శాతకర్ణి తో తెలంగాణాకు ఒరిగిందేమిటో !
అప్పట్లో దక్షిణభారత సినిమాలన్నీ మద్రాస్ కేంద్రంగా నిర్మించేవారు.ఎన్నో స్టుడియోల్లో షూటింగుల సందడి.అయితే కన్నడ సినిమాల షూటింగ్ రాత్రిల్లు జరిగేవి,కారణం ఆ సమయంలో అద్దె తక్కువ కాబట్టి.కన్నడ ప్రేక్షకులు తెలుగు,తమిళ ప్రేక్షకుల్లా కనకవర్షం కురిపించరు.
ఉన్న పెద్దనగరం బెంగుళూరులోనూ హిందీ,ఇంగ్లీష్,తెలుగు,తమిళ సినిమాల భారీ బజట్ సినిమాల మధ్య కన్నడ సినిమాలు రాజును చూసిన కళ్లతో....సామెతలా అనిపించేవి.దాంతో కన్నడ సినిమాలూ ఆర్ధిక విజయం సాధించాలని ప్రభుత్వం వినోదపన్ను మినహాయింపు నిచ్చేది.దీనివల్ల టికెట్ ధర తక్కువున్నందున ప్రేక్షకులూ ఎక్కువమంది చూసే సౌలభ్యం ఉండేది.ఇదే కాకుండా నగరంలోని సినిమాహాళ్లన్నీ విధిగా ఏడాదిలో ఇన్నివారాలపాటూ కన్నడ సినిమాలు ప్రదర్శించాలి,లేకుంటే జరిమానా కట్టాలనే నిబంధనా ఉండేది.
ఈ వినోద పన్ను మినహాయింపు మన రాష్ట్రంలోనూ కొన్ని సినిమాలకు ఇచ్చేవారు.ఉదాహరణ..అప్పట్లో NTR బంధువు విశ్వేశ్వర రావు తీసిన తీర్పు,మార్పు లాంటి సినిమాలు.ఇవే కాకుండా హిందీ సినిమాలు మృగయ(మిథున్ చక్రవర్తి తొలి సినిమా)లాంటివీ ఉండేవి.ఈ సినిమాలన్నీ ఒక నిబద్దతతో,అంకితభావంతో రొటీన్ కు భిన్నంగా తీసిన సామాజిక జీవితాన్ని ప్రతిబింబించే సినిమాలు.
ఈ సినిమాల ను ముందుగా నిపుణులు పరిశీలించిన తర్వాత ప్రభుత్వం నిర్ణయం ప్రకటించేది.ఈ పన్ను మినహాయింపు వల్ల సినిమా హాల్ యాజమాన్య వాణిజ్య పన్నుల శాఖకు పన్ను కట్టేది ఉండదు.ఇక అప్పట్లో ఏ 5 రూపాయలో ఉండే టికెట్ రూపాయి,రెండు రూపాయలని ప్రేక్షకులూ సినిమా చూసేవారు.
ప్రస్తుత విషయానికి వస్తే....గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాకు ఆంధ్ర,తెలంగాణల్లో పన్ను మినహాయింపు ఇవ్వడం వివాదాస్పదమైంది.
ప్రభుత్వం చెప్పే కారణమేమో..ఇది తొలి తెలుగు చక్రవర్తి కథ అని..కానీ అప్పటికి తెలుగు భాషే ఉనికిలో లేదు,నాటి భాష ప్రాకృత,పైశాచి భాషలని,ఆ శాతవాహన రాజుల్లో ఒకడైన హాలుని గాధాసప్తశతి ప్రాకృతంలో ఉండేదని విమర్శకుల వాదన.
ఇక ఈ సినిమా విషయానికొస్తే చరిత్రను అడ్డగోలుగా వక్రీకరించారని విమర్శ...అయినా వీళ్ల నిబద్దతెంత?తీసింది కనీసం మన రాష్ట్రంలోనూ కాదు,ఎక్కడో మొరాకో,జార్జియాల్లో తీసారని అంటున్నారు.
ఇక నటుల విషయానికి వస్తే హేమమాలిని,శ్రీయ,కబీర్ బేది,శివ రాజ్ కుమార్ లాంటి పరభాషానటులు,చిరంతన్ భట్,జ్ఞానశేఖర్ లాంటి సాంకేతిక నిపుణులు పని చేసారు.
సరే ఇంతా చేసి ప్రేక్షకులకు దీని వల్ల లాభమేముంది?వారి జేబులు ఖాళీ చేసే టికెట్ రేట్లే ఉన్నాయి.ఇక్కడ మొత్తం పంపిణీదారులకు,సినిమాహాళ్లు అద్దెకు తీసుకున్న ఆ నలుగురికే లబ్ది చేకూరుతుంది.కోట్లాది రూపాయలు ఇటు ప్రేక్షకులనుంచి..అటు పన్నుకట్టకుండా ప్రభుత్వం నుంచీ లబ్ది పొందుతున్నారు.
ఇక ఒక ముఖ్యమంత్రికి ఈ కథానాయకుడు బావమరిది కావడం కారణమే కాదు శాతవహనుల రాజధాని మన అమరావతే అంటూ ప్రచారానికీ పనికి వస్తుంది..అంతేనా ఆ మధ్య దేశ విదేశ రాజధాని ఆకృతులంటూ నానా హడావిడి చేసి చివరికి దర్శకుడు రాజమౌళికి ఆ బాధ్యతలప్పగిస్తున్నా అన్నాడు(కనీసం ఆయన సినిమా కళా దర్శకుడూ కాదు...తెలంగాాణా ముఖ్యమంత్రి యాదాద్రి సముదాయాన్ని సినీ కళాదర్శకుడు ఆనంద్ సాయికి అప్పగించినట్లు).
ఇక రాజమౌళి ప్రస్తావన ఎందుకు అంటారా?
ఈ సినిమా ఆంధ్ర,రాయలసీమ పంపిణీదారుడు కొర్రపాటి సాయి..రాయలసీమ పంపిణీరంగంలో బళ్లారి సాయిగా ప్రసిద్ధుడైన ఈయనకు రాజమౌళికి ఉన్న అనుబంధం ఏమిటో బహిరంగ సత్యం.
ముఖ్యమంత్రి కోడలు,బాలకృష్ణ కూతురు బ్రాహ్మణికి 25 లక్షల చెక్కును అమరావతి నిర్మాణానికి అప్పగించడమే కాదు బాలకృష్ణ కొడుకు ను హీరో గా జనం మందు నిలబెట్టబోతున్న వాడు.
ఇది ఆంధ్ర కథ అయితే ఇక తెలంగాణాలో...
ఎవని తెలుగు,ఎవని తల్లి అనిమాట్లాడిన కెసిఆర్ ఆంధ్ర లాబీయింగ్ కు పడిపోయి పన్నుమినహాయింపు ఇచ్చాడు తప్ప రుద్రమ దేవిలా ఈ ప్రాంత చరిత్ర అని కాదు..
సినిమాలో రెండుచోట్ల కోటిలింగాల అన్న పేరు చెప్పినందుకు ప్రభుత్వానికి కోట్ల రూపాయల వినోదపు పన్ను నష్టమా అని అక్కడి సామాన్యులు విస్తుపోయి చూస్తున్నారు.