గట్రా నచ్చేస్తాయి. దాంతో అతనికి ఇంగ్లీష్ నేర్పిస్తూ ప్రేమలో పడిపోతుంది. అక్కడితో ఆగకుండా ఇద్దరూ లివ్ ఇన్ రిలేషన్ స్టార్ట్ చేసేస్తారు. ఈ లోగా శివకు జాబ్ పోతుంది. దాంతో అతనిలో  ప్రస్టేషన్ పెరిగి అది బ్రేకప్ దాకా వెళ్లిపోతుంది. ఇద్దరూ ఓ సుముహూర్తన విడిపోయే సమయంలో...శివ ఐఫోన్ పోతుంది. ప్రేమే పోయింది..వెధవ ఐ ఫోన్ పోతే ఏముంది అనుకుని సర్ది చెప్పుకుందామనుకుంటే....ఆ ఐఫోన్ లో వీళ్లిద్దరి పర్శనల్ ఎఫైర్ ఉన్న వీడియో ఉంది. దాంతో బ్రేకప్ మాట దేవెడురుగు ముందు ..ఆ ఐ ఫోన్ పట్టుకుని ఆ వీడియో ...ఏ ఇంటర్నె ఫోర్న్ సైట్ లోకి ఎక్కకుండా ఆపాలని ఇద్దరూ వెతకటం మొదలెడతారు. ఈ క్రమంలో జరిగే సంఘటనల సమాహారమే మిగతా కథ. 

ఎలా ఉందంటే..

క్రౌడ్ ఫండెడ్ ఫిల్మ్ అనగానే  అంతమంది డబ్బులు వేసుకుని నిర్మించారు అంటే..ఖచ్చితంగా ఇందులో మ్యాటర్ ఉందీ అనిపిస్తుంది. అయితే ఇక్కడ ఒక్కోసారి మ్యాటర్ తక్కువై, మసాలా ఎక్కువ అయ్యింది. సి గ్రేడ్ సినిమాగా రొమాంటిక్ సీన్స్ తో నడిపే ప్రయత్నం చేసారు దర్శకుడు. చిన్న సినిమా కదా డబ్బులు వెనక్కి రావాలంటే అంతకు మించి దారిలేదనుకున్నాడేమో. అయితే ఒక విషయం మాత్రం మెచ్చుకోవాలి. సినిమాకు తీసుకున్న కాన్సెప్టు మాత్రం బాగుంది. దాని ఎగ్జిక్యూషన్..ట్రీట్మెంట్ తో సహా మొత్తం నీరసంగా సాగాయి. స్క్రీన్ ప్లేనే ఈ సినిమాపై ఇంట్రస్ట్ లేకుండా చేసేసింది. మరో విషయం ఏమిటంటే..ఇది గతంలో ఆయనే షార్ట్ ఫిల్మ్ గా తీసిన పాయింట్. అప్పుడు అవార్డ్ వచ్చింది. అయితే ఆ షార్ట్ ఫిలిం కంటెంట్ సినిమాగా విస్తరించేసరికి విసిగించేసింది. చిన్న పాయింట్ ని సాగ తీసి,ఎగ్గొట్టి,దిగ్గట్టారు. ఇక సీన్స్,స్క్రీన్ ప్లే ఎంత ప్రెడిక్టబుల్ గా ఉంటాయంటే..మనం రాబోయే నాలుగో సీన్ ఇదీ అని చెప్పేయచ్చు. సినిమా ప్రారంభం నుంచి చివరి దాకా అక్కర్లేని ఎ సర్టిఫికేట్ సీన్స్ తోనే నింపేసాడు. ఇంకా ఈ రోజుల్లో ఈ సీన్స్ చూడటానికి థియోటర్ కు ఎవరు వస్తున్నారు. అందరికి అన్ని అందుబాటులో దొరుకుతూంటే. ఫస్టాఫ్ అలా నడిచిపోయినా..సెకండాప్ కు వచ్చేసరికి ఫోన్ మిస్సైందనే ఒకే పాయింట్ చుట్టూ తిరుగుతుంది.  

టెక్నికల్ టీమ్ ఎలా చేసింది

ఈ సినిమాకు టెక్నికల్ డిపార్టమెంట్ బాగానే అవుట్ ఫుట్ ఇచ్చారు. యశ్వంత్ నాగ్ సంగీతం,బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. మూడ్ ని క్యారీ చేయటంలో సంగీతం పోటీ పడింది. ఇక మనోహర్ కెమెరా వర్క్ విషయానికి వస్తే చక్కటి విజువల్స్ ని ప్రెజెంట్ చేసారు. డైలాగ్స్ కూడా బాగున్నాయి. డైరక్షన్ ..సోసో అనే చెప్పాలి. పైన చెప్పుకున్నట్లు సినిమాలో తీసుకున్న పాయింట్‌ బాగున్నా, టైటిల్స్‌ దగ్గర నుంచి ఫస్టాఫ్‌ అంతా లిప్‌లాక్‌లు, హాట్‌ సీన్ల నే బేస్ చేసుకోవటం విసిగిస్తుంది.అలాగే  ఎమోషనల్ సీన్స్ లో మాత్రం డెప్త్, ఫీల్ తీసుకురాలేకపోవటం పెద్ద వెలితి. ఇక ఎడిటింగ్ బాగా షార్ప్ గా ఉండాలనో తపనో ..ఏమో కానీ ...జంప్ కట్స్ ఎక్కువ పడి,ఎమోషన్ ని దెబ్బ కొట్టాయి.

ఇక హీరో,హీరోయిన్స్ ఇద్దరిదీ ఇదే తొలి సినిమా. అయినా ఇద్దరూ బాగానే చేసారు. ముఖ్యంగా జ్ఞానేశ్వరి మంచి ఫెరఫార్మెన్స్ ఇచ్చింది. శైలేష్ సెకండాఫ్ లో కొన్ని సీన్స్ బాగా చేసారు. అలాగే హీరో ఫ్రెండ్ బుల్లిబ్బాయి గా చేసిన ఆర్టిస్ట్ అదరకొట్టాడు. 

ఫైనల్ థాట్

పెద్ద హీరో ఇమేజ్ కు తగ్గ కథను చిన్న హీరోతో చుట్టేస్తే ఎంత దారుణంగా ఉంటుందో..షార్ట్ ఫిలిం కథను పెద్ద తెర సినిమాగా మార్చి తీస్తేనూ అలాగే ఉంటుంది.

Rating:2
--సూర్య ప్రకాష్ జోశ్యుల

ఎవరెవరు..
తారాగణం: జ్ఞానేశ్వరి కాండ్రేగుల, శైలేష్‌ సన్నీ తదితరులు. 
బ్యానర్ : రీడింగ్ ల్యాంప్స్ క్రియేషన్స్
 ఎడిటర్ : కార్తిక్ కట్స్,
 పాటలు: పవన్ రాచేపల్లి, 
ఆర్ట్ డైరెక్టర్ : కరీష్ కుమార్,
 లైన్ ప్రొడ్యూసర్ : ప్రవీణ్ సాగి,
 సినిమాటోగ్రఫీ : సిద్ధం మనోహర్, 
సంగీతం : యశ్వంత్ నాగ్,
 స్క్రీన్ ప్లే, డైలాగ్స్ : సుధీర్ వర్మ పెరిచర్ల,
 నిర్మాణం : క్రౌడ్ ఫండెడ్, 
రన్ టైమ్:2 గంటల 5 నిముషాలు 
కథ, దర్శకత్వం : అశోక్ రెడ్డి. 
విడుదల తేదీ  :     29 జనవరి, 2021

Follow Us:
Download App:
  • android
  • ios