బాలీవుడ్‌ ఫైర్‌ బ్రాండ్‌ కంగనా రనౌత్‌ దెబ్బకి ఏకంగా ఓ రాష్ట్ర ప్రభుత్వమే షేక్‌ అవుతుంది. శివసేన పార్టీకి చెందిన మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే ప్రభుత్వం ఓ చిన్న వ్యవహారాన్ని డీల్‌ చేయడంలో విఫలమవ్వడమేకాదు, వివాదాన్ని పరిష్కరించడంలో వెనకబడింది. డ్రగ్స్ కేసు విషయంలో కంగనా చేసిన ఆరోపణలు పెద్ద దుమారం రేపుతున్నాయి. సుశాంత్‌ కేసుని డీల్‌ చేయడంలో ముంబయి పోలీసులు విఫలమయ్యారని, దోషులను దాచేప్రయత్నం చేస్తున్నారని కంగనా ఆరోపిస్తుంది. ఏకంగా ముంబయిని పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌తో పోల్చింది. దీంతో ఆమెకి వై ప్లస్‌ కేటగిరి సెక్యూరిటీని కేంద్రం కేటాయించింది. 

మరోవైపు బాంద్రాలోని కంగనా ఆఫీస్‌ని బీఎంసీ అధికారులు కూల్చేశారు. దీనిపై కంగనాకి, మహారాష్ట్ర ప్రభుత్వానికి మధ్య పెద్ద యుద్ధమే జరుగుతుంది. ఈ పరిణామాల నేపథ్యంలో కంగనా ఆదివారం సాయంత్రం మహారాష్ట్ర గవర్నర్‌ని కలవబోతుంది. ఈ రోజు సాయంత్రం నాలుగున్నర గంటలకు మహారాష్ట్ర గవర్నర్‌ భగత్‌సింగ్‌ కోషియార్‌ని ప్రత్యేకంగా కంగనా కలవబోతున్నారు. 

బాంద్రాలోని కంగనా ఆఫీస్‌ని బీఎంసీ అధికారులు కూలగొట్టడంపై గవర్నర్‌ అసంతృప్తిని వ్యక్తం చేశారు. అంతేకాదు మహా రాష్ట్ర చీఫ్‌ సెక్రెటరీని వివరణ అడిగారు. ఈ నేపథ్యంలో ఈ రోజు గవర్నర్‌తో కంగనా మీటింగ్‌ ఆసక్తిని రేకెత్తిస్తుంది. అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.