‘గాడ్, సెక్స్ అండ్ ట్రూత్’ షార్ట్ ఫిల్మ్ భారతీయ సంస్కృతీ సాంప్రదాయాలను మంటగలిపేస్తోందని, ఇలాంటి నీచమైన సినిమా తీసిన వర్మపై చర్యలు తీసుకోవాలని కోరుతూ భారతీయ జనతా పార్టీ మహిళా విభాగం నేతలు దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. రామ్ గోపాల్ వర్మకు పిచ్చి పట్టిందని.. అందుకే ఇలాంటి అర్థం పర్థం లేని సినిమాలు తీస్తున్నాడని బీజేపీ మహిళా విభాగం నేతలు విరుచుకుపడ్డారు.

 

వర్మను భార్య, కూతురు కూడా వెలివేశారని, ఇకనైనా వర్మ పద్ధతి మార్చుకోవాలని.. లేకపోతే వర్మకు తాము పిచ్చి వదిలిస్తామని వారు హెచ్చరించారు. విజయవాడ పరిధిలోని సూర్యపేట పోలిస్ స్టేషన్లో బీజేపీ నేతలు తమ ఫిర్యాదును ఇచ్చారు. వారి ఫిర్యాదును పరిశీలించిన అనంతరం తదుపరి చర్యలను చేపడతామని పోలీసులు ప్రకటించారు.

 

అయితే వర్మ ఇలాంటి విమర్శలను, ఫిర్యాదులను లెక్క చేసేట్టుగా లేడు. పోర్న్ చూడటం తప్పే కాదు, పోర్న్ చూడటం వల్ల నష్టం లేదు, అది మానసిక వ్యాధి ఎంతమాత్రమూ కాదు, సరదాగా పోర్న్ చూడవచ్చు.. పోర్న్ స్టార్ అంటే దేవతతో సమానం, అలెగ్జాండర్ కన్నా గొప్ప.. అంటూ వర్మ తన సహజ శైలిలోనే స్పందిస్తున్నాడు.