ఇటీవల తమిళ స్టార్ హీరో విజయ్ మీద ఐటీ రైడ్స్ జరగడం పెద్ద దుమారాన్ని రేపింది. ఈ సోదాల్లో విజయ్ వద్ద ఎలాంటి పన్ను ఎగవేత సొమ్ము దొరకలేదు. అయితే ఈ వ్యవహారం విజయ్ అభిమానులను బాగా రెచ్చగొట్టింది.

ఈ ఐటీ రైడ్స్ వెనుక రాజకీయ కుట్ర ఉందని, బీజేపీ పార్టీ కావాలని ఇదంతా చేస్తుందని అంటున్నారు. విజయ్ కి ఫ్యాన్స్ భారీగా మద్దతు తెలుపుతున్నారు. ఇది ఇలా ఉండగా.. తాజాగా తమిళనాడు మదురైలో విజయ్ పోస్టర్లు కలకలం రేపుతున్నాయి.

హీరో విజయ్ ఇంటిపై ఐటీ దాడులు: నోరు విప్పేందుకు బెంబేలు

విజయ్ ని రాజకీయాల్లోకి ఆహ్వానిస్తూ మార్ఫింగ్ చేసిన ఫోటోలతో అభిమానులు పోస్టర్లు డిజైన్ చేసి తమిళనాట మొత్తం అంటిస్తున్నారు. ఈ పోస్టర్లపై ఓ పక్క జగన్, మరోపక్క రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్.. మధ్యలో విజయ్ కనిపిస్తున్నారు.

ఈ పోస్టర్ లో 'ఏపీలో పరిస్థితులను మేం చక్కదిద్దాం.. కష్టాల్లో ఉన్న తమిళనాడుని మీరే కాపాడాలి' అంటూ సందేశం ఉంది. వెంటనే రంగంలోకి దిగాలంటూ జగన్ కి, ప్రశాంత్ కిషోర్ అభిమానులు విన్నపం చేస్తున్నారు. విజయ్ కి రాజకీయాల పట్ల ఆసక్తి ఉన్నప్పటికీ.. అతడు సినిమాల్లో బీజేపీకి వ్యతిరేకంగా కామెంట్స్ చేయడంతో తమిళనాడు రాజకీయ పార్టీలన్నీ ఏకమైన విజయ్ ని టార్గెట్ చేశాయి.

దాడులు జరిగిన తరువాత అనూహ్యంగా రాష్ట్ర బీజేపీ కార్యకర్తలు నేవేలీలో విజయ్ షూటింగ్ చేసుకునేందుకు అనుమతులు ఇవ్వాలంటూ ఆందోళనలు చేశారు. ఆ తరువాత మూడు రోజుల పాటు 'మాస్టర్' సినిమా షూటింగ్ ని పూర్తి చేశారు. షూటింగ్ జరిగినన్ని రోజులు ఆ ప్రాంతంలో అభిమానులు వేల సంఖ్యలో విజయ్ కోసం వచ్చారు.