జానే కహా గయే ఓ దిన్...

saleems bashas golden memories old radia

 "రేడియో"- ఒకప్పుడు(కనీసం నాలుగైదు దశాబ్దాల క్రితం) ఏకైక ఎంటర్ టైన్ మెంట్ ఇంటిల్లిపాదికి! అప్పట్లో వాల్వ్ రేడియోలుండేవి.. వాటిల్లొ మర్ఫి,ఫిలిప్స్, లాంటివి పాపులర్. ముఖ్యంగా మర్ఫి రేడియో పైన ఉన్నా ముద్దులొలికే పిల్లాడి మొహం ఇప్పటికీ చాలా మందికి గుర్తుంటుంది!ఈ మధ్యనే అ పిల్లాడి ఫోటో (పెద్దయ్యాక)  పేపర్లలో వచ్చింది..  అయితే "నేషనల్ ఎకో" రేడియో కొంచెం ప్రత్యేకమైనది.. అందునా మా "నేషనల్ ఎకో" రేడియో మరీ ప్రత్యేకం. నాకు తెలిసి కర్నూలు  బీ.క్యాంప్ కాలనీ  మొత్తానికి మా ఇంట్లో మాత్రమే "నేషనల్ ఎకో"(నే.కో) ఉండేదనుకుంటా. చాలా గొప్పగా ఉండేది! అదంటే నాకు చాల ఇష్టంగా కూడా ఉండేది. 

నాతో పాటు మా రేడియో అంటే మా మావయ్యక్కూడ ఇష్టం(పిచ్చనుకుంటా) ఉండేది. ఈ రేడియో గురించి ఎన్నో కథలు ప్రచారంలో ఉండేవి. నాకు తెలిసి(తెలియకుండాను) దీన్ని మా మాతామహులు(అమ్మ నాన్న) మా నాన్న గారికి (దీంతోపాటు "రాబిన్ హుడ్ సైకిల్ కూడా) పెళ్ళిలో ఇచ్చారన్నది ఒక కథ. మా నాన్నే పెళ్ళి తర్వాత కొనుక్కున్నాడన్నది మరో కథ. ఏది ఏమైనా, మా కాలనీలో  ఎన్ని రేడియోలు ఉన్నా మా రేడియో ముందు అవన్నీ దిగదుడుపే!


రేడియోలో వచ్చే పాటలు, సినిమాలు, క్రికెట్ కామేంటరీ ,పిల్లల కార్యక్రమాలు అప్పట్లో అందరికి టైం పాస్.ఇక పెద్దవాళ్ళకి వార్తలు, పొలం పనులు ఇతరావి ఉండేవి. ముఖ్యంగా ప్రతి ఆదివారం మధ్యాహ్నం వచ్చే "సంక్షిప్త శబ్ద  చిత్రం" కోసం అందరూ ఎదురు చూసేవారు! రేడియో లేని వాళ్ళు భోజానాల తర్వాత మా ఇంటికొచ్చేవారు. అందరూ రేడియో చుట్టూ  కదలకుండా కూచుని సినిమా వినటం(!) ప్రతీ అదివారం కనిపించే దృశ్యం. మా నాన్న మాత్రం వార్తలు వినేవాడు. ఎప్పుడన్న సినిమా వినేవాడు.   


    ఇక రేడియోలొ "ఆకాశవాణి వార్తలు చదువుతున్నది అద్దంకి మన్నార్.." అనే గొంతు(లు) వినటం  భలే ఉండేది. అప్పట్లో  కందుకూరి సూర్యనారాయణ, దుగ్గిరాల పూర్ణయ్య,  మామిళ్ళపల్లి రాజ్యలక్ష్మి, ఏడిద గోపాల రావ్, డీ.వెంకట్రామయ్య, తిరుమలశెట్టి శ్రీరాములు వంటి దిగ్గజాలు వార్తలు చదువుతుంటే వినసొంపుగా ఉండేది. అప్పుడు గోడ గడియారాలు, చేతి వాచీలు తక్కువే.  కాలనీ లో వారందరికి వార్తల ద్వారానే  టైం తెలిసేది! 


ఇక తెలుగు పాటలంటే గుర్తొచ్చేది "రేడియో సిలోన్(శ్రీ లంక) వినిపించే "మీనాక్షి పొన్నుదురై" గొంతు మాత్రమే. మా రేడియోలోనైతె మరీ పక్కనే కూచుని మాట్లాడుతున్న ఫీలింగ్ ఉండేది. అంత క్లారిటీ ఉండేదన్నమాట నేషనల్ ఎకో లో! ఇప్పటిక్కూడా మర్చిపోలేని వాయిస్ అది. స్కూల్ నుంచి పిల్లలు వచ్చి అన్నాలు తినేసి వెళ్ళిపోయాక  సిలోన్ లో వచ్చే తెలుగు పాటలు వినటం ఒక టైం పాస్ ఆడాళ్ళందరికి. అంతకు ముందు మధ్యాహ్నం వచ్చే వార్తల వల్ల పిల్లలు వచ్చే టైం తెలిసేది. 


        ఇక మాకైతే (నాకు, మావయ్యకీ, మా పెద్దోడికి) మా రేడియోతో ఉన్న అనుబంధం "వివిద్ భారతీ" లో వచ్చే హిందీ పాటలు. మధ్యాహ్నాలు స్కూల్ ఎగ్గొట్టి పాటలు వింటం వల్ల నాకు రేడియో అంటే ఇష్టం మొదలై క్రమేణా పెరిగిపోయింది.  రేడియో మహత్యమో, మా మావయ్య సాంగత్యమో మొత్తానికి క్రమంగా రఫిని అరాధించే స్టేజికి వెళ్ళిపొయాను. మా మావయ్య కూడా కాలేజ్ కి వెళ్ళేది తక్కువే. రేడియోలో మహమ్మద్ రఫీ పాటలు వింటమే ఎక్కువ! ముఖ్యంగా  మధ్యాహ్నాలు. ఎందుకంటే అప్పుడు మా నాన్న ఉండడు కదా! నాన్న ఒక్కసారి ఉదయం పదికి ఆఫిసుకెళ్తే మళ్ళీ వచ్చేది రాత్రి తొమ్మిదికొ, పదికో. ఒకట్రెండు సార్లు మధ్యలో వచ్చినప్పుడు  నేను, మావయ్య పట్టుబడ్డాం. మావయ్యనేం అన్లేదు కాని.. నాకు మాత్రం...??! మా రేడియోలొనే కొన్ని గొంతులు అద్భుతంగా పలికేవేమో అనిపిస్తుంది. ముఖ్యంగా రఫి, లత, ముకేశ్ లవి. కిశొర్ కుమార్ అంటే మాకు వ్యతిరేకత లేదు కాని, పెద్దగా వినేవాళ్ళం కాదు. మావయ్యకి రఫి ప్రాణమైతే, మా అన్నయ్యకి మాత్రం ముకేశ్ అంటే ఇష్టం. అయితే వాళ్ళీద్దరి మధ్య ఎవరు గొప్ప గాయకుడన్న వాదన  జరిగేది కాదు. వివిద్ భారతిలో "జయ మాల",(పాలు పోసే మనిషి వచ్చే టైం ) "భూలే బిస్రే గీత్", "ఫౌజీ భాయియోంకి పసంద్" కార్యక్రమాల టైం మాకు కంఠతా వచ్చేది.  మరీ ముఖ్యంగా ప్రతి బుధవారం 8 గంటలకి వచ్చే, "బినాకా గీత్ మాలా" అంటే ఇష్టపడని వారుండరు.అమీన్ సయాని అద్భుతమైన యాంకరింగ్ తో వచ్చే ప్రోగ్రాం కోసం అందరం ఎదురు చూసే వాళ్ళం. మా రేడియో హాల్లో ఉన్నా, వాల్యూం పెంచితే పదిళ్ళ వరకు వినబడేది. అదీ నేషనల్ ఎకో పవరంటే!  ఆ రొజు మా నాన్న ఇంట్లో ఉన్నా అప్పుడు మాత్రం ఏమి అనేవాడు కాదు(ఎందుకో?)  
        

    ఇక సినిమాలంటే గుర్తుకొచ్చేది "మనుషులు మారాలి" సినిమా. దాదాపు యాభై ఏళ్ళ క్రితం (1969) ఓ ఆదివారం వచ్చింది. మా అమ్మతో పాటు కాలనీలో కొంతమంది, మా అక్కలు, చెల్లెళ్ళు, అందరూ కలిసి సినిమా వింటూ ఎక్కి ఎక్కి ఏడ్వటం ఇప్పటికి గుర్తుంది. ఇప్పుడు తల్చుకుంటే నవ్వొస్తుంది..ఈ సందర్భంగా " మనం చిన్నప్పుడు ఏడ్చిన సంఘటనలు గుర్తొస్తే నవ్వొస్తుంది.. అప్పుడు నవ్విన  సంఘటనలు గుర్తొస్తే ఏడుపొస్తుంది!" అన్నది ఎంత కరెక్టో! అప్పుడు ఏడ్చిన(మా అమ్మతో సహా) రెండు మూడు మొహాలు నాకు ఇప్పటికీ  బాగా గుర్తున్నాయి. తమాషా ఏమిటంటే ఆ సినిమా నడుస్తుండగా నేను నిద్ర పోయాను. నేను మధ్యాహ్నాలు నిద్రపోవటం అరుదు (ఇప్పుడు కూడా). ఉన్నట్టుండి మెలుకువ వచ్చింది. నోరంతా చేదుగా ఉంది. పాలు పోసే యెల్లమ్మ అరుస్తోంది.. నేను వెంటనే బాత్రూం కు వెళ్ళి పళ్ళు తోముకోవటం మొదలు పెట్టాను. అందరు నన్ను వింతగా చూస్తున్నారు. నాకు ఏమి అర్థం కాలేదు. మా అమ్మ కళ్ళు ఏడ్చి,ఏడ్చి ఎర్రగా ఉన్నాయి, కాని నవ్వుతూ,"ఎందుకురా మొహం కడుక్కుంటున్నావు?"  అనడిగింది. నేను అమాయకంగా స్కూల్ కు వెళ్ళాలి కదా అన్నాను. అప్పుడు చూడాలి నవ్వులు. నాకు సిగ్గేసింది.. నాన్న షరా మామూలుగా తిట్టడం. అప్పటి నవ్వులు తలుచుకుంటే ఇప్పుడు కన్నీళ్ళొస్తాయి!!   
    మా అమ్మక్కూడా నేషనల్ ఎకో అంటే చాలా  ఇష్టం ఉండేది. రేడియోలో వచ్చే తెలుగు పాటల్లో అమ్మకి రెండు పాటలంటే ఇష్టం. ఒకటి నేనంటే నేనే సిన్మాలో "అంబవో శక్తివో- ఆంకాళ దేవీవో"(నటి కాంచన)  అన్న పాట కు సౌండ్ బాగా పెంచి మా అమ్మ డాన్స్ చేసేది! ఇరుగూ-పొరుగూ వాళ్ళు వచ్చే వారు. ఇక మా ఇంటి ఆడపిల్లలు సరే సరి! మా అమ్మకు నచ్చి, డాన్స్ చేసే మరో పాట పూజా ఫలం సిన్మా లోని "పగలే వెన్నెల" పాట. దాన్ని మా అమ్మ పాడేది కూడాను.కొన్ని సార్లు డాన్స్ తర్వాత మా అమ్మ ఎందుకో కన్నీళ్ళు పెట్టుకునేది. అప్పటి మా అమ్మ ఎనర్జీ చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. మేము స్కూల్ వెళ్ళిన  తర్వాత మా అమ్మకు నేస్తాలు, నేషనల్ ఎకో రేడియో, ఎదురింట్లో ఉండే ఆమే అక్క పిల్లలు! మా అమ్మ ఫేవరైట్ హిందీ పాట ఓ కౌన్ థీ సిన్మాలోని " నైనా బర్సే" పాట. అది తరచూ పాడేది మా అమ్మ. ఆ పాటలో సాధనను చూసి మా చెల్లికి "సాధన్ కటింగ్" కూడా చేయించినట్లు  గుర్తు.  

ఇక క్రికెట్ కామెంటరి అంటే మా రేడియో చుట్టూ మూగే వాళ్ళం. . ఇంగ్లీష్  అంత అర్థం కాకపోయినా వినేవాళ్ళం. నాకిప్పటికి 1974 మద్రాస్ టెస్ట్ మ్యాచ్ గుర్తుంది. వెస్టిండీస్ బ్యాటింగ్ చేస్తోంది. మదన్ లాల్ కు ఒక వికెట్ పడింది. నేను పరిగెత్తుకుంటూ పక్కనే ఉన్న మా డేవిడ్ సుధాకర్ ఇంటికి వెళ్ళాను ఈ విషయం చెబ్దామని. అప్పటికే వాడూ వింటున్నాడు. నేను ఇంటికొచ్చేసరికి నాన్న రేడియో దగ్గరే కూచుని వార్తలు వింటున్నాడు! నాకు భయమేసింది. ఆయన బ్యాండు మార్చలేదు. మధ్యలో వచ్చే వార్తలు వింటున్నాడు. నన్ను ఏమి అన్లేదు.

        అప్పట్లో రేడియోలకి లైసెన్స్ ఉండేది. బీ.క్యాంప్ పోస్ట్ ఆఫీస్ లో లైసెన్స్ కట్టే వాళ్ళం సంవత్సరానికోసారి. ఆ లైసెన్స్ బుక్కు చాల కాలం వరకు నా బీరువాలో ఉండేది. చిత్రమేమిటంటే నాన్నకు సంగీతం, సిన్మాలు ఇష్టం లేకపోయినా రేడియోను జాగ్రత్తగా చూసుకునేవాడు. దానికి కవర్ కూడా కుట్టించాడు.(కొన్నాడేమో). దాన్ని ప్రతి నెలా ఉతికించేవాడు. రేడియో కోసం ఒక టేబుల్(అదిప్పటికీ ఉంది),చెక్క కుర్చీ(ఇది కూడా ఉంది) చేయించాడో, కొన్నాడో తెలియదు కాని, ఉండేది. కొంత కాలం తర్వాత రేడియో అరలోకి మారింది. బహుశా నాన్న ఫైల్స్ రాసుకోవటానికేమో.

        అప్పుడు ట్రాన్సిస్టర్లు తక్కువ. అన్ని వాల్వ్ రేడియోలే. ఆన్ చేసిన రెండు మూడు నిముషాలకు సౌండ్ వచ్చేది. దానికేమన్నా రిపేర్ వస్తే ఒక్కరే బాగుచెయ్యాలి. అది "టైం అండ్ టోన్" శర్మ గారు. ఆయన్ వాచీలక్కూడా ఎక్స్పర్ట్. మా మాతామహుల వాచీని అయనకు తప్ప ఎవరికీ ఇచ్చేవారు కాదు.(అయినా ఆ రోజుల్లో ఎంతమంది వాచ్ రిపేరర్స్ ఉన్నారని). కాని మా రేడియో ఒకట్రెండు సార్లు మాత్రమే ఆయన దగ్గరికి తీసికెళ్ళినట్లు గుర్తు. మా నాన్నతో పాటు ఎవరైనా రిక్షా లో తీసుకెళ్ళేవారు. అది వచ్చే వరకు మాకు ఎలాగో ఉండేది. ముఖ్యంగా మా అమ్మకీ, మావయ్యకీ.

        ఎన్నో వర్షాకాలపు మధ్యాహ్నాలు, వేసవి రాత్రులు, వెచ్చటి చలి సాయంత్రాలు మమ్మల్ని ఆహ్లాద పరిచి ఆనందాన్నిచ్చిన  మా నేషనల్ ఎకో రేడియో ఇప్పటికి నా చెవులకి వినిపిస్తుంది,  కళ్ళకి కనిపిస్తుంటుంది కూడా!
ఇప్పుడు రేడియో వినేవాళ్ళు తక్కువ. అంత తీరిక ఎవ్వరికీ లేదు. ఒకవేళ విన్నా సెల్ ఫోన్ లోనే. ఇప్పుడు టైం అండ్ టొన్ శర్మ గారు లేరు, షాపూ లేడు. అమ్మా, నాన్న కూడా లేరు. రేడియోలు కనుమరుగైన(అవుతున్న) ఈ కాలంలో నేను ఇంకా వివిద్ భారతి వింటూనే ఉన్నాను, కాని ట్రాన్సిస్టర్లో! మా మావయ్య అదీ చెయ్యటం లేదు. సరిగ్గా వినపడదు కాబట్టి!

ఎప్పుడన్నా మా అమ్మ పాటలు ఇప్పటి రేడియోల్లో వస్తే పాత జ్ఞాపకా లూ వస్తాయి.  అమ్మ డాన్స్ గుర్తొస్తుంది..నాన్నా గుర్తొస్తాడు. ఒక రకమైన ఫీలింగ్ వస్తుంది..అప్పుడు మా నేషనల్ ఎకో లో ముఖేశ్ పాడిన "జానే కహ గయే ఓ దిన్.." పాట లీలగా వినిపిస్తుంది..మా రేడియో కళ్ళ ముందు కనిపిస్తుంది..  …కళ్ళు తడవుతాయి.
                        

 

 

(*ఈ రచయిత కొంటె కథలూ కాకరకాయలు రాసే కర్నూలు వాసి. స్పోర్ట్స్ జర్నలిజాన్ని పురిట్లోని వదిలేశాడు. ఇపుడేమో పర్సనాలిటి డెవెలప్ మెంటు అంటూ తెగ ఉపన్యాసాలిస్తూ, పర్వాలేదు, బాగానే సంపాయిస్తున్నాడు. కనిపించినోళ్లకంతా హోమియో వైద్యం ఉచితంగా చేస్తాడు.  ఈ నంబర్ లో దొరకుతాడు.పట్టుకోవచ్చు 9393737937)