బాలీవుడ్ అగ్ర దర్శకుల్లో ఒకరైన అనురాగ్ కశ్యప్ తనపై పదే పదే న్యూడ్ సీన్స్ తీసేవాడని అతడి కారణంగా ఏడ్చేశానని నటి కుబ్రా సైత్ వెల్లడించారు. ప్రస్తుతం బాలీవుడ్, టాలీవుడ్ లలో వెబ్ సిరీస్ ల హవా మొదలైన సంగతి తెలిసిందే. కొందరు పెద్ద దర్శకులు సైతం ఈ వెబ్ సిరీస్ లు రూపొందించడానికి ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలో బాలీవుడ్ లో అనురాగ్ కశ్యప్ 'సాక్రెడ్ గేమ్స్' అనే వెబ్ సిరీస్ ను చిత్రీకరించారు.

ఈ సిరీస్ లో సైఫ్ అలీ ఖాన్, నవాజుద్దీన్ సిద్దికీ, రాధికా ఆప్టే వంటి ప్రముఖ నటులతో పాటు కుబ్రా సైత్ అనే నటి కూడా నటించింది. ఈ సిరీస్ ను ఇంగ్లీష్, హిందీ భాషల్లో పలు దేశాల్లో విడుదల చేశారు. అయితే ఈ సిరీస్ కు సంబంధించి ఓ సందర్భంలో తను ఏడ్చేశానని నటి కుబ్రా సైత్ వెల్లడించింది. ''ఈ వెబ్ సిరీస్ లో నేను నగ్నంగా కనిపించాల్సివుంటుంది. ఆ విషయం దర్శకుడు అనురాగ్ కశ్యప్, కో డైరెక్టర్ నాకు ముందే చెప్పారు. అయితే నగ్నంగా నటించాల్సిన సన్నివేశాలను పదే పదే చిత్రీకరించేవారు. సీన్ ముగిసిన తరువాత మరో టేక్ చేద్దామనేవారు.

ఇలా ఒక సీన్ ఏడెనిమిది సార్లు చిత్రీకరించేవారు. ఆ సమయంలో నేను ఏడ్చేశాను. అలా ఎక్కువసార్లు టేక్స్ తీసుకుంటున్నందుకు తనను తప్పుగా అనుకోవద్దని సీన్ మరింత అందంగా రావడం కోసమే అలా చేస్తున్నట్లు అనురాగ్ చెప్పేవారు. నువ్ నన్ను అసహ్యించుకుంటున్నావని తెలుసు కానీ దయచేసి అలా అనుకోకు.. సిరీస్ విడుదలైన తరువాత ఆ సీన్లు చూసి చాలా బాగా తీశారని నువ్వే అనుకుంటావని అనురాగ్ చెప్పేవారని'' కుబ్రా సైత్ చెప్పుకొచ్చింది.