'జియో' నిలువునా ముంచేసిందంటున్నారు!
గత 20-25 సంవత్సరాలలో అభివృద్ధి చెందిన టెక్నాలజీ - అంతకు ముందు 100 సంవత్సరాల కాలం మొత్తానికీ అభివృద్ధి చెందినదానికంటే ఎన్నో రెట్లు ఎక్కువన్న సంగతి తెలిసిందే. ఇలా శరవేగంతో మారిపోతున్న టెక్నాలజీతో ఆవిష్కారమవుతున్న ఎన్నోరకాల కొత్తఉద్యోగాలు, వ్యాపారాలు, ఉపాధిమార్గాలు కొంతకాలం రాజ్యమేలిన తర్వాత మాయమైపోవటం కూడా జరుగుతోంది. ఆ కోవలోనే, 1980, 1990 దశకాలలో రాజ్యమేలిన వీడియో పార్లర్ లు, ఎస్టీడీ బూత్ లు క్రమక్రమంగా అదృశ్యమైపోయ్యాయి. తాజాగా, అలా అదృశ్యమైపోతున్న జాబితాలోకి ఇంటర్నెట్ కేఫ్ లు వచ్చి చేరాయి.
80వ దశకంలో వీడియో పార్లర్ లు, 90వ దశకంలో ఎస్టీడీ బూత్ ల హవా ఎలా ఉండేది అందరికీ తెలిసిన విషయమే. వీడియో పార్లర్ లను తీసుకుంటే - వీడియో క్యాసెట్ లైబ్రరీలు, వీడియో ప్లేయర్ అద్దెకు ఇచ్చే వ్యాపారాలు జోరుగా సాగేవి. ఫ్లాపీ డిస్క్ లు, సీడీలు, డీవీడీలు రావటం, కంప్యూటర్ లు విస్తృతంగా అందుబాటులోకి రావటంతో వీడియో లైబ్రరీలు, వీడియో ప్లేయర్ లు కనుమరుగైపోయాయి. ఇక 90 వ దశకం మొదట్లో వచ్చిన ఎస్టీడీ బూత్ లు కూడా సమాజంలో ఒక భాగమైపోయాయి. జనావాసాలలో ప్రతిచోటా రోడ్లపక్కన ఈ బూత్ లు దర్శనమిచ్చేవి. అయితే 1992లో అప్పటి ప్రధానమంత్రి పీవీ నరసింహారావు, నాటి ఆర్థికమంత్రి మన్మోహన్ సింగ్ ఆర్థిక సంస్కరణలను ఆవిష్కరించటంతో 1995లో దేశంలోకి ప్రవేశించిన సెల్ ఫోన్ టెక్నాలజీ ఎస్టీడీ బూత్ లకు ముప్పుగా పరిణమించింది. 2000 సంవత్సరంనాటికి మొబైల్ ఫోన్ లు విస్తృతంగా అందుబాటులోకి రావటంతో ఎస్టీడీ బూత్ లకు గడ్డుకాలం ప్రారంభమయింది. 2005 నాటికి ఇవి పూర్తిగా అంతర్థానమయ్యాయి. వీటితోబాటు కాయిన్ బాక్సులు కూడా కనుమరుగైపోయాయి. ఆ మధ్యలో వచ్చిన పేజర్ లు అతికొద్దికాలం మాత్రమే నిలబడగలిగాయి.
ఇక ఇంటర్నెట్ సెంటర్ ల విషయానికొస్తే… కేంద్రప్రభుత్వరంగ సంస్థ 'వీఎస్ఎన్ఎల్' 1995ఆగస్టులో ఇంటర్నెట్ సేవలను మొట్టమొదటిసారిగా దేశంలో ప్రవేశపెట్టింది. 1996లో మొట్టమొదటి ఇంటర్నెట్ కేఫ్ ముంబైలోని లీల అనే ఫైవ్ స్టార్ హోటల్ లో 'సింప్లీ సైబర్ కేఫ్' అనే పేరుతో ప్రారంభమయింది. మొదట్లో వీఎస్ఎన్ఎల్ అధీనంలో మాత్రమేఉన్న ఇంటర్నెట్, 1998నుంచి ప్రైవేట్ సర్వీస్ ప్రొవైడర్ లకు అందుబాటులోకి వచ్చింది. ఒక్కసారిగా 200 ఐఎస్పీలు ఇంటర్నెట్ సర్వీసులు అందించేందుకు అనుమతిని పొందాయి. దేశంలో మొట్టమొదటగా ఇంటర్నెట్ సేవలను అందించిన ప్రైవేట్ ఐఎస్పీ - సత్యం ఇన్ఫో(సిఫీ). అలా మొదట మెట్రో నగరాలలో ప్రారంభమైన ఇంటర్నెట్ పార్లర్ లు 4-5 సంవత్సరాలలో చిన్నపట్టణాలు, గ్రామాలదాకా పాకిపోయాయి. వీటి ప్రస్థానం దాదాపు 20 ఏళ్ళపాటు అప్రతిహతంగా సాగింది. మొదట్లో గంటకు 50-100 రూపాయల వరకు తీసుకునేవారు. చాలా తక్కువ నెట్ స్పీడు(64కేబీపీఎస్ తో కూడా నడిపేవారు)తో, సీఆర్టీ మానిటర్ లతో ఉన్నప్పటికీ ఆ టెక్నాలజీని ఉపయోగించుకునేవారు పెద్ద సంఖ్యలో ఉండేవారు. ఇంటర్నెట్ పార్లర్ ల వద్ద క్యూలు కూడా కనబడుతుండేవి. ఒక్కోసారి గంట, రెండుగంటలు వెయిటింగ్ పీరియడ్ ఉండేది. ఉదయంనుంచి రాత్రి 10 గంటలవరకూ ఇవి తెరిచే ఉండేవి. మొదట్లో వీటిని పెట్టుకోవటానికి లైసెన్స్ లేకపోయినప్పటికీ, తర్వాత తర్వాత వీటికి లైసెన్స్ లు తప్పనిసరి అనే నిబంధన పెట్టారు. మొదట్లో 1998-1999 ప్రాంతాలలో ఇంటర్నెట్ సెంటర్ పెట్టాలంటే పెట్టుబడి బాగానే ఉండేది. అప్పట్లో డెస్క్ టాప్ కంప్యూటర్ ఒక్కొక్కటి లక్ష రూపాయలదాకా ఉండేది.
అంతులేని విజ్ఞాన భాండాగారంనుంచి తమకు కావలసిన సమాచారాన్ని తోడుకునేవారు కొందరైతే, ఈ మెయిల్ పంపుకునేవారు కొందరు, అప్లికేషన్స్ పంపుకునేవారు మరికొందరు, విదేశాలలోని తమ కుటుంబసభ్యులతో నెట్ ఫోన్ ద్వారా మాట్లాడేవారు కొందరు, గేమ్స్ ఆడుకునేవారు, పోర్న్ చూసేవారు ఇంకొందరు ఉండేవారు. మొదట్లో యాహూ చాట్, హాట్ మెయిల్, ఆర్కుట్ వంటి సోషల్ మీడియాను ఉపయోగించుకునేవారి సంఖ్య గణనీయంగానే ఉండేది. సంఘవిద్రోహక కార్యకలాపాలకు ఉపయోగించుకునేవారు ఎక్కువవటంతో గుర్తింపుకార్డులు చూపితేనే ప్రవేశం అంటూ నిబంధనలు కూడా పెట్టారు. ఇంటర్నెట్ సెంటర్ లు అప్పట్లో కస్టమర్లతో నిండుగా కళకళలాడుతూ ఉండేవి… ముఖ్యంగా యువతీయువకులతో. అక్కడ వారికి కొత్త కొత్త పరిచయాలు ఏర్పడటం, ప్రేమలు చిగురించటం కూడా జరిగేది. ఈ ఇంటర్నెట్ క్యూబికల్స్ చాలామంది ప్రేమికులు కలుసుకోవటానికి అడ్డాలాగా మారేవి. చాలావరకు ఈ కేఫ్ లు ఇరుకు ఇరుకుగా ఉండే క్యూబికల్స్ తో ఏర్పాటు చేసినప్పటికీ, సౌకర్యవంతంగా విశాలంగా, అత్యాధునిక సౌకర్యాలున్న కేఫ్ లు కూడా అక్కడక్కడా ఉండేవి.
ఈ ఇంటర్నెట్ సెంటర్ లకు ఆరేడు సంవత్సరాలనుంచి గడ్డుకాలం మొదలయింది… మొబైల్ ఫోన్ సర్వీస్ ప్రొవైడర్ లు బ్రాడ్ బ్యాండ్ సేవలను తక్కువ ధరలకు అందించటంతో. బీఎస్ఎన్ఎల్, ఎయిర్ టెల్, ఐడియా, టాటా టెలికామ్, బీమ్(ఇప్పుడు'యాక్ట్'), హాత్వే వంటి పలు సంస్థలు తక్కువ రెంట్లకే బ్రాడ్ బ్యాండ్ సేవలను నేరుగా ఇళ్ళలోకే అందించటం ప్రారంభించాయి. ఇళ్ళలో, ఆఫీసుల్లో ఇంటర్నెట్ వ్యాప్తి గణనీయంగా పెరిగింది. ఈ ప్రభావంతోనే వ్యాపారం తగ్గిపోయిందనుకుని దిగులుపడుతున్న ఇంటర్నెట్ సెంటర్ ల యజమానులపై, మూలిగే నక్కమీద తాటిపండులా గత ఏడాది అంబానీగారి మానసపుత్రిక 'జియో' వచ్చిపడింది. ఇక ఆ తర్వాత జరిగిందేమిటో అందరికీ తెలుసు. ప్రతిఒక్కరి స్మార్ట్ ఫోన్ లోకి కుప్పలు తెప్పలుగా డేటా వచ్చిపడిపోతోంది. ఇక ఇంటర్నెట్ సెంటర్ ల అవసరమేముంటుంది. జియో పుణ్యమా అంటూ మిగిలిన సర్వీస్ ప్రొవైడర్ లు కూడా చచ్చినట్లు డేటా రేట్లను తగ్గించక తప్పిందికాదు. మైక్రో కంప్యూటర్ లు అనిపిస్తున్న స్మార్ట్ ఫోన్ లలో కారుచౌకగా డేటా లభిస్తుండటంతో ఇక ఇంటర్నెట్ కేఫ్ ల యజమానులు ఈగలు తోలుకోవలసిన అగత్యం ఏర్పడింది.
పై మూడు ఉదాహరణలను గమనిస్తే ఈ మూడూ టెక్నాలజీకి సంబంధించినవే. ఇవి 25 ఏళ్ళక్రితం లేవు. ఈ 25 ఏళ్ళలోనే రావటం, కనుమరుగైపోవటం కూడా చకాచకా జరిగిపోయింది. ఈ మూడే కాదు… ఇవాళ అత్యంత ఆకర్షణీయమైన ఉద్యోగంగా భావించే సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ఉద్యోగం కూడా అంతకుముందు లేనిదే. ఈ సాఫ్ట్ వేర్ ఉద్యోగాలకు కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆటోమేషన్ వంటి కొత్త టెక్నాలజీల వలన ఇటీవల ముప్పు ఏర్పడిందని అంటున్న సంగతి తెలిసిందే. అటు మేనుఫేక్యరింగ్ రంగం(ఫ్యాక్టరీలు)లో రోబోలు, కంప్యూటర్ ప్రోగ్రామ్స్ తో కార్మికుల సంఖ్య గణనీయంగా తగ్గిపోతోందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇక డ్రైవర్ లెస్ కార్ ల ప్రవేశం గురించి జరుగుతున్న చర్చ తెలిసిందే. రోబో వెయిటర్ లు, రోబో జర్నలిస్టులు కూడా వస్తున్నారనే వార్తలు వస్తున్నాయి. మరోవైపు యాప్ డెవలపర్, సోషల్ మీడియా ఎనలిస్ట్, సోషల్ మీడియా మేనేజర్, డేటా మైనింగ్ ఎక్స్ పర్ట్, ఎల్డర్ కేర్ సర్వీస్ ప్రొవైడర్, యూజర్ ఎక్స్ పీరియన్స్ డిజైనర్ వంటి కొత్త ఉద్యోగాలు పుట్టుకొస్తున్నాయి. కాబట్టి 'ఈ ప్రపంచంలో స్థిరంగా ఉండేది మార్పు ఒక్కటే' అని ఎవరో అన్నట్లుగా, మార్పు అనివార్యం. కావలసిందల్లా మార్పుకు అనుగుణంగా మనం మారటమే.
కనుమరుగైపోతున్న ఉద్యోగాలు: టైపిస్ట్, స్టెనోగ్రాఫర్, పోస్ట్ మ్యాన్, టెలిఫోన్ ఆపరేటర్ మొదలైనవి.
కనుమరుగైపోతున్న వస్తువులు: పోస్టల్ కార్డ్, ఇన్లాండ్ లెటర్, టైప్ రైటర్, ఫ్లాపీ డిస్క్, డాట్ మేట్రిక్స్ ప్రింటర్, కార్బన్ పేపర్, సీఆర్టీ టీవీ(డబ్బాటీవీ), ఎంపీ3 ప్లేయర్, ఫిల్మ్ కెమేరా మొదలైనవి.
(* శ్రవణ్ బాబు హైదరాబాద్ కు చెందిన సీనియర్ జర్నలిస్టు, ఫోన్: 9948293346)