టాలీవుడ్ హీరోయిన్ డ్రగ్స్ కేసులో దొరికిందంటూ బాలీవుడ్ మీడియా కోడై కూసింది. దీనితో సదరు హీరోయిన్ ఎవరనే టెన్షన్ అందరిలో పెరిగిపోయింది. తీరా చూస్తే పేరు కూడా తెలియని చిన్న చిన్న సినిమాలో పాత్రలు చేసిన శ్వేతా కుమారి అని తెలిసింది. ఇంత వరకు ఎవరికీ పెద్దగా పరిచయం లేని శ్వేతాను హీరోయిన్ గా చిత్రీకరించి పెద్ద రాద్దాంతమే చేశారు. 

పోలీసుల అదుపులో ఉన్న శ్వేతా కుమారిని అధికారులు విచారిస్తున్నారు. శ్వేతా కుమారికి ముంబై మాఫియాకు చెందిన కరీం లాలాతో కూడా సంబంధాలు ఉన్నట్లు వెలుగులోకి వచ్చింది. డ్రగ్స్ దందాలో ఎప్పటి నుండో ఉన్న శ్వేతా కుమారి, మాఫియా లీడర్స్ తో కూడా సంబంధాలు నెరిపారట. ఈ నేపథ్యంలో విచారణలో ఆమె ఏ టాలీవుడ్ సెలబ్రిటీ పేరు చెబుతుందో అని కొందరు భయపడుతున్నారు. టాలీవుడ్ నుండి ఎవరైనా ఆమె వద్ద నుండి డ్రగ్స్ కొనుగోళ్ళకు పాల్పడితే... ఆ విషయం ఆమె విచారణలో చెప్పే అవకాశం ఉంటుంది. అలా జరిగితే టాలీవుడ్ షేక్ కావడం ఖాయం. 

గతంలో పూరి జగన్నాధ్, రవితేజ, ఛార్మి, సుబ్బరాజ్, మొమైత్ ఖాన్, తరుణ్ వంటి ప్రముఖులు డ్రగ్స్ ఆరోపణలు ఎదుర్కోవడంతో పాటు విచారణలో పాల్గొన్నారు. అప్పట్లో ఆ కేసు సంచలనం కాగా.. చాలా కాలం తరువాత మరలా డ్రగ్స్ కేసు టాలీవుడ్ లో కలకలం రేపుతోంది. శ్వేతా కుమారితో పాటు చాంద్ మహమ్మద్ అనే వ్యక్తిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న పోలీసులు రూ. 10 లక్షల విలువైన డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు.