ఈ ఉగాది నుంచి (బుధవారం) తాను సోషల్‌ మీడియాలో ఎంటర్‌ అవుతున్నానని మంగళవారం ఓ వీడియో ద్వారా మెగాస్టార్ చిరంజీవి వెల్లడించిన సంగతి తెలిసిందే.  అన్నట్లుగానే చిరు అధికారికంగా ఇన్‌స్టాగ్రామ్‌లో చేరారు. అప్పుడే మెగాస్టార్ ను ఇన్‌స్టాగ్రామ్‌లో 316 కె కంటే ఎక్కువ మంది ఫాలో అవుతున్నారు. ఇంకా చాల స్పీడుగా ఫాలోవర్స్ పెరుగుతున్నారు. దాంతో ఇన్‌స్టాగ్రామ్‌లో మెగా ఫాలోయింగ్ మొదలైందని ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు. 

ఈ నేపధ్యంలో చిరంజీవి తన మొదటి పోస్ట్ ను ఏం పెడతారా అనే ఊహాగానాలు మెగాభిమానుల్లో మొదలయ్యాయి. కొందరైతే కరోనా వైరస్ గురించి ఆయన మాట్లాడబోతున్నారని అంటున్నారు. అయితే అందుతున్న సమాచారం మేరకు..ఆయన తన తాజా చిత్రం ఆచార్య ఫస్ట్ లుక్ పోస్టర్ ని ఇనిస్ట్రా ద్వారా రిలీజ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇలా మెగాస్టార్‌ చిరంజీవి తన అభిమానులకు ఉగాది ట్రీట్‌ ఇవ్వబోతున్నారని చెప్తున్నారు. 

ఇన్నాళ్లూ సోషల్‌ మీడియాకు దూరంగా ఉన్న ఆయన బుధవారం నుంచి ఈ మాధ్యమంలోనూ సందడి చేయబోతూండటంతో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ ఈ విషయాన్ని ట్విటర్‌ ద్వారా తెలిపింది. ‘ఈ ఉగాది ఎంతో ప్రత్యేకం కాబోతోంది. మీ మెగాస్టార్‌ చిరంజీవి తన సోషల్‌మీడియా ఖాతాల ద్వారా మీతో మాట్లాడబోతున్నారు. ఆయన్ను ఫాలో కావడానికి సిద్ధంగా ఉండండి’ అని పోస్ట్‌ చేసింది.

‘‘ఎప్పటికప్పుడు నా భావాలను నా అభిమానులతో షేర్‌ చేసుకోవడానికి, అలాగే నేను అనుకున్న సందేశాలను కానీ, చెప్పాలనుకున్నవి ప్రజలతో చెప్పుకోవడానికి కానీ సోషల్‌ మీడియాను ఓ వేదికగా భావిస్తున్నాను. ఈ ఉగాది రోజున సోషల్‌ మీడియాలోకి ఎంట్రీ ఇస్తున్నాను’’ అని ఆ వీడియోలో పేర్కొన్నారు చిరంజీవి.

 ప్రస్తుతం ‘ఆచార్య’ అనే చిత్రంలో హీరోగా నటిస్తున్నారు చిరంజీవి. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను రామ్‌చరణ్, నిరంజన్‌రెడ్డి నిర్మిస్తున్నారు. కరోనా వైరస్‌ కారణంగా ఈ సినిమా షూటింగ్‌ను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు చిరంజీవి ఇటీవల వెల్లడించిన సంగతి తెలిసిందే. అయితే  ఈ ఏడాది ఆగష్టు నెలలో చిత్రాన్ని ప్రేక్షకులకు అందివ్వడానికి సన్నాహాలు చేస్తున్నారు టీమ్.