ప్రొఫెసర్ ఐలయ్యకు ఒక సంస్కృతం మాస్టారు సలహా

Sanskrit pundit srinivas Krishna seeks to demolish the argument of kancha Ilaiah

అది నటరాజస్వామి కొలువైన చిదంబరపుణ్యక్షేత్రంలో పవిత్రమైన శివగంగ కోనేరు.

స్థానికులు తమభాషలో స్వామిని తిల్లై కూతన్ అని పిలుచుకుంటారు. తిల్లై అనేది అక్కడి సముద్రతీరప్రాంతాలలో విరివిగా పెరిగే ఒకానొక చెట్టు. కూతన్ అంటే నృత్యాధిపతి. (తిల్లై నటరాజు అని అర్థం అన్నమాట)

ఆయన కొలువైన స్థానాన్ని వారు చిత్రాంబళం అంటారు. అంబళం అంటే రంగస్థలం లేదా దేవాలయం. చిత్ర అనే పదానికి విభిన్నమైన అర్థాలు ఉన్నాయి. అద్భుతమైనది, దివ్యమైనది, వర్ణమయమైనది, శోభస్కరమైనది, శుభంకరమైనది... ఇలా.

చిదంబళం అనేవారు కూడా ఉన్నారు. చిత్ + అంబళం అన్నమాట. చిత్ అంటే చైతన్యం అని అర్థం. సత్ + చిత్ + ఆనందం = సచ్చిదానందం అనే పదాల కలయికలో చిత్ ఇదే. చిదంబళం అంటే చైతన్యదేవాలయం అని అర్థం

స్వామివారి సహధర్మచారిణి పేరు శివగామి సుందరి. ఆమె ఆలయానికి ఎదురుగా ఉన్నదే ఈ శివగంగ కోనేరు.
 

Sanskrit pundit srinivas Krishna seeks to demolish the argument of kancha Ilaiah

 

పూర్వం చిదంబరంలో తిరునీలకంఠర్ అని ఒకాయన ఉండేవారు. ఆయన గొప్ప శివభక్తుడు. అంతటి ఆయన కూడా జితేంద్రియుడు కానందువల్ల, ఒకసారి ఒకానొక తప్పు చేశాడు. ఆ తప్పును అతని భార్య సహించలేకపోయింది. అతడు తన భార్యను అనునయించే ప్రయత్నం చేశాడు.

ఆ ప్రయత్నంలో తన భార్యను అతడు తాకే ప్రయత్నం చేయబోతే ఆమె "మీరు మమ్మల్ని అంటరాదు, తిల్లై కూతన్ స్వామి పేరిట ప్రమాణం" అనేసింది.

ఆమె నన్ను అంటరాదు అని ఏకవచనప్రయోగం చేయకుండా మమ్మల్ని అంటూ బహువచన ప్రయోగం చేసింది కాబట్టి, అతడు స్త్రీలెవరినీ తాకరాదు అని నిశ్చయించుకున్నాడు. నిండు యౌవనంలో ఉన్నపుడే అతడు బ్రహ్మచర్యదీక్షను స్వీకరించాడు. తన వృత్తిని తన శివుని తప్ప వేరెవరినీ మనసులో ఉంచుకోకుండా జీవితం గడిపాడు. అలాగని, భార్యను పోషించే తన ధర్మాన్ని మాత్రం అతడు విడిచిపెట్టలేదు. ఆమె కూడా శివభక్తితన్మయురాలైంది. క్రమంగా వారు ఇరువురూ వృద్ధులయ్యారు. శరీరంలో శక్తి క్షీణించింది.

శివగామీనటరాజులకు వారిపట్ల కరుణ కలిగింది. వారికి ఇహపరసౌఖ్యాలు కలుగజేయవలసిందిగా శివగామి నటరాజును కోరింది. సరేనన్నాడు ఆయన. ఒక శివయోగి వేషం ధరించి తిరునీలకంఠర్ ఇంటికి వచ్చాడు. అతని ఆతిథ్యం స్వీకరించిన తరువాత ఒక బంగారు భిక్షాపాత్రను అతని చేతికి ఇచ్చి, ఓయి నీలకంఠా, ఈ తీర్థయాత్రలకు పోతున్నాను, తిరిగి వచ్చిన తరువాత ఈ పాత్రను నీ దగ్గరనుండి తీసుకుంటాను, అంతవరకు నీవద్ద భద్రంగా దాచిపెట్టవలసింది" అని కోరాడు. సరేనన్నాడు నీలకంఠర్.

కొంతకాలం గడిచాక ఆ మాయాశివయోగి తిరిగివచ్చి, "ఏదీ, నీకిచ్చిన బంగారు పాత్రను నాకు తిరిగి ఇచ్చేసెయ్" అన్నాడు. నీలకంఠర్ తన ఇల్లంతా వెతికినా ఆ పాత్ర దొరకలేదు. అతడు శివయోగి కాళ్లమీద పడి, క్షమాపణ కోరాడు. ఆ పాత్రకు బదులుగా మరొక బంగారు పాత్రను ఇస్తానన్నాడు. కానీ, మాయాశివయోగి శాంతించాడు కాడు. నీవు శివభక్తుని వేషంలో ఉన్న ఒక దొంగవు అంటూ నిందించాడు.

నిజమైన శివభక్తుడు ఎన్నడూ దొంగ కాజాలడు అన్నాడు నీలకంఠర్. నీవు నిర్దోషివి అయితే శివుని సాక్షిగా ప్రమాణం చేయగలవా అని సవాలు చేశాడు మాయాశివయోగి. అలాగే, ఏమని ప్రమాణం చేయమంటారు అని నీలకంఠర్ అడిగాడు.

"నీవు నీ భార్య చేతిని పట్టుకుని తిల్లై కూతన్ శివగామి సుందరిల సమక్షంలో, శివగంగ కోనేరులో మునిగి బంగారు పాత్రను దొంగిలించలేదని చెప్పండి చూదాం" అన్నాడు మాయాశివయోగి.

ఒక కఠినమైన పరీక్ష ఎదురైంది నీలకంఠర్ కు. పూర్వం తిల్లై కూతన్ పేరిట తన భార్య చేసిన శపథం వల్ల తాను ఆమెను తాకరాదు. తాకితే స్వామివారిపట్ల ఘోరమైన అపరాధం చేసినట్లవుతుంది. కానీ, ఇపుడు ఆమె చేతిని పట్టుకుని తాను బంగారు పాత్రను దొంగిలించలేదని చెప్పి కోనేరులో మునిగి ప్రమాణం చేయకపోతే శివభక్తుడు దొంగ అనే అపవాదం వచ్చి పడుతుంది. ఏమి చేయాలో తెలియని విషాదంలో మునిగి కన్నీరు కార్చాడు నీలకంఠర్.

మాయాశివయోగి చిదంబరంలో పెద్దలందరినీ పిలిచి పెద్ద రచ్చ చేశాడు. వారందరూ వచ్చి, ఆ శివయోగి చెప్పినట్లే నీలకంఠర్ తన భార్య చేతిని పట్టుకుని ప్రమాణం చేయవలసిందేనని తీర్పు చెప్పారు. లేదంటే గ్రామబహిష్కరణ శిక్ష తప్పదని హెచ్చరించారు.

అపుడు ఇక మరణమే శరణం అని భావించిన అతనితో ఆయన భార్య ఒక ఉపాయం తెలిపింది. ఆ ఉపాయం ప్రకారం భార్యాభర్తలు ఇరువురు ఒక కఱ్ఱను ఇరువైపులా పట్టుకుని, మాయాశివయోగి చెప్పిన ప్రకారమే ప్రమాణం చేసి కోనేటిలో మునిగారు. వారు లేచి చూసేసరికి...
***
***

ఆశ్చర్యం! 
దంపతులు ఇరువురూ నవయౌవనవంతులు అయ్యారు. 
వారి వృద్ధత్వం ఎటుపోయిందో ఎవరూ ఎరుగరు. అక్కడ ఉన్న చిదంబరక్షేత్రప్రజలందరూ అది తమ తిల్లై కూతన్ చేసిన మాయ అని తెలుసుకున్నారు. హర హర మహాదేవ శంభో అనే వారి భక్తితన్మయధ్వనులతో క్షేత్రమంతా ప్రతిధ్వనించిపోయింది. 
***

కాలక్రమేణా ఆ నీలకంఠర్ అరవై ముగ్గురు నాయన్మారులలో ప్రథముడిగా ఘనత వహించాడు. నాయన్మారులంటే ద్రవిడదేశానికి చెందిన పరమశివభక్తులు. ఇంద్రియలోలుడైన తన భక్తునికి ఇంద్రియవిజయం ప్రసాదించి అనుగ్రహించిన కూతన్ కథ ఇది. 
***

ఇదిగో మిస్టర్ ఐలయ్యా,

ఈ తిరునీలకంఠ నాయనారు బ్రాహ్మడు కాదు, కోమటోడు అంతకంటే కాదు, అచ్చమైన శూద్రుడు. అతడు కుంభకారుడు అంటే మొదట అర్థం కాక ఏడుస్తావు. అర్థమైతే అది సంస్కృతం అని ఏడుస్తావు. అందుకే అతడు కుమ్మరి కులంలో పుట్టినవాడు అని స్పష్టంగా చెబుతున్నాను.

ఈ కథ తెలుసుకున్న తరువాతనైనా, 
"హిందూ దేవుళ్ళు తక్కువజాతి భక్తులను దూరంగా పెడతారు, యేసుక్రీస్తు, బుద్ధుడు మాత్రమే శూద్రులను చేరదీస్తారు" - అనేది ఇక ఆపు.

హిందూ దేవుళ్ళు పరమ సెక్యులర్ దేవుళ్ళు. తమను తిట్టినవారికి కూడా మోక్షం ప్రసాదిస్తారు. హిరణ్యకశిపుడు, రావణాసురుడు, శిశుపాలుడు వంటివారిని ఎరుగుదువా? వాళ్ళు ఎన్ని తిట్టినా సహించి తన చెంతకు చేర్చుకున్నవారు. వారిది కూడా భక్తేనని హిందూ దేవుళ్ళు భావిస్తారు. వాళ్ళది వైరభక్తి అట.

అలాగే, నీవు ద్వేషంతో వాగుతున్నా, అజ్ఞానంతో వాగుతున్నా, మొత్తానికి హిందూ దేవుళ్లను స్మరిస్తున్నావు. నీకు కూడా పుణ్యం వస్తుంది పో. అదీ మా మతపు గొప్పదనం.

 

(*రచయిత శ్రీనివాస కృష్ణ తిరుపతి రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠ లో ఆచార్యులు)